Monday, 19 December 2022

ఆ గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, పంచాయతీ సెక్రటరీ సస్పెన్షన్

 ఆ గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, పంచాయితీ కార్యదర్శి సస్పెన్షన్



తెలంగాణ:

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గాజులగట్టు గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి గ్రామపంచాయతీలో అవినీతి అక్రమాలు పాల్పడ్డందుకు, ఎటువంటి పనులు చేయకుండా పనిచేసినట్టు ఎంబిలు రికార్డు చేసి అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలో భాగంగా మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సస్పెన్షన్ చేయడం జరిగిందని అధికారులు తెలిపారు. గతంలో గ్రామపంచాయతీలో అవినీతి జరిగిందని పెద్ద ఎత్తున స్థానిక పంచాయతీ వార్డు మెంబర్లు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసింది. అందులో భాగంగా విచారణ చేసిన అధికారులు వారి పైన సస్పెన్షన్ వేటు వేయడం జరిగిందని తెలిపారు. ఇట్టి విషయమై ఎంపీఓను వివరణ కోరగా సస్పెన్షన్ ఆయన విషయం వాస్తవమేనని తెలిపారు.

Friday, 11 November 2022

మళ్లీ కోవిడ్ విజృంభణ..

 మళ్లీ కోవిడ్ విజృంభణ..



తెలంగాణ:

చైనాలో కోవిడ్ కేసులు మరోసారి విజృంభిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 11 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చాలా వరకు ఎలాంటి లక్షణాలు లేనివారిలో కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో చైనా రాజధాని బీజింగ్ లో సిటీ పార్కులను మూసివేశారు. అలాగే, పలు కోవిడ్ ఆంక్షలు అమలులోకి వచ్చాయి. పలు ప్రాంతాల్లో లాక్ డౌన్ విధించారు. అలాగే స్కూల్స్ కూడా మూతబడ్డాయి. దీంతో, విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. కాగా, పలు దుకాణాలు, రెస్టారెంట్లు కూడా బంద్ అయ్యాయి. కరోనా కేసులు పెరుగుతుండటంతో చైనా ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు పరుస్తుంది. గాంగ్‌ఝౌ పట్టణంలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. అక్కడ కొద్దిరోజులుగా రెండువేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. జనాభా అధికంగా ఉన్న హైఝులో ఇన్ఫెక్షన్లు పెరుగుతుండడంతో ఆదివారం వరకు కఠిన లాక్‌డౌన్ విధించారు. నిత్యావసరాల కొనుగోలుకు ఇంట్లో ఒక్కరు మినహా ఎవరూ బయటకు రాకూడదని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

Friday, 28 October 2022

బావిలోకి దూసుకెళ్లిన కారు..

 బావిలోకి దూసుకెళ్లిన కారు..



- రెండు మృతదేహాలు లభ్యం..

- మృతుల సంఖ్య పెరిగే అవకాశం..

- కారులో మొత్తం 8 మంది ఉన్నట్లు సమాచారం..


తెలంగాణ:

మహబూబాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. దైవ దర్శనం వెళ్లి వస్తుండగా, ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం మండల కేంద్రం శివారులోని ఉన్న ఓ మూలమలుపు వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అన్నారం షరీఫ్ వచ్చి తిరిగి వెళ్తుండగా కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న బావిలో పడింది. ఈ కారులో డ్రైవర్ సహా ఎనిమిది మంది ఉన్నట్లు తెలిసింది. ఇప్పటి వరకు ఇద్దరి మృతదేహాలు లభ్యం అయ్యాయి. మరో ఇద్దరు మృతి చెందినట్లుగా భావిస్తున్నారు. కారులో ఉన్నవాళ్లలో కొందరు గాయపడినట్లు తెలుస్తుంది. ఖమ్మం జిల్లా ఇల్లందు ప్రాంతానికి చెందిన వారీగా గుర్తించారు. కేసముద్రం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని బావిలో నుంచి కారును, బావిలో పడిన బాధితులను స్థానికుల సహకారంతో వెలికి తీసే ప్రయత్నాలు చేపట్టారు.

Thursday, 27 October 2022

ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో మహిళా సిబ్బంది మందు దావత్..

 ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో మహిళా సిబ్బంది మందు దావత్..



తెలంగాణ:

హన్మకొండ పట్టణంలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో మహిళా సిబ్బంది మందు పార్టీ చేసుకోవడం ప్రస్తుతం అంతా చర్చనీయాంశంగా మారింది. స్టాఫ్‌రూమ్‌లో బీర్లు తాగుతూ కొంతమంది మహిళా సిబ్బంది హల్ చల్ చేశారు. చికిత్స కొరకు ఆసుపత్రికి వచ్చిన రోగులను గాలికి వదిలేసి ఎంచక్కా బీర్లు తాగుతూ ఎంజాయ్ చేశారు. మందుపార్టీలో ఒక ఆరోగ్యశ్రీ ఉద్యోగి, ఒక స్టాప్ నర్స్, మరొక జీఎన్‌ఎమ్ ఉన్నారు. కాగా,  సిబ్బంది వెకిలి చేష్టలపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్పిటల్‌ను బార్‌గా మార్చిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Monday, 17 October 2022

మునుగోడులో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం.. బైపోల్ బరిలో 47 మంది అభ్యర్థులు..

