Wednesday, 7 September 2022

వంద రోజుల పనిలో ఇంటి దొంగల చేతివాటం..

 వంద రోజుల పనిలో ఇంటి దొంగల చేతివాటం..



ఉపాధి హామీ సొమ్మును నొక్కేసిన  గ్రామ సర్పంచ్.. 

ఆధారాలతో సహా పట్టుకున్న గ్రామస్తులు..

పంచాయతీ కార్యదర్శి, కారోబార్, మేట్ల ఇష్టా రాజ్యం..


తెలంగాణ:

గ్రామాభివృద్ధికి పాటుపడుతూ ఆదర్శంగా నిలవాల్సిన ఓ గ్రామ సర్పంచ్ ఆ గ్రామ రక్షణను పూర్తిగా మరిచి అతనే ఆ గ్రామ భక్షకునిగా మారిన సంఘటన ఖానాపూర్ మండలంలోని అయోధ్య నగర్ గ్రామంలో వెలుగులోకి వచ్చింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఒక్కరోజు కూడా పనిచేయకుండానే 100 రోజుల పాటు హాజరు వేయించుకోని, ఉపాధి హామీ డబ్బులు పొందాడు. 

మండలంలోని అయోధ్య నగర్ గ్రామ సర్పంచ్ తన పేరుతో జాబు కార్డును తీసుకున్నాడు. అనంతరం పని చేయకుండానే మస్టర్ లో హాజరు వేసుకుని డబ్బులు పొందాడు. ఈ తతంగమంతా ఉపాధి హామీ సిబ్బందికి తెలిసే జరిగిందంటూ అదే గ్రామానికి చెందిన పలువురు జిల్లా కలెక్టర్‌కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన ఆధారాలతో సహా వారు వివరాలు వెల్లడించారు.

అయోధ్య నగర్ సర్పంచ్ ఉపాధి హామీ పథకంలో ఒక్క రోజు కూడా పనిచేయకుండానే, చేసినట్లుగా హాజరు వేయించుకొని రూ. 30 వేల మేర అవినీతికి పాల్పడినట్లు తేలిందన్నారు. ఉపాధి హామీతోపాటు మిగతా అన్ని అభివృద్ధి పనుల్లో అయోధ్యనగర్ సర్పంచ్ అక్రమాలకు పాల్పడ్డాడని, గ్రామస్థాయిలో పూర్తి విచారణ చేపడితే అనేక అక్రమాలు బయటపడతాయని వార్డు మెంబర్లు జాయింట్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

ప్రభుత్వ సొమ్ము ఏమైనా పర్లేదు అనే ధోరణి ఉండడంతో అదే బలహీనత ఆధారంగా పంచాయతీ కార్యదర్శులు, మేట్లు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. కానీ, విచారణ అధికారులు టెక్నికల్ ఆధారాలు పక్కన పెట్టి సంప్రదాయ విధానాల ప్రకారం మమ అనిపించారనే విమర్శలు సైతం వినిపించాయి. కాగా, అయోధ్య నగర్ ఉదంతంతో సర్పంచుల అవినీతి బండారం అంతా ఇంతా కాదని తెలుస్తుంది. దీనితో పాటుగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సీనియర్ లని మించి అవినీతి వ్యవహారంలో మునిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.  మిగతా గ్రామాల్లో కూడా విచారణ జరిపి గ్రామస్తులకు న్యాయం చేయడంతో పాటు అక్రమాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

No comments:

Post a Comment

ఆ గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, పంచాయతీ సెక్రటరీ సస్పెన్షన్

  ఆ గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, పంచాయితీ కార్యదర్శి సస్పెన్షన్ తెలంగాణ: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గాజులగట్టు గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, ...