తిరుమల కొండెక్కిన ఎలక్ట్రిక్ బస్సు.. ఇక కొండపై పొల్యూషన్ కు చెక్ పడ్డట్లే..!
తెలంగాణ:
తిరుమల కొండపై కాలుష్య నివారణకు ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈరోజు తిరుమలలో ఎలక్ట్రిక్ బస్సుతో ట్రయల్ రన్ నిర్వహించారు. ఆర్టీసీ నిపుణులు ఈ బస్సులో ఎక్కి తిరుపతి నుంచి రెండో ఘాట్ రోడ్డు ద్వారా తిరుమల చేరుకున్నారు. తిరుపతిలోని అలిపిరి డిపో నుంచి తిరుమల రెండో ఘాట్ నుంచి కొండపైకి వెళ్లింది.
తర్వాత, తిరుమలలోనే ఎత్తయిన ప్రదేశమైన శ్రీవారి పాదాల వద్దకెళ్లి, తిరిగి మొదటి ఘాట్ నుంచి అలిపిరి డిపోకు చేరుకుంది. ఇలానే సాయంత్రం కూడా మరోమారు ఈ బస్సును నడిపారు. మొత్తం రెండు ట్రిప్పులను నడిపి పరీక్షించారు. ఈ క్రమంలో ఎత్తయిన ప్రదేశాల్లో, మలుపుల్లో బస్సు పనితీరును గమనించారు. ఐఐటీ ప్రొఫెసర్లు కూడా ఆర్టీసీ ప్రమాణాల ప్రకారం బస్సు కండీషన్, ఇతర సాంకేతిక పరమైన అంశాలనూ నిశితంగా పరిశీలించారు.వారం రోజుల్లో మరో పది బస్సులు రానున్నాయని, శ్రీవారి బ్రహ్మోత్సవాల్లోనే ఈ బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి తెస్తామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. టికెట్ ధరను కమిటీ త్వరలోనే నిర్ణయిస్తుందని చెప్పారు.
ఏపీలో ఎలక్ట్రిక్ బస్సుల కోసం ప్రభుత్వం ఒలెక్ట్రా గ్రీన్ టెక్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందం ప్రకారం 100 బస్సులను ఒలెక్ట్రా ఏపీఎస్ఆర్టీసీకి అందించాల్సి ఉంది. ఇప్పటికే పలు బస్సులు అలిపిరి డిపోకు చేరుకున్నాయి. ప్రత్యేకంగా శిక్షణ పొందిన డ్రైవర్లనే ఈ ఎలక్ట్రిక్ బస్సుల్లో డ్రైవర్లుగా నియమించనున్నారు.



No comments:
Post a Comment