Thursday, 29 September 2022

తెలంగాణకు భారీ వర్ష సూచన..

 తెలంగాణకు భారీ వర్ష సూచన.. 



వర్షపాతం అంచనాలను విడుదల చేసిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం..

దక్షిణ తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే ఛాన్స్..


తెలంగాణ:

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో.. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వచ్చే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని.. మరికొన్నిచోట్ల ఓ మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

వచ్చే నెల (అక్టోబర్) ఒకటో తేదీన తూర్పు, మధ్య బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని, దానివల్ల వర్షాలు మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని వెల్లడించింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వానలు పడుతున్నాయని, హైదరాబాదులో భారీ వర్షం కురిసిందని తెలిపింది.

Tuesday, 27 September 2022

తిరుమల శ్రీవారి దర్శన వేళల్లో మార్పులు..

 తిరుమల శ్రీవారి దర్శన వేళల్లో మార్పులు..



తెలంగాణ:

బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శన వేళల్లో తిరుమల తిరుపతి దేవస్థానం మార్పులు చేసింది. ఈరోజు(మంగళవారం) నుంచి అక్టోబర్ 5 వరకు శ్రీవారి ఆలయంలో ప్రత్యేక దర్శనాలు అన్నింటినీ టీటీడీ రద్దు చేసింది. ఉదయం నుంచి రాత్రి వరకు కేవలం సర్వదర్శనం గుండానే, భక్తులను స్వామివారి దర్శనానికి టీటీడీ అనుమతించనుంది. కాగా,

నేటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. సాయంత్రం 5:45 గంటలకు ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. రాత్రి 9 గంటలకు పెద్ద శేషవాహనం పై శ్రీవారు ఊరేగనున్నారు. ప్రభుత్వం తరపున సీఎం జగన్ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో ప్ర‌ధానంగా ముఖ్యంగా అక్టోబరు 1న గరుడవాహనం, అక్టోబరు 2న స్వర్ణరథం, అక్టోబరు 4న ర‌థోత్స‌వం, అక్టోబరు 5న చక్రస్నానం జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాలకు టీటీడీ అధికారులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

స్వామివారి బ్రహ్మోత్సవాలు రెండేళ్లుగా కరోనా కారణంగా ఏకాంతంగా నిర్వహించారు. ఈసారి భక్తుల సమక్షంలో బ్రహ్మోత్సవాలు వేడుకలు జరగనున్నాయి. ఈసారి భక్తులు భారీగా తరలివస్తారనే అంచనాతో బ్రహ్మోత్సవాల సమయంలో సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇస్తామని టీటీడీ అంటోంది. సర్వ దర్శనం మినహా మిగిలిన దర్శనాలను రద్దు చేసింది.

Saturday, 24 September 2022

రూ.90 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి..

 రూ.90 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి..



తెలంగాణ:

లంచం తీసుకోవడం నేరం అని ఏసీబీ అధికారులు ఎంత చెప్పినా.., కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తునా.., కొందరు అధికారుల్లో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. లంచం లేనిది పని చెయ్యడం లేదు. చేయి తడపనిదే ఫైల్ పై సంతకం కూడా పెట్టడం లేదు. కాదు కూడదు అంటే.., కాళ్లు అరిగేలా కార్యాలయల చుట్టూ తిప్పుకుంటున్నారు. కాగా, కొందరు బాధితులు ధైర్యం చేసి ఏసీబీని ఆశ్రయిస్తున్నారు. దీంతో, అవినీతి అధికారులు, లంచావతారులు అడ్డంగా దొరికిపోతున్నారు. వెరసి, వారి బండారం బయటపడుతోంది.


