Wednesday, 31 August 2022

కొలువుదీరిన గణనాథులు..

 కొలువుదీరిన గణనాథులు..



ఆనందోత్సాహాల నడుమ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం..

వాడవాడనా వెలసిన మండపాలు..

మట్టి విగ్రహాలకే జై కొట్టిన భక్తులు..


తెలంగాణ:

గణపతి నవరాత్రి ఉత్సవాలు ఈరోజు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. విజ్ఞాలను తొలగించే వినాయక చవితి వేడుకలను బుధవారం భక్తులు కనుల పండువగా ఆరంభించారు. ఇళ్ల వద్ద మట్టి విగ్రహాలతో వేడుకలు జరుపుకోవడంతో పాటు వీధుల్లో, కూడళ్ళలో, వాడవాడనా మండపాలు, పందిళ్లు ఏర్పాటు చేసి గణనాథుడిని కొలువుదీర్చారు భక్తులు.



మరికొన్నిచోట్ల మండపాలను సినిమా సెట్టింగ్ తరహాలో ఏర్పాటు చేయడం మరో విశేషం.

ఈసారి భక్తులు పర్యావరణం పై దృష్టి సారించి మట్టి విగ్రహాలకే ప్రాధాన్యం ఇచ్చారు. భక్తుల్లో అవగాహన పెరగగా పలు స్వచ్ఛంద సంస్థలు మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు.

Monday, 29 August 2022

ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు రేపే..

 ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు రేపే..



తెలంగాణ:

తెలంగాణ ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు రేపు అనగా మంగళవారం విడుదలకానున్నాయి. ఉదయం 9:30 నిముషాలకు ఫలితాలు విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. ఫలితాల వెల్లడి అనంతరం అధికారిక వెబ్‌సైట్‌లో విద్యార్ధులు రిజల్ట్స్‌ చెక్‌ చేసుకోవచ్చు. కాగా, ఈ ఏడాది నిర్వహించిన ఇంటర్‌ పరీక్షలకు మొత్తం 9,28,262 మంది హాజరుకాగా, జూన్‌ 20న ప్రకటించిన ఫలితాల్లో ఫస్టియర్‌లో 2,94,378 మంది, సెకండియర్‌లో 4,63,370 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్‌ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు ఆగస్టు 1 నుంచి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే.

Friday, 26 August 2022

విద్య నేర్పిన గురువులకు, స్ఫూర్తినిచ్చిన వారికి రుణపడి ఉంటా..

 విద్య నేర్పిన గురువులకు, స్ఫూర్తినిచ్చిన వారికి రుణపడి ఉంటా..

సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ


తెలంగాణ:

జీవితంలో తనకు విద్య నేర్పిన గురవులకు, స్ఫూర్తినిచ్చిన వారికి రుణపడి ఉంటానని సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. సీజేఐ ఎన్వీరమణకు ఈరోజు (శుక్రవారం) సుప్రీం కోర్టులో వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎన్వీ రమణ మాట్లాడుతూ.. తన జీవితంలో ఎదురైన అనేక విషయాలను గుర్తు చేసుకున్నారు. 12 ఏళ్ల వయసులో తొలిసారి కరెంటు చూసినట్లు పేర్కొన్నారు. 17 ఏళ్లకు ట్రేడ్‌ యూనియన్‌కు నేతృత్వం వహించానని తెలిపారు. ఈ వృత్తిలో అనేక ఒడిదొడుకులు వస్తాయని న్యాయవాదులు గ్రహించాలని సూచించారు. కనీస వసతులు లేని గ్రామం నుంచి తన ప్రస్థానం మొదలైందని, వృత్తి పరంగా జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నానని తెలిపారు. తాను  గొప్ప జడ్జీని కాకపోవచ్చు కానీ, సామాన్యూడికి న్యాయం అందించడానికి కృషి చేశానని సీజేఐ ఎన్వీ రమణ స్పష్టం చేశారు. 

ఇదిలా ఉండగా, సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా విశేష సేవలు అందించారు. 13ఏళ్లపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా రమణ పనిచేశారు. ఆ తరువాత ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎదిగారు.  2021 ఏప్రిల్ 24 నుంచి సీజేఐగా ఎన్వీ రమణ కొనసాగుతున్నారు. 

కాగా, రేపు 49వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ యూయూ లలిత్ ప్రమాణ స్వీకారంచేయనున్నారు. రాష్ట్రపతి భవన్‍లో జస్టిస్ యూయూ లలిత్ చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఇక, యూయూ లలిత్ రెండు నెలల 12 రోజుల పాటు సీజేఐగా పదవిలో కొనసాగనున్నారు. నవంబర్ 8తో ఆయన పదవీకాలం ముగుస్తుంది.

Thursday, 25 August 2022

జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదగాలంటే సవాళ్ళను అధిగమించాలి..

 జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదగాలంటే సవాళ్ళను అధిగమించాలి..

-గవర్నర్ తమిళిసై



తెలంగాణ:

మారుతున్న కాలానికి అనుగుణంగా జీవ‌న విధానంలో ఎన్నో మార్పులు చేసుకుంటున్నాయ‌ని, అయితే, జీవన విధానంలో మంచిని చేకూర్చే సంప్రదాయ‌క జీవ‌న విధానాన్ని భాగ‌స్వామ్యం చేసుకోవాల‌ని గవర్నర్ తమిళిసై అన్నారు.

