Sunday, 11 September 2022

కృష్ణంరాజు మృతితో తీవ్ర విషాదంలో ప్రభాస్..

 కృష్ణంరాజు మృతితో తీవ్ర విషాదంలో ప్రభాస్..



తెలంగాణ:

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. రెబల్‌స్టార్‌గా ఎంతో మంది అభిమానులని సొంతం చేసుకున్న కృష్ణంరాజు కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున  తుదిశ్వాస విడిచారు. కృష్ణంరాజు మరణవార్తతో ఆయన కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

కృష్ణంరాజు మరణ వార్త తెలుసుకున్న టాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు హాస్పిటల్‌కు చేరుకుంటున్నారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణం అటు టాలీవుడ్‌తో పాటు హీరో ప్రభాస్‌కి కూడా తీరని లోటని చెప్పాలి. నిన్న(శనివారం)తన పెదనాన్నను చూసేందుకు ప్రభాస్‌  ఏఐజీ హాస్పిటల్‌కు వెళ్లారు. దీనికి సంబంధించిన విజువల్స్‌ సోషల్‌ మీడియాలోనూ చక్కర్లు కొట్టాయి. 



గతంలోనూ అనారోగ్య సమ​స్యలతో కృష్ణంరాజు ఆసుపత్రిలో​ చికిత్స తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో, ఈసారి కూడా రెండు మూడు రోజుల అనంతరం ఆయన ఆరోగ్యంగా తిరిగి వస్తారని అనుకున్నారు. కానీ, అంతలోనే కృష్ణంరాజు ఇకలేరనే వార్త టాలీవుడ్‌కి షాక్‌ గురిచేసిందనే చెప్పాలి. పెదనాన్న కృష్ణంరాజుతో  ప్రభాస్‌కు ఎంతో అనుబంధం ఉంది. పాన్‌ ఇండియా స్టార్‌గా సత్తా చాటుతున్న ప్రభాస్‌ సినీ కెరీర్‌లో  కృష్ణంరాజు పాత్ర ఎంతో ఉంది.  నటుడిగా ప్రభాస్‌ ఇంత ఎత్తుకు ఎదగడం తనకు ఎంతో సంతోషమని కృష్ణంరాజు పలు సందర్భాల్లో చెబుతుండేవారు.

కృష్ణంరాజును కడసారి చూసేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన ఇంటికి చేరుకుంటున్నారు. కేంద్రమంత్రలు కిషన్‌రెడ్డి, సినీ నటులు మోహన్‌ బాబు, ఎంపీ రఘురామకృష్ణంరాజు తదితరులు నివాళులర్పించారు. రేపు మధ్యాహ్నం అభిమానుల కడసారి చూపుకోసం కోట్ల విజయ భాస్కర్‌రెడ్డి స్టేడియానికి తరలించనున్నారు. అటునుంచి మహాప్రస్థానంలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో కృష్ణంరాజు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా, రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు మరణం సినీ పరిశ్రమతో పాటు రరాజకీయ వర్గాలలోనూ తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన మరణంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కృష్ణంరాజు తనకు అత్యంత అప్తమిత్రుడని కేసీఆర్ పేర్కొన్నారు.



ఆయన అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌ను కేసీఆర్ ఆదేశించారు. దీంతో, కృష్ణంరాజు అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించేందుకు సోమేష్ కుమార్ ఏర్పాట్లు చేస్తున్నారు.

No comments:

Post a Comment

ఆ గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, పంచాయతీ సెక్రటరీ సస్పెన్షన్

  ఆ గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, పంచాయితీ కార్యదర్శి సస్పెన్షన్ తెలంగాణ: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గాజులగట్టు గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, ...