 మునుగోడులో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం.. బైపోల్ బరిలో 47 మంది అభ్యర్థులు..



తెలంగాణ:

మునుగోడు నామినేషన్ ఉపసంహరణ ప్రక్రియ నేటితో ముగిసింది. ఉపఎన్నిక బరిలో మొత్తం 47 మంది అభ్యర్థులు ఉన్నారు. మొత్తం 130 మంది నామినేషన్లు వేశారు. స్క్రూటీనీలో 47 మంది నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. దీంతో 83 మంది అభ్యర్థుల్లో 36 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. చివరకు మునుగోడు ఉప ఎన్నిక బరిలో 47 మంది అభ్యర్డులు మిగిలారు. మునుగోడు ఉపఎన్నిక నవంబర్ 3వ తేదీన జరగనుండగా, 6వ తేదీన ఫలితాన్ని వెల్లడిస్తారు.   

మునుగోడు ఉప ఎన్నిక రాష్ట్రంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు కీలకంగా మారింది. మునుగోడు ఉప ఎన్నికలో విజయం సాధిస్తే, రాబోయే ఎన్నికలపైనా ఆ ప్రభావం తప్పనిసరిగా ఉంటుందని అన్ని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో మునుగోడును సీటును గెలుచుకునేందుకు అన్ని పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇప్పటికే ప్రచారంలో మరింత స్పీడు పెంచాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులు హోరా హోరీగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి పాల్వాయి స్రవంతి, టీఆర్ఎస్ పార్టీ నుండి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీ నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బీఎస్పీ నుంచి అందోజు శంకరాచారి, టీ‌జే‌ఎస్ నుంచి పల్లె వినయ్ కుమార్ లు బరిలో ఉన్నారు. ఇప్పటికే అభ్యర్థులు ఎవరికి వారు సరికొత్త వ్యూహాలతో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో బిజీ బిజీగా ఉన్నారు.

Wednesday, 12 October 2022

మునుగోడు ఉపఎన్నికపై ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

 మునుగోడు ఉపఎన్నికపై ఎన్నికల సంఘం కీలక నిర్ణయం



తెలంగాణ:

తెలంగాణలో ప్రస్తుతం మునుగోడు కేంద్రంగా రాజకీయాలు తెగ హీటెక్కుతున్నాయి. నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది. ఈ నెల 14వ తేదీతో నామినేషన్లకు సమయం ముగియనుంది. మూడు ప్రధాన పార్టీలకు మునుగోడు గెలుపు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. ఈ సమయంలో ఎన్నికల సంఘం మునుగోడు పరిణామాలను డేగ కన్నుతో పరిశీలిస్తోంది. పలు ప్రాంతాల్లో నగదు దొరుకుతుండటంతో మరితంగా అప్రమత్తమైంది. అందులో భాగంగా ఎన్నికల నిర్వహణ కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ఎక్కడా ఉప ఎన్నికలో అవకతవకలు జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటోంది.

ఇప్పటికే ఓటర్ల జాబితా పైన బీజేపీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. అటు నగదు పెద్ద ఎత్తున పంపిణీ చేయటానికి సిద్దమయ్యారంటూ రాజకీయంగా ఆరోపణలు వస్తున్నాయి. దీంతో, ఎన్నికల సంఘం మునుగోడు ఎన్నికల నిర్వహణకు ముగ్గురు పరిశీలకులను నియమించింది. ప్రతీ ఎన్నికలో ఇదే తరహాలో పరిశీలకుల నియామకం జరుగుతుంది. కానీ, మునుగోడు లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల్లో వీరి పాత్ర కీలకం కానుంది. ఇప్పటికే దాదాపుగా రూ 10 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో ఎన్నికల సంఘం సాధారణ పరిశీలకునిని, పోలీసు పరిశీలకున్ని, వ్యయ పరిశీలకుడిని నియమించింది. సాధారణ పరిశీలకునిగా మహారాష్ట్ర ఐఏఎస్ అధికారి పంకజ్ కుమార్​ను ఈసీ నియమించింది.

నెల 14 వ తేదీ నుంచి వచ్చే నెల ఆరో తేదీ వరకు మునుగోడులో పరిశీలకునిగా కొనసాగనున్నారు. అదే విధంగా..పోలీసు పరిశీలకునిగా ఛత్తీస్​గఢ్​కు చెందిన ఐపీఎస్ అధికారి మయాంక్ శ్రీవాస్తవను నియమిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 14 వ తేదీ నుంచి వచ్చే నెల మూడో తేదీ వరకు విధుల్లో ఉంటారు. వ్యయ పరిశీలకులుగా ఐఆర్ఎస్ అధికారిణి సమతా ముళ్లమూడిని నియమించారు. వ్యయ పరిశీలకులు ఈ నెల 13వ తేదీ నుంచి పోలింగ్ తేదీ అయిన నవంబర్ మూడో తేదీ వరకు మునుగోడు నియోజకవర్గంలో విధులు నిర్వర్తిస్తారు. ఈ ముగ్గురు ఎన్నిక తమకు సంబంధించిన విధుల్లో చేరాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.