ఈరోజు వరంగల్ లోని కాకతీయ విశ్వవిద్యాలయం 22వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ తమిళిసై హాజరయ్యారు.

అనంతరం గవర్నర్ మాట్లాడుతూ.. విద్యార్థులు క్రియేటివ్‌గా ఆలోచించాలని, జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదగాలంటే సవాళ్ళను ఎదుర్కొంటూ, ముందుకు సాగాలని సూచించారు. ఆన్రైడ్‌ను పక్కకు పెట్టి, ప్రకృతిని ఆస్వాదించాలని, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలన్నారు. లైఫ్‌ను ఎంజాయ్ చేస్తూ, వ్యక్తిత్వ వికాసం సాధించాలని చెప్పారు. మహిళలు సాధారణ కోర్సులు కాకుండా, వృత్తి పరమైన మెడికల్ కోర్సుల విద్యను అభ్యసించాలని తమిళి సై సూచించారు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో శాస్త్ర సాంకేతిక, పరిజ్ఞానం ఎంతో పురోభివృద్ధి సాధించిందని, ఆధునిక సాంకేతికను ఉపయోగించుకుని దేశం మరింత ముందుకు పోవాలని, ఇందుకు యువత దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని గవర్నర్ అన్నారు.

కాకతీయ సామ్రాజ్యం పాలనలో మహిళల పాత్ర గణనీయమైనదని, రుద్రమదేవిని ఆదర్శంగా తీసుకుని మహిళలు సాధికారిక సాధించడానికి ముందుకుపోవాలని గ‌వ‌ర్నర్ సూచించారు.

అనంతరం ఛాన్సలర్ హోదాలో పాల్గొన్న గవర్నర్ మొత్తం 56 మందికి పీహెచ్‎డీ పట్టాలు, బంగారు పతకాలను అందజేశారు.

Tuesday, 23 August 2022

కేయూ స్నాతకోత్సవానికి ఏర్పాట్లు పూర్తి..

 కేయూ స్నాతకోత్సవానికి ఏర్పాట్లు పూర్తి..



  • ఈనెల 25న కేయూ 22వ స్నాతకోత్సవం..
  • పట్టాలు ప్రధానం చేయనున్న గవర్నర్ తమిళిసై..
  • 175 మంది పట్టాలు సాధించగా, ఈసారి 49 మందికే ప్రధానం..
  • అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విద్యార్థి సంఘాలు..


తెలంగాణ:

కాకతీయ విశ్వవిద్యాలయం 22వ స్నాతకోత్సవ వేడుకకు సర్వం సిద్దం చేశారు వర్సిటీ అధికారులు. ఈ నెల 25న 22వ కాన్వొకేషన్​ నిర్వహించనున్నారు.  ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు. వర్సిటీ వీసీ రమేశ్​  హైదరాబాద్​ లో రాష్ట్ర గవర్నర్​ డా. తమిళిసై సౌందరరాజన్ ను కలిసి ఆహ్వానపత్రం కూడా అందజేశారు. నాలుగేండ్ల తర్వాత కాన్వొకేషన్ జరగనుండగా, వందల మంది విద్యార్థులు గోల్డ్​మెడల్స్, పీహెచ్​డీ పట్టాల కోసం ఎదురుచూస్తున్నారు. చీఫ్ గెస్టుల చేతుల మీదుగా కొందరికే పంపిణీ చేస్తామనడం, ఇంకొందరికి పట్టాలు పెండింగ్ లో ఉండడం స్టూడెంట్ల విమర్శలకు కారణమవుతోంది. చివరి సారిగా  2018లో 21వ స్నాతకోత్సవాన్ని నిర్వహించారు. ఆ టైంలో రాష్ట్ర గవర్నర్ హాజరుకాకపోవడంతో అప్పటి వీసీ సాయన్న, ఢిల్లీ ఐఐటీ డైరెక్టర్​రాంగోపాలరావు 538 మందికి పీహెచ్​డీ పట్టాలు, 276 మందికి గోల్డ్​మెడల్స్ అందజేశారు. అప్పటినుంచి మళ్లీ కాన్వొకేషన్ జరపలేదు. కరోనా కారణంగా ఈ ప్రోగ్రాంపై పెద్దగా ఆసక్తి చూపలేదు. స్టూడెంట్ యూనియన్ల వినతి మేరకు ఈ నెల 25న కాన్వొకేషన్ జరిపేందుకు రెడీ అవుతున్నారు. వర్సిటీ చాన్స్​లర్​, రాష్ట్ర గవర్నర్ తో పాటు సైన్స్​ అండ్​ ఇంజినీరింగ్​ రీసెర్చ్​ బోర్డ్​(సెర్బ్) సెక్రటరీ సందీప్​ వర్మకు ఆహ్వానం పంపారు.

పీహెచ్​డీ పట్టాలు, గోల్డ్​ మెడల్స్​ చీఫ్​ గెస్ట్​ ల చేతుల మీదుగా అందజేయాల్సి ఉంటుంది. కానీ, యునివర్సిటీ అధికారులు మాత్రం అదంతా ఏమీ లేకుండానే గవర్నర్​ ప్రోగ్రామ్​ షెడ్యూల్ ప్రిపేర్​ చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మొదట గోల్డ్​ మెడల్స్​ ను కాన్వొకేషన్​ ప్రోగ్రామ్​ అయ్యాక ఎగ్జామినేషన్​ డిపార్ట్​మెంట్ నుంచి కలెక్ట్ చేసుకునేలా ప్లాన్​ చేశారు. పీహెచ్​డీ పట్టాలు 2018, 2019 సంవత్సరాల్లో అవార్డ్ అయిన వారికి మాత్రమే ఇచ్చేలా ఖరారు చేశారు. కానీ, విద్యార్థి సంఘాల నాయకులు మాత్రం దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

Thursday, 18 August 2022

నూతన గ్రామ పంచాయతీలకు సొంత భననాలు..!