ఇక వివరాల్లోకి వెళ్తే.. ఈరోజు(శనివారం) కరీంనగర్ జిల్లాలో ఓ పంచాయతీ సెక్రటరీ ఓ వ్యక్తి నుండి అక్షరాల రూ. తొంభై వేలు లంచం రూపంలో తీసుకుంటుండగా, అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు. బావుపేట శివారులో ఓ వ్యక్తి తన భూమిలో రేకుల షెడ్డు నిర్మాణం చేసుకోడానికి గ్రామ పంచాయతీ సెక్రటరీకి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు పెట్టుకున్నాడు. అయితే, సంతకం పెట్టాలంటే రూ.లక్ష ఇవ్వాలని ఆ గ్రామ పంచాయతీ సెక్రటరీ శ్రీధర్ డిమాండ్ చేశాడు. అయితే, రూ.90 వేలు ఇవ్వడానికి సదరు వ్యక్తి ఒప్పుకున్నారు. కాగా, పథకం ప్రకారం ఏసీబీ అధికారులు  పంచాయతీ సెక్రటరీ శ్రీధర్ లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు.

Tuesday, 20 September 2022

ఏసీబీకి దొరికిపోయిన బుల్లెట్టు బండి పెళ్ళికొడుకు..

 ఏసీబీకి దొరికిపోయిన బుల్లెట్టు బండి పెళ్ళికొడుకు..




తెలంగాణ:

సోష‌ల్ మీడియా లో మంచి ఎంత స్పీడ్ గా ప్ర‌చారం అవుతుందో అదే స్థాయిలో చెడు కూడా ప్ర‌చారంలోకి వ‌చ్చేస్తోంది. అయితే, కొద్ది రోజుల క్రితం సోష‌ల్ మీడియాలో వైరల్ అయిన బుల్లెట్ బండి సాంగ్ కు డ్యాన్స్ చేసిన క‌పుల్ మ‌నంద‌రికి గుర్తుండే ఉంటారు అయితే ఆ సాంగ్ లో ఉన్న వ‌రుడు ఇప్పుడు మ‌ళ్లీ సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాడు. తాజాగా రూ. 30 వేలు లంచం డిమాండ్ చేస్తూ అవినీతి నిరోధ‌క శాఖ అధికారుల‌కు దొరికి ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నారు మ‌ళ్లీ ఈ వైర‌ల్ క‌పుల్.

వివ‌రాల్లోకి వెళ్తే... బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్‌లో టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్ ఆకుల అశోక్ మంగళవారం అవినీతి నిరోధక శాఖకి రెడ్ హ్యాండెడ్‌గా ట్రాప్ అయ్యాడు. ఈ కేసులో అశోక్‌ ను ఏసీబీ అధికారులు ట్రాప్ చేశారు. సరూర్‌నగర్‌లోని జేబీ కాలనీలో నివాసం ఉంటున్న ఓ వ్యాపారి పిర్యాదుతో రంగంలోకి దిగిన అధికారుల‌ను అశోక్ ను రెడ్ హ్యండెడ్ గా ప‌ట్టుకున్నారు, ఫిర్యాదుదారుడి ప్లాట్లకు సంబంధించి ఇంటి నిర్మాణ అనుమతులు ఇచ్చేందుకు ఫిర్యాదుదారుడు ఏ దేవేందర్ రెడ్డి నుంచి అశోక్ రూ.30 వేలు లంచం డిమాండ్ చేశాడు. శ్రీనివాసరాజు అశోక్ కు లంచం ఇస్తోన్న‌ప్పుడే అధికారులు ట్రాప్ చేసి ప‌ట్టుకున్నారు.



అశోక్ ఆఫీస్ టేబుల్ డ్రాలో రూ.30వేలు లంచం రికవరీ చేసినట్లు అధికారులు తెలిపారు. అశోక్, రాజులను ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. టౌన్‌ ప్లానింగ్ అధికారిగా పని చేస్తున్న అశోక్‌ సుమారు రెండేళ్ల క్రితం ఎవరో కూడా ఎవరికి తెలియదు. ఆయన వివాహం ముగిసిన తర్వాత ఊరేగింపు కార్యక్రమంలో అశోక్‌ సతీమణి నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా అన్న పాటతో భార్యభర్తలిద్దరూ పాపులర్ అయ్యారు. ఒక్క పాటతో తెలంగాణలోనే కాదు చాలా మందికి గుర్తిండి పోయింది ఈజంట. అయితే బ్యాడ్‌ లక్ ఏంటంటే అంత పాపులారిటీ సంపాధించుకోవడం కారణంగా ఇప్పుడు లంచం తీసుకొని దొరికిపోవడంతో అంతే వేగంగా సోషల్ మీడియాలో అశోక్‌ పేరు అవినీతి అధికారి ఇతనే అంటూ వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే ఎవ‌రైన సోష‌ల్ లంచం డిమాండ్ చేస్తే వెంట‌నే అధికారుల‌ను సంప్ర‌దించాల‌ని కోరుతున్నారు అవినీతి నిరోధ‌క శాఖ అధికారులు. ఇందుకోసం ప్ర‌త్యేక‌మైన టోల్ ఫ్రీ నెంబ‌ర్లు ను కూడా ఏర్పాటు చేసిన‌ట్లు అధికారులు చెబుతున్నారు. ఎవరైనా ప్రభుత్వోద్యోగి లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కు కాల్ చేయాలని అధికారులు ప్రజలను కోరారు లంచం డిమాండ్ చేసిన వారిపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామంటున్నారు.

