Friday, 3 June 2022

మాస్క్ ధరించని వారిపై చర్యలు..

 మాస్క్ ధరించని వారిపై చర్యలు..




వెంకటేశ్వర్లపల్లి/ తెలంగాణ:


కోవిడ్-19 మహమ్మారి తీవ్రత తగ్గలేదని, దీని పట్ల అప్రమత్తత తప్పనిసరి అని ఢిల్లీ హైకోర్టు తెలిపింది. విమానాశ్రయాలు, విమానాల్లో మాస్క్ ధారణ, చేతుల పరిశుభ్రతలకు సంబంధించిన నిబంధనలను కట్టుదిట్టంగా పాటించనివారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. ఈ నిబంధనలను ఉల్లంఘించినవారికి జరిమానాలు విధించాలని, వారిని నో-ఫ్లై లిస్ట్‌లో పెట్టాలని తెలిపింది. కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి నిరోధానికి జారీ చేసిన మార్గదర్శకాలు, నిబంధనలను ఉల్లంఘించేవారిపై కఠినంగా వ్యవహరించాలని చెప్పింది. ఉల్లంఘనదారులకు జరిమానా విధించి, వసూలు చేయాలని, వారు విమానాల్లో ప్రయాణించకుండా చర్యలు తీసుకోవాలని తెలిపింది. ఈ నిబంధనలను ఎంత శ్రద్ధగా రూపొందించారో, అంత శ్రద్ధగా అమలు చేయడం లేదని గుర్తించినట్లు తెలిపింది. తరచూ ఈ నిబంధనల ఉల్లంఘన జరుగుతోందని పేర్కొంది. వీటిని సమగ్రంగా అమలు చేయవలసిన అవసరం తప్పకుండా ఉందని, ఈ బాధ్యత డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) సహా అధికారులందరికీ ఉందని పేర్కొంది. 

ఈ నిబంధనలను అమలు చేసే అధికారాన్ని విమానాశ్రయాలు, విమానాల్లో పని చేసే సిబ్బంది, అధికారులకు కల్పించాలని అన్ని ఎయిర్‌లై్న్స్‌కు డీజీసీఏ ఆదేశాలు ఇవ్వాలని తెలిపింది. మాస్క్ ధారణ, చేతుల పరిశుభ్రత నిబంధనలను ఉల్లంఘించే ప్రయాణికులపై చర్యలు తీసుకునేందుకు  ఎయిర్ హోస్టెస్‌లు, కెప్టెన్లు, పైలట్లు సహా  ఇతర అధికారులకు అధికారాన్ని కల్పించాలని తెలిపింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విపిన్ సంఘీ, జస్టిస్ సచిన్ దత్తా ధర్మాసనం ఈ ఆదేశాలు ఇచ్చింది. 

డీజీసీఏ తరపున న్యాయవాది అంజన గోసాయిన్ వాదనలు వినిపిస్తూ, కోవిడ్-19 ప్రోటోకాల్‌ను కచ్చితంగా అమలు చేయాలని మే 10న పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆదేశాలు ఇచ్చిందన్నారు. మాస్క్ ధారణకు సంబంధించిన అన్ని నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తున్నారని తెలిపారు. 

దీనిపై ధర్మాసనం స్పందిస్తూ, డీజీసీఏ ఈ ఆదేశాలను ఇవ్వడం సరైన చర్యేనని తెలిపింది. ఈ మహమ్మారి తీవ్రత ఇంకా తగ్గలేదని, తన వికృత రూపాన్ని ఇంకా ప్రదర్శిస్తూనే ఉందని పేర్కొంది. నిబంధనలు, మార్గదర్శకాలు ఉంటున్నాయని, కానీ వాటి అమలు వరకు వచ్చేసరికి మనం తడబడుతున్నామని పేర్కొంది. వీటిని సక్రమంగా అమలు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని, చేపట్టిన చర్యలకు సంబంధించిన నివేదికను సమర్పించాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణ జూలై 18న జరుగుతుందని తెలిపింది.

No comments:

Post a Comment

ఆ గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, పంచాయతీ సెక్రటరీ సస్పెన్షన్

  ఆ గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, పంచాయితీ కార్యదర్శి సస్పెన్షన్ తెలంగాణ: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గాజులగట్టు గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, ...