నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు..
తెలంగాణ:
నేటి నుంచి కొనసాగే వర్షాకాల సమావేశాలు వాడీవేడీగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి పలు పార్టీల ఫ్లోర్ లీడర్లు, నేతలు హాజరయ్యారు. ప్రభుత్వం తరపున కేంద్రమంత్రులు రాజ్నాథ్ సింగ్, పీయూష్ గోయల్ హాజరు కాగా.. కాంగ్రెస్ నుంచి మల్లిఖార్జున ఖర్గే, అధిర్ రంజన్ చౌధురి, జైరాం రమేశ్ సహా డీఎంకే, టీఎంసీ, ఎన్‌సీపీ, బీజేడీ, వైకాపా, తెరాస, ఆర్జేడీ, శివసేన నేతలు హాజరయ్యారు.
సభాసమయాన్ని సద్వినియోగం చేసుకునేలా సభలు సజావుగా సాగేలా సహకరించాలని అఖిలపక్ష సమావేశంలో ప్రహ్లాద్ జోషి పార్టీలను కోరారు. అయితే ధరల పెరుగుదల, అగ్నిపథ్, దర్యాప్తు సంస్థల దుర్వినియోగం వంటి అంశాలపై చర్చించాలని విపక్ష నేతలు డిమాండ్ చేశారు. ప్రభుత్వం విడుదల చేసిన అన్ పార్లమెంటరీ పదాలపైనా అభ్యంతరం తెలిపినట్లు సమాచారం.
అగ్నిపథ్ పథకాన్ని ఉపసంహరించుకోవాలని విపక్ష నేతలందరూ ముక్తకంఠంతో డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ధరల పెరుగుదల, దేశ ఆర్థిక పరిస్థితి వంటి కీలక అంశాలపై సమావేశాల్లో చర్చ జరపాలని పట్టుబట్టినట్లు సమాచారం.అఖిలపక్ష సమావేశంలో శ్రీలంక విషయంలో భారత్ జోక్యం చేసుకోవాలని డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు డిమాండ్ చేశాయి. లంకలోని తమిళుల పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో శ్రీలంక సంక్షోభంపై మంగళవారం అఖిల పక్ష సమావేశం నిర్వహించనున్నట్లు ప్రహ్లాద్ జోషీ వెల్లడించారు. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, జైశంకర్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ ఏర్పాటుచేసినట్లు తెలిపారు.

No comments:
Post a Comment