Monday, 19 September 2022

తిరుమల కొండెక్కిన ఎలక్ట్రిక్ బస్సు.. ఇక కొండపై పొల్యూషన్ కు చెక్ పడ్డట్లే..!

 తిరుమల కొండెక్కిన ఎలక్ట్రిక్ బస్సు.. ఇక కొండపై పొల్యూషన్ కు చెక్ పడ్డట్లే..!



తెలంగాణ:

తిరుమల కొండపై కాలుష్య నివారణకు ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈరోజు తిరుమలలో ఎలక్ట్రిక్ బస్సుతో ట్రయల్ రన్ నిర్వహించారు. ఆర్టీసీ నిపుణులు ఈ బస్సులో ఎక్కి తిరుపతి నుంచి రెండో ఘాట్ రోడ్డు ద్వారా తిరుమల చేరుకున్నారు. తిరుపతిలోని అలిపిరి డిపో నుంచి తిరుమల రెండో ఘాట్‌ నుంచి కొండపైకి వెళ్లింది. 



తర్వాత, తిరుమలలోనే ఎత్తయిన ప్రదేశమైన శ్రీవారి పాదాల వద్దకెళ్లి, తిరిగి మొదటి ఘాట్‌ నుంచి అలిపిరి డిపోకు చేరుకుంది. ఇలానే సాయంత్రం కూడా మరోమారు ఈ బస్సును నడిపారు. మొత్తం రెండు ట్రిప్పులను నడిపి పరీక్షించారు. ఈ క్రమంలో ఎత్తయిన ప్రదేశాల్లో, మలుపుల్లో బస్సు పనితీరును గమనించారు. ఐఐటీ ప్రొఫెసర్లు కూడా ఆర్టీసీ ప్రమాణాల ప్రకారం బస్సు కండీషన్‌, ఇతర సాంకేతిక పరమైన అంశాలనూ నిశితంగా పరిశీలించారు.వారం రోజుల్లో మరో పది బస్సులు రానున్నాయని, శ్రీవారి బ్రహ్మోత్సవాల్లోనే ఈ బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి తెస్తామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. టికెట్‌ ధరను కమిటీ త్వరలోనే నిర్ణయిస్తుందని చెప్పారు.



ఏపీలో ఎలక్ట్రిక్ బస్సుల కోసం ప్రభుత్వం ఒలెక్ట్రా గ్రీన్ టెక్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందం ప్రకారం 100 బస్సులను ఒలెక్ట్రా ఏపీఎస్ఆర్టీసీకి అందించాల్సి ఉంది. ఇప్పటికే పలు బస్సులు అలిపిరి డిపోకు చేరుకున్నాయి. ప్రత్యేకంగా శిక్షణ పొందిన డ్రైవర్లనే ఈ ఎల‌క్ట్రిక్‌ బస్సుల్లో డ్రైవర్లుగా నియమించనున్నారు.

Sunday, 18 September 2022

గుడ్ న్యూస్ చెప్పిన రైల్వే శాఖ.. ఇక వాళ్లకి ప్రత్యేక సీట్లు..

 గుడ్ న్యూస్ చెప్పిన రైల్వే శాఖ.. ఇక వాళ్లకి ప్రత్యేక  సీట్లు..