Saturday, 8 October 2022

తిరుమల భక్తులకు టిటిడి కీలక సూచన..

 తిరుమల భక్తులకు టిటిడి కీలక సూచన..



తెలంగాణ:

తిరుమల కొండలు భక్తులతో కిటకిటలాడిపోతున్నాయి. ఏడు కొండల వెంకన్న స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ క్రమంలోనే టీటీడీ కీలక సూచన చేసింది. శ్రీవారి దర్శనం కోసం రెండురోజులుగా భక్తులు పోటెత్తడంతో,  విపరీతమైన రద్దీ ఏర్పడింది. తమిళులు పవిత్రంగా భావించే పురటాసి మాసం, రెండో శనివార దానికి తోడు వరుస సెలవురోజలు అన్నీ కలిసి తిరుమల గిరుల్ని సందడిగా మార్చేశాయి. క్యూ లైన్లు, మాడ వీధులు, లడ్డూ కౌంటర్లు, అఖిలాండం, అన్నప్రసాదం, ఉచిత సత్రాలు, కళ్యాణ కట్ట, బస్టాండ్,  వీగోగర్భం వరకు దర్శన క్యూలైన్లు

నిండిపోయాయి. మరో నాలుగు రోజులు రద్దీ ఉంటుందని టీటీడీ అంచనా వేస్తుంది. శ్రీవారి దర్శనం కోసం వర్షాన్ని కూడా లెక్క చేయడం లేదు భక్తులు. రద్దీని చూసుకొని దర్శనానికి ప్లాన్‌ చేసుకోవాలని టీటీడీ సూచిస్తుంది. ఈ క్రమంలో తిరుమల భక్తులకు హైఅలెర్ట్ చేసింది టీటీడీ. దర్శన క్యూలైన్లు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం క్యూలైన్లలో ఉన్నవారికే శ్రీవారిని దర్శించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ఆదివారం ఉదయం తిరిగి క్యూలైన్లలోకి భక్తులను అనుమతించనున్నారు. ఈ క్రమంలోనే భక్తులను క్యూలైన్లలోకి తరలించే బస్సులు నిలిపివేశారు.



తెలుగువారికి శ్రావణమాసం ఎలాగో తమిళులకు పురటాసి మాసం అంతటి పవిత్రం. శ్రావణమాసంలో ఇక్కడ శివారాధనకు ప్రాముఖ్యతనిస్తారు. పురటాసి మాసంలో తమిళులు వైష్ణవాలయాల్లో పూజలు నిర్వహిస్తారు. అందుకే, ఈనెలలో వచ్చే ఒకటి, మూడు, ఐదో శనివారాలు ఉపవాసాలుండి,  తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోవడం తమిళుల ఆనవాయితీ. దాని పలితమే కొండపై ఈ రద్దీ. ప్రస్తుతం శ్రీవారి దర్శనానికి 48 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్ నుండి 6 కిలోమీటర్ల మేర క్యూలైన్లు నిండిపోయాయి. వైకుంఠంలోని కంపార్ట్ మెంట్లతో పాటు, నారాయణగిరిలోని 9 షెడ్లు నిండిపోయాయి. బ్రహ్మోత్సవాల త‌ర్వాత ట్రాఫిక్ ఇబ్బందులు, భ‌క్తుల రాక‌పోక‌ల క‌ష్టాల్ని గుర్తించి క్యూలైన్ రూట్లో మార్పు చేసింది టీటీడీ. గోగర్భం డ్యాం సర్కిల్ నుంచి కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త క్యూ లైన్లు కూడా పురటాసి మాసం రద్దీతో కిటకిటలాడిపోతున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా క్యూలైన్లలో అల్పాహారం, మంచినీటిని శ్రీవారి సేవకుల ద్వారా సరఫరా చేస్తున్నారు. అటు సీఆర్వో ఆఫీస్ కౌంట‌ర్ క్లోజ్‌ చేయడంతో వసతి గదుల కోసం తిప్పలు పడుతున్నారు భక్తులు. కొండపై ఎక్కడ చోటు దొరికితే అక్కడ సేదదీరుతున్నారు. కొండమీద రద్దీ కష్టాలు అలా వుంటే, వీఐపీల తాకిడి కూడా అదే స్థాయిలో ఉంది.

ఆ గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, పంచాయతీ సెక్రటరీ సస్పెన్షన్

  ఆ గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, పంచాయితీ కార్యదర్శి సస్పెన్షన్ తెలంగాణ: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గాజులగట్టు గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, ...