 నూతన గ్రామ పంచాయతీలకు సొంత భననాలు..!



తెలంగాణ:

తెలంగాణలో ప‌రిపాల‌నా సౌల‌భ్యం  సంస్క‌ర‌ణ‌ల‌లో భాగంగా ఏర్పాటైన కొత్త గ్రామ పంచాయ‌తీల‌న్నింటికీ, గతంలో సీఎం అసెంబ్లీలో ఇచ్చిన హామీ, కేటాయించిన నిధుల‌తో వారి ఆదేశాల మేర‌కు త్వ‌ర‌లోనే కొత్త భ‌వ‌నాల‌ను ద‌శ‌ల వారీగా నిర్మిస్తామ‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, రాష్ట్ర గిరిజ‌న సంక్షేమం, స్త్రీ శిశు సంక్షేమ శాఖ‌ల మంత్రి సత్య‌వ‌తి రాథోడ్ లు తెలిపారు.

అలాగే, భ‌వ‌నాలు లేని పాత గ్రామ పంచాయ‌తీల్లోనూ కొత్త భ‌వ‌నాలు నిర్మిస్తామ‌న్నారు. కొత్త‌గా గ్రామ పంచాయ‌తీలుగా ఏర్ప‌డ్డ లంబాడా తండాలు, ఏజెన్సీ గూడాల్లోనూ త్వ‌ర‌లోనే కొత్త భ‌వ‌నాల‌ను నిర్మిస్తామ‌న్నారు. ఈ విష‌య‌మై నిధులు, విధి విధానాలు, ప్ర‌ణాళిక‌లు వంటి ప‌లు అంశాల‌పై మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు గారు, మంత్రి సత్య‌వ‌తి రాథోడ్ తో క‌లిసి మినిస్ట‌ర్స్ క్వార్ట‌ర్స్ లోని త‌న నివాసంలో ఈరోజు చ‌ర్చించారు. ఈ సంద‌ర్భంగా మంత్రులు ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, స‌త్య‌వ‌తి రాథోడ్ లు మాట్లాడుతూ.. 

రాష్ట్రంలో 12వేల 769 గ్రామ పంచాయ‌తీలు ఉన్నాయ‌ని,

అందులో గ్రామ పంచాయ‌తీ భ‌వ‌నాలు లేని తండాలు 1,0 97 ఉండ‌గా, ఏజెన్సీ ప్రాంతాల్లో 688 ఉన్నాయ‌ని చెప్పారు. అలాగే, 2,960 మైదాన ప్రాంత గ్రామ‌ పంచాయ‌తీల్లో భ‌న‌వాలు లేవ‌న్నారు. మొత్తం 4,745 గ్రామ పంచాయ‌తీల‌కు కొత్త భ‌వ‌నాల అవ‌స‌రం ఉంద‌న్నారు. అయితే, వీటిలో ఇప్ప‌టికే సంబంధిత ఎమ్మెల్యేలు, ప్ర‌జాప్ర‌తినిధుల నుండి అందిన ప్ర‌తిపాద‌న‌లు, ఇంకా ఎమ్మెల్యేలు, ప్ర‌జాప్ర‌తినిధుల నుంచి అందాల్సిన ప్ర‌తిపాద‌న‌ల‌ను బ‌ట్టి ద‌శ‌ల వారీగా తండాల‌కు, ఏజెన్సీ ఆవాసాల‌కు, ఇత‌ర గ్రామాల‌కు

ప్రాధాన్య‌తా క్ర‌మంలో కొత్త గ్రామ పంచాయ‌తీ భ‌వ‌నాల‌ను మంజూరు చేసి, పంచాయ‌తీరాజ్‌, గిరిజ‌న సంక్షేమ‌శాఖ‌ల ఆధ్వ‌ర్యంలో వేగంగా నిర్మిస్తామ‌న్నారు. ఇప్ప‌టికే కొన్ని గ్రామాల్లో కొత్త భ‌వ‌నాల ప‌నులు ప్ర‌గ‌తిలో ఉన్నాయ‌ని, ఇంకా మిగ‌తా అన్ని కొత్త భ‌వ‌నాల‌ను కొత్త గ్రామ పంచాయ‌తీ భ‌వ‌నాల‌ను నిర్మిస్తామ‌న్నారు.

Monday, 15 August 2022

తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ..

 తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ..