తెలంగాణ:

మహిళలు మీరిక రైలులో ప్రయాణం చేయాలంటే మీకు సీటు దొరుకుతుందో, లేదో అని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బస్సు, మెట్రో తరహాలో ఇకపై భారతీయ రైళ్లలో మహిళలకు ప్రత్యేక సీట్లను రిజర్వ్ చేయనున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు.

సుదూర ప్రాంతాలకు ప్రయాణించే మహిళల కోసం భారతీయ రైల్వే ప్రత్యేక బెర్త్‌లను కేటాయించనున్నారు. దీంతో పాటు మహిళల భద్రతకు కూడా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. దీనిపై రైల్వే మంత్రి మాట్లడుతూ.. రైళ్లలో మహిళల సౌకర్యార్థం రిజర్వ్ బెర్త్‌ల ఏర్పాటుతో పాటు అనేక సౌకర్యాలను ప్రారంభించినట్లు తెలిపారు.



మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో స్లీపర్ క్లాస్‌లోని మహిళలకు ఆరు బెర్త్‌లను రిజర్వ్ చేయనున్నట్లు రైల్వే మంత్రి తెలిపారు. రాజధాని ఎక్స్‌ప్రెస్, గరీబ్ రథ్, దురంతో సహా పూర్తిగా ఎయిర్ కండిషన్డ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో థర్డ్ ఏసీ (3ఏసీ క్లాస్)లో ఆరు బెర్త్‌లు మహిళల కోసం రిజర్వ్ చేస్తున్నట్లు చెప్పారు.

రైలులోని ఒక్కో స్లీపర్ కోచ్‌లో ఆరు లోయర్ బెర్త్‌లు, 3 టైర్ ఏసీ కోచ్‌లో నాలుగు నుంచి ఐదు లోయర్ బెర్త్‌లు, 2 టైర్ ఏసీ సీనియర్ సిటిజన్‌లలో మూడు నుంచి నాలుగు లోయర్ బెర్త్‌లు, 45 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మహిళలు, గర్భిణీ స్త్రీలకు రిజర్వు చేస్తున్నట్లు తెలిపారు. మహిళా ప్రయాణికుల భద్రత కోసం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, జీఆర్‌పీ, జిల్లా పోలీసులతో భద్రత కల్పిస్తారు.

Saturday, 17 September 2022

సర్పంచ్ వర్సెస్ కార్యదర్శి..!

 సర్పంచ్ వర్సెస్ కార్యదర్శి..!



నేను చాలా బిజీ.., నేనవరి మాటా వినను..

జెండా ఆవిష్కరణలో సొంత ప్రోటోకాల్  రాసుకున్న పంచాయతీ సెక్రటరీ..

సర్పంచ్ కు బదులు ఉప సర్పంచ్ తో జెండా ఎత్తించిన ఆ గ్రామ సెక్రటరీ..

వ్యతిరేక వర్గానికి సెక్రటరీ పనిచేస్తున్నారని సర్పంచ్ ఆరోపణ..

ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తానన్న సర్పంచ్..


తెలంగాణ:

నేను చాలా బిజీ అంటూ.. ఓ గ్రామ పంచాయతీ సెక్రటరీ ఈరోజు జరిగిన తెలంగాణ వజ్రోత్సవాల్లో జాతీయ జెండా ఆవిష్కరించడానికి ఆ గ్రామ సర్పంచ్ కు సమయం ఇచ్చాను. కానీ, వారు సమయానికి రాకపోవడంతో ఉపసర్పంచ్ తో జెండా ఎగురవేయించానని అంటూ.. జాతీయ జెండా ఆవిష్కరణలో సొంత ప్రోటోకాల్ రాసుకున్నాడు ఓ గ్రామ కార్యదర్శి.


 ఇక వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణ జాతీయ వజ్రోత్సవాలలో భాగంగా ఈరోజు(శనివారం) వికారాబాద్ జిల్లాలోని వికారాబాద్ మండలం బురాన్ పల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆ గ్రామ సర్పంచ్ లేకుండానే ఉపసర్పంచ్ తో జెండా ఆవిష్కరణ చేయించి మమా అనిపించేశాడు. ఆ తరువాత అక్కడి నుంచి హడావిడిగా మరో గ్రామానికి వెళ్ళిపోయాడు.

