తెలంగాణకు జ్వరమొచ్చింది..
- డెంగీ, మలేరియాతో కిటకిటలాడుతున్న ఆసుపత్రులు..
- విష జ్వరాలు, సీజనల్ వ్యాధులతో ప్రజలు పరేషాన్..
- వర్షాలు, దోమలతో జర జాగ్రత్త..
తెలంగాణ:
తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు జ్వర బాధితుల సంఖ్య పెరిగిపోతుంది. గడచిన వారం రోజుల వ్యవధిలో వందల మంది దీని బారినపడినట్లు వైద్యారోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. గత నెల చివరి నాటికి రాష్ట్రంలో 1,720 డెంగీ కేసులు నమోదు కాగా., తాజాగా ఆ సంఖ్య 2,509కి చేరింది. అంటే వారం రోజుల్లో 789 మంది డెంగీ బారిన పడినట్లు వైద్యారోగ్య శాఖ లెక్కలు చెబుతున్నాయి. అంటే రోజుకి సుమారు వంది మందికి పైగా డెంగీ సోకుతోందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
డెంగీతో పాటు మలేరియా సైతం రాష్ట్రంలో వేగంగా ప్రబలుతోంది. ముఖ్యంగా కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో మలేరియా తీవ్ర రూం దాలుస్తోంది. కొత్తగూడెంలో ఇప్పటివరకు 242మందికి మలేరియా సోకగా, ములుగులో 160మంది మలేరియా జ్వరం బారినపడ్డారు. ఈ ఏడాది ఇప్పటివరకు రాష్ట్రంలో 608 మందికి మలేరియా సోకినట్లు వైద్య శాఖ ప్రకటించింది. గతనెల చివరినాటికి రాష్ట్రంలో కేవలం 116 మలేరియా కేసులు మాత్రమే ఉన్నాయి. అంటే, గత వారం రోజుల్లో 492 మంది వ్యాధి బారినపడ్డారు. ఇక వీటితో పాటు సాధారణ జ్వరాలు ప్రజలను పీడిస్తున్నాయి. వాతావరణంలో మార్పులు, వరుసగా కురుస్తున్న వర్షాలతో అనేక కుటుంబాలు జ్వరంతో ముసుగేస్తున్నాయి. కొవిడ్ నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ ఫీవర్ సర్వే నిర్వహిస్తోంది. ఈ గణాంకాల ప్రకారం జులై, ఆగస్టు నెలలు కలిపి రాష్ట్రంలో సుమారు ఐదు లక్షల మంది జ్వర పీడితులు ఉండటం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు జ్వర బాధితులతో కిటకిటలాడుతున్నాయి. గాంధీ ఆస్పత్రికి నిత్యం సుమారు వంద మంది జ్వర పీడితులు వస్తున్నట్టు సమాచారం. ఇక నగరంలోని ఫీవర్ ఆస్పత్రిలోనూ సైతం ఓపీ సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈసారి తరచూ వానలు పడుతుండటం, మారిన వాతావరణ పరిస్థితులు, ఉష్ణోగ్రతలు తగ్గడం, అన్నిచోట్లా నీరు నిల్వ ఉండటం, పారిశుధ్య నిర్వహణ లోపం. ఇవన్నీ కలిసి దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. కలుషితాలు వ్యాపిస్తున్నాయి. దీనితో వైరల్ జ్వరాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. చాలా మంది గొంతు నొప్పి, జ్వరంతో ఆస్పత్రులకు వస్తున్నారని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులతో విష జ్వరాలు, సీజనల్ వ్యాధులు మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
వాతావరణంలో మార్పుల కారణంగా న్యుమోనియా, దగ్గు, శ్వాస సంబంధ సమస్యలూ పెరుగుతున్నాయని అంటున్నారు. వాతావరణంలో మార్పు, మురుగు నీరు కారణంగా దోమల వ్యాప్తి చెందుతున్నాయి. ఏటా, వర్షాకాలం వచ్చిందంటే చాలు జ్వరాలకు సీజన్ మొదలవుతుంది. వందల సంఖ్యలో జ్వరబాధితులు ఉంటారు. అయితే, ఈ ఏడాది ఆ సంఖ్య మరింత పెరిగిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. జ్వరం లక్షణాలు ఉంటే తప్పక వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. వరుస పండుగల నేపథ్యంలో ఈ జాగ్రత్తలు మరింతగా పాటించాలి.



No comments:
Post a Comment