తెలంగాణ:

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. వరస సెలవుల కారణంగా కొండపై భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. ఏడుకొండల వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో క్యూ కాంప్లైక్స్  లోని 31 కంపార్ట్ మెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. వీరికి సర్వదర్శనం కల్పించేందుకు 40 గంటలు సమయం పడుతోందని టీటీడీ అధికారులు వెల్లడించారు. ఆదివారం సాయంత్రం వరకు 60వేల మంది భక్తులు తిరమలేశుడిని దర్శించుకున్నారు. క్యూలైన్లు నిండిపోవడం, వెలుపల కిలోమీటర్ల కొద్దీ బారులు తీరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. భక్తులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు. తిరుమలలో ఎటు చూసినా రద్దీనే కనిపిస్తోంది. ఆర్టీసీ బస్సులు, దేవస్థానం బస్సులు కిటకిటలాడాయి. విపరీతంగా పెరిగిన భక్తుల రద్దీ దృష్ట్యా వసతి సౌకర్యం కొరవడింది. తిరుపతిలో వసతి ఉన్న భక్తులే తిరుమలకు రావాలని అధికారులు కోరుతున్నారు. కాగా,  ఈ నెల 21 వరకు బ్రేక్‌ దర్శనాలు రద్దు చేస్తున్నట్టు టీటీడీ ఛైర్మన్‌ వై.వీ. సుబ్బారెడ్డి వెల్లడించారు. తిరుమలలో పెరిగిపోయిన భక్తుల రద్దీ నేపథ్యంలో అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. భక్తుల రద్దీ దృష్ట్యా ఈనెల 20 వరకు ప్రత్యేక దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ నిర్ణయించింది. వీఐపీ బ్రేక్‌, పిల్లలు, వృద్ధులు, దివ్యాంగులు, ప్రత్యేక దర్శనాలు రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. రద్దీని దృష్టిలో పెట్టుకొని తిరుమల యాత్ర ఏర్పాట్లు చేసుకోవాలని, ముందస్తు ప్లాన్ లేకుండా తిరుమల వచ్చి ఇబ్బందులు పడవద్దని సూచించింది. అంతే కాకుండా వీఐపీ బ్రేక్‌ దర్శనాలు, సిఫారసు లేఖలు పూర్తిగా రద్దు చేస్తున్నట్లు దేవస్థానం అధికారులు స్పష్టం చేశారు.

Saturday, 13 August 2022

రూపాయి పంపి.. ఆపై రూ.50లక్షలు కొట్టేసి..

 రూపాయి పంపి.. ఆపై రూ.50లక్షలు కొట్టేసి..



తెలంగాణ:

సైబర్ నేరాలు రోజు రోజుకూ విస్తరిస్తున్నాయి. కేటుగాళ్లు కొత్త కొత్త దారుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. వ్యాపారులను టార్గెట్ చేస్తూ, లక్షలు దండుకుంటున్నారు. తాజాగా, జరిగిన మోసం తెలిసి అంతా షాక్ కు గురవుతున్నారు. నేరగాళ్లు కొత్త కొత్త మార్గాలు వెతికి నేరాలకు పాల్పడుతున్నారు. పోలీసులు ఎంత నిఘా పెడుతున్నా,  ప్రజలకు పదే పదే అవగాహన కల్పిస్తున్నా, సైబర్ కేటుగాళ్ల మోసాలు ఆగడం లేదు. అది కూడా నిరక్ష్యరాసులను కాదు. బాగా చదుకున్న వారిని, ప్రముఖులను, వ్యాపారవేత్తలను సైతం మోసం చేస్తున్నారు. తాజాగా, జరిగిన మోసం గురించి తెలిసిన వాళ్లంతా షాక్ అవుతున్నారు. ఇంత ఈజీగా మోసం చేయొచ్చా అని షాక్ అవుతున్నారు. మ‌హేశ్ శ‌ర్మ‌ అనే వ్యక్తి క‌డ‌ప‌లో సిమెంట్ వ్యాపారి. ఓ రోజు అతడికి ఒక ఫోన్ కాల్ వ‌చ్చింది. అర్జెంట్ గా త‌న‌కు 100 సిమెంట్ బస్తాలు పంపించాల‌ని మెటీరియ‌ల్ డెలివ‌రీ అయిన వెంట‌నే అక్క‌డ డ‌బ్బులు కూడా ఇచ్చేస్తామ‌ని చెప్పాడు ఆ వ్య‌క్తి. మ‌హేశ్ శ‌ర్మ చాలా ఆనందంతో పొద్దున్నే చాలా మంచి గిరాకి వ‌చ్చింద‌ని 100 సిమెంట్ బస్తాలు లోడ్ చేయించి, స‌ద‌రు వ్య‌క్తి చెప్పిన అడ్ర‌స్ కు పంపించాడు. స‌ర‌కు డెలివ‌రీ కూడా అయ్యింది. వెంట‌నే మ‌ళ్లీ ఆ వ్య‌క్తి మ‌హేశ్ శ‌ర్మ‌కు ఫోన్​ చేసి మీరు పంపించిన స‌రుకు చేరుకుంది. డ‌బ్బులు ఎంతో చెప్పండి పంపిస్తామ‌ని నమ్మకంగా చెప్పాడు. 

అప్పటికే సంతోషంలో ఉన్న మ‌హేశ్ శ‌ర్మ 100 సిమెంట్ బాస్తాలకు ఎంతైందో చెప్పాడు. మీరు అలాగే లైన్ లో ఉండ‌ండి మీ అకౌంట్ కు డ‌బ్బు పంపిస్తానని మొద‌ట ఒక రూపాయి మీ అకౌంట్ కు పంపించాను ఒక సారి క‌న్ఫామ్ చేయండి అని అన్నాడు. డీల్ అంతా స‌జావుగా సాగుతుంది క‌దా అని కొంచెం కూడా అనుమానించ‌డ‌కుండ మ‌హేశ్ శ‌ర్మ త‌మ ఫోన్ లో స‌ద‌రు వ్య‌క్తి పంపించిన లింక్ తో ఉన్న ఒక రూపాయి డ‌బ్బును క‌న్​ఫాం చేశాడు.