గ్రామ కార్యదర్శి జారీచేసిన సర్కులర్ ప్రకారం ఉదయం 8 గంటలకు జాతీయ జెండా ఆవిష్కరిద్దాం అని అక్కడికి వచ్చిన సర్పంచ్, అప్పటికే జిపిలో జెండా ఆవిష్కరణ జరగడం గుర్తించి ఒకింత షాక్ కు గురైంది. ఇదేంటని కార్యదర్శిని ప్రశ్నించగా మీరు రాను అని చెప్పారు కదా? అందుకే ఉప సర్పంచ్ తో జెండా ఆవిష్కరణ చేయించానంటూ నిర్లక్ష్య సమాధానం చెప్పాడు. గ్రామంలో తమకు వ్యతిరేక వర్గం నాయకులతో కలిసి కావాలనే కార్యదర్శి తన విధులు తాను నిర్వర్తించకుండా గ్రామంలో రాజకీయాలు చేస్తున్నానంటూ కార్యదర్శి తీరుపై సర్పంచ్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలావుంటే, పంచాయతీ కార్యదర్శి మాత్రం నేను రెండు గ్రామాలకు కార్యదర్శిగా పనిచేస్తున్నాను. నాకు బిజీ షెడ్యూల్ ఉంది. కాబట్టి బురాన్ పల్లి సర్పంచ్ కు 7: 30 గంటలకు సమయం ఇచ్చాను. వాళ్లు సమయానికి రాలేదు కాబట్టి ఉదయం 8 గంటలకు గ్రామ ఉపసర్పంచ్ తో జండా ఆవిష్కరణ నిర్వహించి మరో గ్రామానికి వెళ్లానని బదులిచ్చాడు. నిజానికి కార్యదర్శి సర్కులర్ జారీ చేసింది ఉదయం 8 గంటలకు. సర్పంచ్ జాతీయ జెండా ఆవిష్కరించడానికి 8:05 గంటలకు వచ్చారని చెబుతున్నారు. ఈ విషయమై ఉన్నత స్థాయి అధికారులకు స్థానిక ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేస్తామని సర్పంచ్ తెలిపారు.

Thursday, 15 September 2022

తెలంగాణకు జ్వరమొచ్చింది..

 తెలంగాణకు జ్వరమొచ్చింది..



  •  డెంగీ, మలేరియాతో కిటకిటలాడుతున్న ఆసుపత్రులు..
  • విష జ్వరాలు, సీజనల్ వ్యాధులతో ప్రజలు పరేషాన్..
  • వర్షాలు, దోమలతో జర జాగ్రత్త..


తెలంగాణ:

తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు జ్వర బాధితుల సంఖ్య పెరిగిపోతుంది. గడచిన వారం రోజుల వ్యవధిలో వందల మంది దీని బారినపడినట్లు వైద్యారోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. గత నెల చివరి నాటికి రాష్ట్రంలో 1,720 డెంగీ కేసులు నమోదు కాగా., తాజాగా ఆ సంఖ్య 2,509కి చేరింది. అంటే వారం రోజుల్లో 789 మంది డెంగీ బారిన పడినట్లు వైద్యారోగ్య శాఖ లెక్కలు చెబుతున్నాయి. అంటే రోజుకి సుమారు వంది మందికి పైగా డెంగీ సోకుతోందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.



