తిలాపాపం.. తలా పిడికెడు..!
తీర్మానం లేకుండానే నిధుల స్వాహా..
అన్నీ పనుల్లోనూ బోగస్ బిల్లులే..
బలిపశువులవుతున్న పంచాయతీ కార్యదర్శులు..
తెలంగాణ:
తిలాపాపం.. తలా పిడికెడు.. అన్న చందంగా తయారైంది తెలంగాణ గ్రామ పంచాయతీల పరిస్థితి. నూతన పంచాయతీ రాజ్ చట్టం-2018 కి అనుగుణంగా ప్రభుత్వం నెల నెలా జిపిలకు నిధులు మంజూరు చేస్తుంది. కానీ, ఆ నిధుల్లో కొందరు సర్పంచ్ లు చేతివాటం ప్రదర్శిస్తూ, నిధులు స్వాహా చేస్తున్నారు. ఆడిట్ సమయంలో జీపీల వారీగా రూ.20 వేల నుంచి రూ.లక్ష చొప్పున వసూలు చేస్తున్నారనే దండిగా ఆరోపణలు వస్తున్నాయి. పంచాయతీ పాలకవర్గం అనుమతి, ఆమోదం లేకుండా చిల్లిగవ్వ ఖర్చు పెట్టడానికి వీల్లేకపోవడంతో కొందరు సర్పంచులు తమ దోపిడీకి ప్రధానంగా త్రాగు నీరు, పారిశుధ్యం, వీధి లైట్లు తదితర వాటిని ఆయుధంగా మలుచుకున్నారు. బహిరంగ మార్కెట్లో బ్రాండెడ్ కంపెనీ ఎల్ఈడీ బల్బులు, ప్యానల్ వీధిలైట్లు కొంటే వాటికి ఏడాది కాలం పాటు వారంటీ, గ్యారంటీ ఉంటుంది. ఆ లోగా కాలిపోతే సదరు దుకాణాదారుడే వాటిని మార్చి కొత్తవి ఉచితంగా ఇస్తారు. పంచాయతీ పరిధిలో నైనా విద్యుత్ స్తంభాల సంఖ్య వెయ్యి లోపే ఉంది. అయితే కొందరు సర్పంచ్లు కరెంటు బల్బుల కొనుగోలు పేరిట బోగస్ బిల్లులను సమర్పించి ప్రతి నెలా రూ.లక్షల్లో నిధులను కాజేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. జీపీ నిధుల ఖర్చులో సుమారు 40 శాతం మేరకు కరెంటు బల్బుల కొనుగోలు బిల్లులే ఉంటున్నాయని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఓ గ్రామ ఉప సర్పంచ్ వాపోయారు. ఇక రూ.5 వేల లోపు కూలీలతో శానిటేషన్, తాగునీటి పైప్ లైన్ లీకేజీల మరమ్మతు పనులు చేయించవచ్చు. అయితే ఓచర్లు, మస్టర్ల ద్వారా కూలీలకు చెల్లింపులు జరిపే ముందు వాటిపై సంబంధిత ఇంజినీర్ల ధ్రువీకరణ అవసరం. అవేవీ లేకుండా సర్పంచ్లు విచ్ఛలవిడిగా దోపిడీకి పాల్పడుతున్నారనే విమర్శలూ ఉన్నాయి. నిధులు డ్రాచేసే అధికారం సర్పంచ్, ఉప సర్పంచ్‌లకే ఉన్నాయి. పంచాయతీ కార్యదర్శి బాధ్యతలు నామమాత్రమే. చెక్కుల జారీ సమయంలో తమ సెల్ ఫోన్ కు వచ్చే ఓటీపీ చెప్పడమే వారి బాధ్యత అయ్యిందని ఓ గ్రామానికి చెందిన పంచాయతీ కార్యదర్శి వాపోయింది. సర్పంచ్, ఉప సర్పంచ్ ల నిధుల స్వాహాను అరికట్టలేని చోట ఉన్నతాధికా రుల విచారణలో సెక్రటరీలు కూడా బలిపశువులుగా మారుతున్నారు. గల్లీల్లో అభివృద్ధి పనులు చేసుకునే వార్డు సభ్యులను సైతం వదలని సర్పంచ్లు వారి నుంచి 10 నుండి 20 శాతం వరకు పర్సంటేజీలను ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారు. పలు జీపీల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్న ఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి.
.jpg)
No comments:
Post a Comment