కానీ, అంతలోనే ఊహించని షాక్ తగిలింది. అక్క‌డ నుంచి త‌న బిజినెస్​ అకౌంట్ లో ఉన్న రూ.50 ల‌క్ష‌లు మొత్తము మాయమయ్యాయి. వెంట‌నే తేరుకుని తాను మోస‌పోయాని పోలీసుల‌ను ఆశ్ర‌యించాడు మ‌హేశ్ శ‌ర్మ‌. ఇది ఒక మ‌హేశ్ శ‌ర్మ‌కు జ‌రిగిన మోస‌మే కాదు. ప్ర‌స్తుతం ఏపీలో చాలా మంది వ్యాపారస్తులు ఇదే విధంగా మోస‌పోతున్నారు.

ముఖ్యంగా సామాన్యుల‌ను టార్గెట్ చేస్తే ప్ర‌జ‌ల్లో ఉన్న అవ‌గాహాన మూలంగా చాలా వ‌ర‌కు మోసాలు చేయ‌డానికి వీలు కాక‌పోవ‌డంతో ఇప్పుడు ఈ సైబ‌ర్ నేర‌గాళ్లు త‌మ రూటు మార్చి వ్యాపార‌స్తుల‌ను మోసం చేస్తోన్నారు. ఏపీ వ్యాప్తంగా గ‌త నెల రోజుల్లో ఇలాంటి కేసులు 142 న‌మోదైన‌ట్లు తెలుస్తోంది. ఇంకా 200 కేసులు వ‌ర‌కు పోలీస్ వ‌ద్ద‌కు రానివి ఉంటాయ‌ని అంచ‌న వేస్తోన్నారు పోలీసులు. ప‌రువు పోతుంద‌ని త‌మ‌కు జ‌రిగిన మోసాన్ని బ‌య‌టికి చెప్పుకోవ‌డానికి కూడా చాలా మంది వెనుక‌డు వేస్తోన్నార‌ని అంటున్నారు పోలీసులు.

Sunday, 7 August 2022

కామన్వెల్త్ లో సత్తా చాటిన నిఖత్ జరిన్..

కామన్వెల్త్ లో సత్తా చాటిన  నిఖత్ జరిన్..



తెలంగాణ:

ఇంగ్లాండ్ బర్మింగ్‌హామ్ వేదికగా కామన్‌వెల్త్ గేమ్స్ 2022 ఈవెంట్స్ రసవత్తరంగా సాగుతోన్నాయి. భారత్ చివరి రోజుకు ఒక రోజు ముందు పతకాల పంట పండిస్తోంది. దాదాపుగా అన్ని ఈవెంట్లల్లోనూ పతకాలను కొల్లగొట్టేస్తోంది. బాక్సింగ్‌లో టీమిండియాకు ఎదురే ఉండట్లేదు. ఇప్పటికే నీతు ఘంఘాస్, అమిత్ పంఘాల్ స్వర్ణాలు సాధించి బాక్సింగ్లో సత్తాచాటగా.. తాజాగా, మరో బాక్సర్, తెలంగాణ ముద్దుబిడ్డ నిఖత్ జరీన్ సైతం గోల్డ్ మెడల్ సాధించింది. తద్వారా ఇండియా గోల్డ్ మెడళ్ల సంఖ్య 17కు చేరుకుంది. న్యూజిలాండ్‌ను పతకాల పట్టికలో వెనక్కి నెట్టిన ఇండియా 4వ స్థానానికి చేరుకుంది.

వుమెన్స్ 50కేజీల ఫ్లైవెయిట్ కేటగిరి ఫైనల్లో నిఖత్ జరీన్ తన ప్రత్యర్ధి అయిన నార్తెర్న్ ఐర్లాండ్‌కు కారిల్ మెక్ నౌల్‌ను చిత్తు చేసి గెలుపొందింది. బౌట్లో నిఖత్ ధాటికి ఏమాత్రం మెక్ నౌల్ నిలవలేకపోయింది. ఇక అంపైర్లు ఏకగ్రీవంగా నిఖత్ జరీన్‌‌‌ను విజేతగా ప్రకటించారు. ఇటీవలే ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ టైటిల్ గెలిచిన నిఖత్ జరీన్ తాజాగా కామన్ వెల్త్ గేమ్స్‌లో కూడా గోల్డ్ అందించింది. ఇక తొలి రౌండ్ నుంచే నిఖత్ అధిపత్యం కొనసాగింది. తొలి రౌండ్లో 5-0తో ఏకగ్రీవంగా గెలిచిన నిఖత్ రెండో రౌండ్లోనూ అదే రీతిలో ఆడి గెలుపొందింది. తద్వారా చివరి రౌండ్లోనూ ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడి విజేతగా ఆవిర్భవించింది.

నిఖత్ జరీన్ తెలంగాణలోని నిజామాబాద్‌‌కు చెందిన బాక్సర్. ఆమె తల్లిదండ్రులు ఎండీ. జమీల్ అహ్మద్, పర్వీన్ సుల్తానా. 1996 జూన్ 14న జన్మించిన ఈ మేటి బాక్సర్.. తన ప్రాథమిక విద్యాభ్యాసాన్ని నిజామాబాద్‌లోని నిర్మల హృదయ బాలికల ఉన్నత పాఠశాలలో పూర్తి చేసింది. ఆమె హైదరాబాద్‌లోని ఏవీ కళాశాలలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్‌లో డిగ్రీ చదివింది. బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన హైదరాబాద్‌లోని ఏసీ గార్డ్స్‌ జోనల్ కార్యాలయంలో స్టాఫ్ ఆఫీసర్‌గా జరీనా నియమితులైంది.