డెంగీతో పాటు మలేరియా సైతం రాష్ట్రంలో వేగంగా ప్రబలుతోంది. ముఖ్యంగా కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో మలేరియా తీవ్ర రూం దాలుస్తోంది. కొత్తగూడెంలో ఇప్పటివరకు 242మందికి మలేరియా సోకగా, ములుగులో 160మంది మలేరియా జ్వరం బారినపడ్డారు. ఈ ఏడాది ఇప్పటివరకు రాష్ట్రంలో 608 మందికి మలేరియా సోకినట్లు వైద్య శాఖ ప్రకటించింది. గతనెల చివరినాటికి రాష్ట్రంలో కేవలం 116 మలేరియా కేసులు మాత్రమే ఉన్నాయి. అంటే, గత వారం రోజుల్లో 492 మంది వ్యాధి బారినపడ్డారు. ఇక వీటితో పాటు సాధారణ జ్వరాలు ప్రజలను పీడిస్తున్నాయి. వాతావరణంలో మార్పులు, వరుసగా కురుస్తున్న వర్షాలతో అనేక కుటుంబాలు జ్వరంతో ముసుగేస్తున్నాయి. కొవిడ్ నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ ఫీవర్ సర్వే నిర్వహిస్తోంది. ఈ గణాంకాల ప్రకారం జులై, ఆగస్టు నెలలు కలిపి రాష్ట్రంలో సుమారు ఐదు లక్షల మంది జ్వర పీడితులు ఉండటం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు జ్వర బాధితులతో కిటకిటలాడుతున్నాయి. గాంధీ ఆస్పత్రికి నిత్యం సుమారు వంద మంది జ్వర పీడితులు వస్తున్నట్టు సమాచారం. ఇక నగరంలోని ఫీవర్ ఆస్పత్రిలోనూ సైతం ఓపీ సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈసారి తరచూ వానలు పడుతుండటం, మారిన వాతావరణ పరిస్థితులు, ఉష్ణోగ్రతలు తగ్గడం, అన్నిచోట్లా నీరు నిల్వ ఉండటం, పారిశుధ్య నిర్వహణ లోపం. ఇవన్నీ కలిసి దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. కలుషితాలు వ్యాపిస్తున్నాయి. దీనితో వైరల్‌ జ్వరాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. చాలా మంది గొంతు నొప్పి, జ్వరంతో ఆస్పత్రులకు వస్తున్నారని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులతో విష జ్వరాలు, సీజనల్‌ వ్యాధులు మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.



 వాతావరణంలో మార్పుల కారణంగా న్యుమోనియా, దగ్గు, శ్వాస సంబంధ సమస్యలూ పెరుగుతున్నాయని అంటున్నారు. వాతావరణంలో మార్పు, మురుగు నీరు కారణంగా దోమల వ్యాప్తి చెందుతున్నాయి. ఏటా, వర్షాకాలం వచ్చిందంటే చాలు జ్వరాలకు సీజన్ మొదలవుతుంది. వందల సంఖ్యలో జ్వరబాధితులు ఉంటారు. అయితే, ఈ ఏడాది ఆ సంఖ్య మరింత పెరిగిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. జ్వరం లక్షణాలు ఉంటే తప్పక వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. వరుస పండుగల నేపథ్యంలో ఈ జాగ్రత్తలు మరింతగా పాటించాలి.

Tuesday, 13 September 2022

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎంపిడివో..

 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎంపిడివో..



తెలంగాణ:

రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ రోజు ఎక్కడో ఒకచోట అవినీతి తిమింగళాలు బయటపడుతూనే ఉన్నాయి. నిత్యం ఎవరో ఒకరు పట్టుబడుతున్నా.., లంచాలు తీసుకోవడానికి ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం వెనకాడడం లేదు. అలాంటి ఘటనే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరంలో జరిగింది. బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పి.గన్నవరం ఎంపీడీవో  విజయ రూ.40వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుపడ్డారు. పి.గన్నవరం మండలం రాజులపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని శ్మశానవాటిక, కమ్యూనిటీహాల్‌, సీసీ రోడ్ల నిర్మాణం తదితర పనులు కోసం రూ.1.15 కోట్ల ఎంపీ లాండ్స్‌ నిధులకు సంబంధించి 10 శాతం మండలపరిషత్‌ నిధుల కోసం అనుమతులు ఇవ్వాలని రాజులపాలెం గ్రామ ఉపసర్పంచ్‌ విజయలక్ష్మి ఎంపీడీవో విజయను కోరారు. అయితే, ఈ పనిచేయడానికి రూ.50 వేలు లంచం ఇవ్వాలని ఎంపీడీవో విజయ డిమాండ్‌ చేశారు. అనుకున్నట్లే ఈనెల 6న రూ.10 వేలను ఎంపీడీవోకు ఉపసర్పంచ్‌ ఇచ్చారు. అనంతరం ఈనెల 10న ఎంపీడీవోపై  ఏసీబీకి  ఉపసర్పంచ్‌ ఫిర్యాదు చేశారు. మిగిలిన రూ.40 వేలు ఇవ్వాలని ఎంపీడీవో డిమాండ్‌ చేయగా మండలపరిషత్‌ కార్యాలయంలో ఎంపీడీవోకు ఉపసర్పంచ్‌ విజయలక్ష్మి రూ.40వేలు లంచం ఇస్తుండగా రెడ్‌హ్యాండడ్‌గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఎంపీ లాండ్స్‌కు సంబంధించిన ఫైల్‌ను సీజ్‌ చేసి ఎంపీడీవోను అదుపులోకి తీసుకున్నారు.