Saturday, 6 August 2022

కామన్వెల్త్ లో సెమీ ఫైనల్ కు పీవీ సింధు..

 కామన్వెల్త్ లో సెమీ ఫైనల్ కు పీవీ సింధు..




తెలంగాణ:

కామన్వెల్త్ గేమ్స్‌-2022లో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో మలేషియాకు చెందిన గోహ్ జిన్ వీపై సిందూ గెలుపొందింది. తొలి సెట్‌లో 19-21 తేడాతో ఓటమి పాలైన సింధు .. రెండో సెట్‌లో తిరిగి పుంజుకుని 21-14తో అద్భుతమైన విజయం సాధించింది. అయితే నిర్ణయాత్మకమైన మూడో సెట్‌లో 21-18తో  ప్రత్యర్ధిని మట్టికరిపించి సెమీస్‌లో సింధు అడుగు పెట్టింది.


ఇక సెమీ ఫైనల్లో సింధు గెలిపొందితే భారత్‌కు మరో  పతకం ఖాయమవుతోంది. ఇక కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో భాగంగా తొమ్మిదో రోజు భారత అథ్లెట్‌లు అదరగొడుతున్నారు. రెండు రజత పతకాలు భారత ఖాతాలో చేరాయి. మహిళల 10000 మీటర్ల రేస్ వాక్‌ విభాగంలో ప్రియాంక గోస్వామి సిల్వర్ మెడల్‌ సాధించగా, పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో అవినాష్ సాబ్లే రజతంతో మెరిశాడు. ఇక ఇప్పటి వరకు ఓవరాల్‌గా భారత్‌ ఖాతాలో 28 పతకాలు వచ్చి చేరాయి. వాటిలో 9 స్వర్ణాలు, 10 రజతాలు, 9 కాంస్య పతకాలు ఉన్నాయి.

Thursday, 4 August 2022

చిన్ని చేతులకు పెద్ద శిక్షా..!?

 చిన్ని చేతులకు పెద్ద శిక్షా..!?



  • కార్పోరేట్ స్కూళ్లలో చిన్నారులపై టీచర్ల ఆగ్రహం..
  • క్లాస్ రూములల్లో అల్లరి చేస్తున్నారని చితకబాదుతున్న  వైనం..
  • పట్టించుకోని విద్యాశాఖాధికారులు..
  •  కీసరలో పలు కార్పోరేట్ స్కూళ్లలో ఇదే తంతు..


తెలంగాణ:

నగరంలోని పలు కార్పో రేట్ స్కూళ్ళలో విద్యాబోధన చేస్తున్న పలువురు ఉపాధ్యాయుల నిర్వాకం సరిగా లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. కరోనా మహమ్మారితో మూతబడిన స్కూళ్లు రెండేళ్ల విరామం అనంతరం ఈ విద్యాసంత్సరం తెరుచుకున్నాయి. అయితే, కీసర మండలంలోని పలు కార్పోరేట్ పాఠశాలల్లో విద్యాబోధన చేస్తున్న పలువురు ఉపాధ్యాయుల తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తరగతి గదుల్లో విద్యార్థులు అల్లరి చేస్తున్నారని, ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను సరిగా వినడం లేదని, పాఠశాల ప్రాంగాణంలో క్రమశిక్షణ పాటించడం లేదనే నెపంతో కొంత మంది విద్యార్థులను అదే పనిగా కొడుతున్నారని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు జానుశ్రీ టైమ్స్ బ్లాగ్ కు వివరించారు. అంతేకాకుండా, ఇంకొంత మంది ఉపాధ్యాయులు విద్యార్థులు ఇంగ్లీష్ లో మాట్లాడటం లేదని, ఎండలో నిలబెట్టడం లాంటి శిక్షలు వేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఇటువంటి ఉపాధ్యాయులపై వెంటనే చర్యలు తీసుకోవాలని, ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని కీసర మండలంలోని పలువురు  పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు.

Wednesday, 3 August 2022

పల్లెల్లో అమృత్ సరోవర్ సాగదీత..

పల్లెల్లో అమృత్ సరోవర్ సాగదీత..



- ఆగష్టు 15 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యం..
- ఒక్కో చెరువుకు లక్ష నుండి 30 లక్షల వరకు ఫండ్..
- పలు గ్రామాల్లో  అధికారుల చేతివాటం..
- పని చేయని వారికి సైతం మస్టర్లలో హాజరు..