Sunday, 11 September 2022

కృష్ణంరాజు మృతితో తీవ్ర విషాదంలో ప్రభాస్..

 కృష్ణంరాజు మృతితో తీవ్ర విషాదంలో ప్రభాస్..



తెలంగాణ:

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. రెబల్‌స్టార్‌గా ఎంతో మంది అభిమానులని సొంతం చేసుకున్న కృష్ణంరాజు కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున  తుదిశ్వాస విడిచారు. కృష్ణంరాజు మరణవార్తతో ఆయన కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

కృష్ణంరాజు మరణ వార్త తెలుసుకున్న టాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు హాస్పిటల్‌కు చేరుకుంటున్నారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణం అటు టాలీవుడ్‌తో పాటు హీరో ప్రభాస్‌కి కూడా తీరని లోటని చెప్పాలి. నిన్న(శనివారం)తన పెదనాన్నను చూసేందుకు ప్రభాస్‌  ఏఐజీ హాస్పిటల్‌కు వెళ్లారు. దీనికి సంబంధించిన విజువల్స్‌ సోషల్‌ మీడియాలోనూ చక్కర్లు కొట్టాయి. 



గతంలోనూ అనారోగ్య సమ​స్యలతో కృష్ణంరాజు ఆసుపత్రిలో​ చికిత్స తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో, ఈసారి కూడా రెండు మూడు రోజుల అనంతరం ఆయన ఆరోగ్యంగా తిరిగి వస్తారని అనుకున్నారు. కానీ, అంతలోనే కృష్ణంరాజు ఇకలేరనే వార్త టాలీవుడ్‌కి షాక్‌ గురిచేసిందనే చెప్పాలి. పెదనాన్న కృష్ణంరాజుతో  ప్రభాస్‌కు ఎంతో అనుబంధం ఉంది. పాన్‌ ఇండియా స్టార్‌గా సత్తా చాటుతున్న ప్రభాస్‌ సినీ కెరీర్‌లో  కృష్ణంరాజు పాత్ర ఎంతో ఉంది.  నటుడిగా ప్రభాస్‌ ఇంత ఎత్తుకు ఎదగడం తనకు ఎంతో సంతోషమని కృష్ణంరాజు పలు సందర్భాల్లో చెబుతుండేవారు.

కృష్ణంరాజును కడసారి చూసేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన ఇంటికి చేరుకుంటున్నారు. కేంద్రమంత్రలు కిషన్‌రెడ్డి, సినీ నటులు మోహన్‌ బాబు, ఎంపీ రఘురామకృష్ణంరాజు తదితరులు నివాళులర్పించారు. రేపు మధ్యాహ్నం అభిమానుల కడసారి చూపుకోసం కోట్ల విజయ భాస్కర్‌రెడ్డి స్టేడియానికి తరలించనున్నారు. అటునుంచి మహాప్రస్థానంలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో కృష్ణంరాజు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా, రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు మరణం సినీ పరిశ్రమతో పాటు రరాజకీయ వర్గాలలోనూ తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన మరణంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కృష్ణంరాజు తనకు అత్యంత అప్తమిత్రుడని కేసీఆర్ పేర్కొన్నారు.



ఆయన అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌ను కేసీఆర్ ఆదేశించారు. దీంతో, కృష్ణంరాజు అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించేందుకు సోమేష్ కుమార్ ఏర్పాట్లు చేస్తున్నారు.

Wednesday, 7 September 2022

వంద రోజుల పనిలో ఇంటి దొంగల చేతివాటం..

 వంద రోజుల పనిలో ఇంటి దొంగల చేతివాటం..



ఉపాధి హామీ సొమ్మును నొక్కేసిన  గ్రామ సర్పంచ్.. 