తెలంగాణ:
నీటి సంరక్షణ, నీటి వనరుల అభివృద్ధి, పునరుద్ధరణ కొరకు అమృత్ సరోవర్ పథకం ప్రారంభమైన విషయం తెలిసిందే. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా పలు గ్రామాల్లో చెరువుల పునరుద్ధరణ, చెరువుల నిర్మాణం మిషన్‌ అమృత్‌ సరోవర్‌ పథకం కింద చేపట్టారు. ఈ పథకంలో భాగంగా ఎంపిక చేసిన పనులను ఆగస్టు 15వ తేదీకల్లా పూర్తి చేసి ఆ ప్రాంతాల్లో జాతీయ జెండా ఎగురవేయాలని కేంద్ర ప్రభుత్వం అధికారులకు లక్ష్యం నిర్దేశించింది. అయితే, ఆగష్టు నెల ప్రారంభమైనా  ఈ పథకం పనులు జిల్లాలో నత్తనడకన సాగుతున్నాయి. జిల్లాలో చెరువులను అభివృద్ధి చేయాలని అధికారులు నిర్ణయించారు. అయితే పనులు జరుగుతున్న తీరు చూస్తే ప్రభుత్వం నిర్ణయించిన సమయానికి పూర్తయ్యే పరిస్థితులు కానరావడం లేదు. ఈ పథకం కింద చెరువులను గుర్తించగా కొన్ని చెరువుల్లో పనులు జరుగుతున్నాయి. భూపాలపల్లి జిల్లాలో ఒక్కొక్క చెరువు అభివృద్ధికి రూ.లక్ష నుంచి రూ.30 లక్షల వరకు ఖర్చు చేసుకునే అవకాశం కేంద్ర ప్రభుత్వం కల్పించింది. అంతేగాక, చెరువుల అభివృద్ధికి, నిధుల సేకరణకు దాతల సహకారం కూడా తీసుకోవచ్చు.  ఒక ఎకరం పైబడిన చెరువులను మాత్రమే అభివృద్ధి చేయాలని నిబంధన విధించింది. ఈ చెరువుల అభివృద్ధి పనులకు ఉపాధి హామీ పథకంతో పాటు 15వ ఆర్థిక సంఘం నిధులను వెచ్చించే అవకాశాన్ని కేంద్రం కల్పించినా కొంత మంది అధికారులు తాత్సారం చేస్తున్నారు. చెరువు అడుగున 10 వేల ఘనపుటడుగుల మేర నీరు నిల్వ ఉండేలా పనులు చేపట్టాలి. చెరువు స్థలాల్లో ఉన్న ఆక్రమణలు తొలగించాలి. ఈ పథకంలో చెరువుల అభివృద్ధి వల్ల తాగు, సాగుకు నీటి వనరులు పుష్కలంగా ఏర్పడతాయి. ఈ వనరులను వినియోగించుకుంటే సాగు, తాగునీటి ఇబ్బందులు తీరుతాయి. 
ఇదిలావుంటే, కొన్ని  గ్రామాల్లో  అమృత్ సరోవర్ పథకం కింద చెరువులను తవ్వుతున్నారు ఉపాధి కూలీలు. అయితే, అందులో పెద్ద సంఖ్యలో బినామీ పేర్లు వస్తున్నాయని ఆరోపణలు చేస్తున్నారు పలువురు. పనిచేయని వారికి సంబంధిత మస్టర్లలో  ఇంచార్జీ ఫీల్డ్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులు, టీ ఏ ల ప్రమేయంతో హాజరు వేస్తున్నట్లు పలువురు కూలీలు వాపోతున్నారు. కొలతల ప్రకారం పని చేసిన వారికి టెక్నికల్ అసిస్టెంట్ లు తక్కువ పేమెంట్స్ చేస్తున్నారని, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు పని ప్రదేశానికి రావడం లేదని కూలీలు చెబుతున్నారు. ఇప్పటికైనా, ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని పలు గ్రామాల కూలీలు కోరుతున్నారు.

Tuesday, 2 August 2022

భూపాలపల్లి జిల్లాలో పిడుగుపాటుతో ముగ్గురు మృతి..

 భూపాలపల్లి జిల్లాలో పిడుగుపాటుతో ముగ్గురు మృతి..




తెలంగాణ:

 జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పలు మండలాల్లో మంగళవారం(ఈరోజు) మధ్యాహ్నం ప్రాంతంలో ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి పిడుగు పడటంతో వేర్వేరు చోట్లలో ముగ్గురు రైతులు మృతి చెందారు. రేగొండ మండలం పొనగండ్ల గ్రామంలో వంగ రవి అనే రైతు, చిట్యాల మండలం గోపాలపూర్ గ్రామానికి చెందిన ఆరెపల్లి వనమ్మ. వీరు పంట చేన్లలో పని చేస్తున్న క్రమంలో పిడుగుపాటుకు గురయ్యారు. అదేవిధంగా మల్హర్ మండలంలోని ఛత్రాజ్ పల్లి లో కాటం రఘుపతిరెడ్డి అనే యువకుడు పొలంలో వరి నాటు వేస్తున్న క్రమంలో పిడుగుపడటంతో అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో, ఆయా గ్రామాలో విషాదఛాయలు అలుముకున్నాయి.


కాగా, ఆకాశంలో నల్లని మబ్బులు గుమిగూడడం, మెరుపులు కనిపించడం, బలమైన ఉరుములు వినిపించడం, వేగంగా గాలులు వీచడం వంటివి పిడుగులు పడుటకు సంకేతాలని, అటువంటి సమయంలో ఎత్తైన ప్రదేశాలు, కొండ ప్రాంతాలు, పొడవైన చెట్లు, సెల్ ఫోన్ టవర్లు, విద్యుత్తు స్తంభాలు, విడివిడిగా ఉండే చెట్లు, గృహాలు, బహిరంగ ప్రదేశాలలో పిడుగులు పడే అవకాశం ఉంటుందని, ఇలాంటి సందర్భాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా పాలనాధికారి భవేష్ మిశ్రా సూచించారు.

ఎసిబికి చిక్కిన అవినీతి ఎంపీడివో..

 ఎసిబికి చిక్కిన అవినీతి ఎంపీడివో..



తెలంగాణ:

అవినీతి నిరోధక శాఖ  అధికారుల వలకు ఓ అవినీతి తిమింగలం చిక్కింది. జనగామ జిల్లా స్టేషన్ ఘణపురం ఎంపీడీవో కుమారస్వామి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు ఈరోజు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. హనుమకొండ జిల్లా ఐనవోలు గ్రామ పంచాయతీ సెక్రటరీ కిషోర్ ను ఎంపీడీవో  కుమారస్వామి ఓ పని విషయంలో భారీగా డబ్బు డిమాండ్ చేశాడు. కిషోర్ గతంలో స్టేషన్ ఘణపురం మండలం శివునిపల్లి గ్రామ పంచాయతీ సెక్రటరీ గా పని చేశాడు. డబ్బులు ఇస్తేనే పనిచేస్తానని ఎంపీడీవో కుమారస్వామి తేల్చి చెప్పడంతో పంచాయతీ సెక్రటరీ కిషోర్ ఏసీబీ అధికారులను సంప్రదించాడు. వారి సూచన ప్రకారం హనుమకొండలోని ఎన్జీవోస్ కాలనీ రోడ్ లో సుమంగళి ఫంక్షన్ హాల్ సమీపంలో గల ఎంపీడీవో కుమారస్వామి ఇంటి వద్దకు చేరుకున్నాడు కిషోర్.

అప్పటికే పథకం ప్రకారం సమీపంలో ఉన్న ఏసీబీ అధికారులు పంచాయతీ సెక్రటరీ కిషోర్ ఎంపీడీవో ఇంట్లో రూ.1.40 లక్షలు నగదు లంచంగా ఇస్తుండగా పుచ్చుకున్న కుమారస్వామిని పట్టుకున్నారు. అనంతరం ఎంపీడీవో కుమార స్వామిని అదుపులోకి తీసుకున్నారు. సోమవారం రాత్రి ఎంపీడీవో కుమార స్వామి ఇంట్లో సోదాలు జరిపిన ఏసీబీ అధికారులు మంగళవారం ఉదయం స్టేషన్ ఘణపురంలోని ఎంపీడీవో కార్యాలయంలో సోదాలు చేపట్టారు. దీనికి సంబంధించి ఏసీబీ అధికారులు వివరాలను వెల్లడించాల్సి ఉంది. ఒక ఎంపీడీవో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కడం అవినీతిపరుల్లో కలకలం సృష్టించింది.

Monday, 1 August 2022

శ్రీవారి హుండీలో కాసుల వర్షం..

 శ్రీవారి హుండీలో  కాసుల వర్షం..



  • జులై నెలలో రూ.139.46 కోట్ల  ఆదాయం..
  • ఈ ఏడాది రూ.2000 కోట్లు దాటుతుందని టిటిడి అంచనా..
  • జులై  నెలలో శ్రీవారిని దర్శించుకున్న వారి సంఖ్య 23,38,316 ..



తెలంగాణ:

కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండల వేంకటేశ్వర స్వామి వారికి మరోసారి రికార్డ్ ఆదాయం నమోదైంది. జులై నెలలో ఆల్ టైమ్ రికార్డు బద్దలు కొట్టింది. వరుసగా ఐదో నెలలో ఆదాయం రూ.100 కోట్లు దాటింది. గత నెలలో కేవలం 21 రోజుల్లోనే శ్రీవారి హుండీ ద్వారా రూ.100 కోట్ల 75 లక్షల ఆదాయం వచ్చింది. శ్రీవారికి రూ.139.46 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది. మే నెలలో రూ.130 కోట్లే అత్యధిక హుండీ ఆదాయం కాగా.. గత నెలలో 140 కోట్ల మార్క్ చేరుకోలేదు కానీ.. అల్ టైమ్ రికార్డు అయితే సృష్టించింది.

జులై నెలలో 23,38,316 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 139.46 కోట్ల ఆదాయం సమకూరింది. ఏడుకొండల స్వామిని దర్శించుకున్న ప్రతి ఒక భక్తుడు సరాసరి 596 రూపాయలు హుండీ కానుకగా వేశారు. గత నెల 5న భక్తులు శ్రీవారికి రూ.6.18 కోట్ల కానుకల్ని హుండీలో సమర్పించుకున్నారు. ఇలా ఒక్క రోజులో 6 కోట్ల పైచీలుకు ఆదాయం రావడం తిరుమల చరిత్రలో ఇది రెండోసారి. గతంలో 2018 జూలై 26న రూ.6.28 కోట్ల కానుకల్ని భక్తులు హుండీలో వేశారు.

గడిచిన రెండేళ్లుగా కరోనా కారణంగా తిరుమలకు రాలేని భక్తులు.. ఇప్పుడు కేసులు తగ్గి పరిస్థితి కుదుటపడటంతో మళ్లీ భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో ప్రతి నెలా హుండీ ఆదాయం రికార్డులు సృష్టిస్తోంది అని చెప్పొచ్చు. ఇకపోతే వేసవి సెలవుల కారణంగా గడిచిన నాలుగు నెలలుగా శ్రీవారి హుండీ ఆదాయం రూ.100 కోట్లు దాటుతోంది. ఇలాగే హుండీ ఆదాయం పెరుగుతూ పోతే.. ఈ ఏడాది శ్రీవారి ఆదాయం రూ.1,500 కోట్లు దాటుతుందని టీడీడీ అంచనా వేస్తోంది.

ఆ గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, పంచాయతీ సెక్రటరీ సస్పెన్షన్

  ఆ గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, పంచాయితీ కార్యదర్శి సస్పెన్షన్ తెలంగాణ: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గాజులగట్టు గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, ...