ఆధారాలతో సహా పట్టుకున్న గ్రామస్తులు..

పంచాయతీ కార్యదర్శి, కారోబార్, మేట్ల ఇష్టా రాజ్యం..


తెలంగాణ:

గ్రామాభివృద్ధికి పాటుపడుతూ ఆదర్శంగా నిలవాల్సిన ఓ గ్రామ సర్పంచ్ ఆ గ్రామ రక్షణను పూర్తిగా మరిచి అతనే ఆ గ్రామ భక్షకునిగా మారిన సంఘటన ఖానాపూర్ మండలంలోని అయోధ్య నగర్ గ్రామంలో వెలుగులోకి వచ్చింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఒక్కరోజు కూడా పనిచేయకుండానే 100 రోజుల పాటు హాజరు వేయించుకోని, ఉపాధి హామీ డబ్బులు పొందాడు. 

మండలంలోని అయోధ్య నగర్ గ్రామ సర్పంచ్ తన పేరుతో జాబు కార్డును తీసుకున్నాడు. అనంతరం పని చేయకుండానే మస్టర్ లో హాజరు వేసుకుని డబ్బులు పొందాడు. ఈ తతంగమంతా ఉపాధి హామీ సిబ్బందికి తెలిసే జరిగిందంటూ అదే గ్రామానికి చెందిన పలువురు జిల్లా కలెక్టర్‌కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన ఆధారాలతో సహా వారు వివరాలు వెల్లడించారు.

అయోధ్య నగర్ సర్పంచ్ ఉపాధి హామీ పథకంలో ఒక్క రోజు కూడా పనిచేయకుండానే, చేసినట్లుగా హాజరు వేయించుకొని రూ. 30 వేల మేర అవినీతికి పాల్పడినట్లు తేలిందన్నారు. ఉపాధి హామీతోపాటు మిగతా అన్ని అభివృద్ధి పనుల్లో అయోధ్యనగర్ సర్పంచ్ అక్రమాలకు పాల్పడ్డాడని, గ్రామస్థాయిలో పూర్తి విచారణ చేపడితే అనేక అక్రమాలు బయటపడతాయని వార్డు మెంబర్లు జాయింట్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

ప్రభుత్వ సొమ్ము ఏమైనా పర్లేదు అనే ధోరణి ఉండడంతో అదే బలహీనత ఆధారంగా పంచాయతీ కార్యదర్శులు, మేట్లు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. కానీ, విచారణ అధికారులు టెక్నికల్ ఆధారాలు పక్కన పెట్టి సంప్రదాయ విధానాల ప్రకారం మమ అనిపించారనే విమర్శలు సైతం వినిపించాయి. కాగా, అయోధ్య నగర్ ఉదంతంతో సర్పంచుల అవినీతి బండారం అంతా ఇంతా కాదని తెలుస్తుంది. దీనితో పాటుగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సీనియర్ లని మించి అవినీతి వ్యవహారంలో మునిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.  మిగతా గ్రామాల్లో కూడా విచారణ జరిపి గ్రామస్తులకు న్యాయం చేయడంతో పాటు అక్రమాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Friday, 2 September 2022

ఏసీబీకి చిక్కిన భూపాలపల్లి ఎస్సై నరేష్..

 ఏసీబీకి చిక్కిన భూపాలపల్లి ఎస్సై నరేష్..



రూ.25వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు..


తెలంగాణ:

భూపాలపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్సై గా విధులు నిర్వహిస్తున్న ఇస్లావత్ నరేష్ ఈరోజు (శుక్రవారం) రూ.25 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.  ఏసీబీ అధికారుల తనిఖీలతో భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. ఓ సివిల్ కేసు విషయమై బాధిత వ్యక్తి నుండి ఎస్సై నరేష్ రూ.75 వేలు లంచం రూపంలో డిమాండ్ చేశారు. ముందుగా రూ.25 వేలు ఎస్సై నరేష్ కు  ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

ఆ గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, పంచాయతీ సెక్రటరీ సస్పెన్షన్

  ఆ గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, పంచాయితీ కార్యదర్శి సస్పెన్షన్ తెలంగాణ: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గాజులగట్టు గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, ...