Tuesday, 31 May 2022

తిరుపతి స్టేషన్ ఇక.. వరల్డ్ క్లాస్ రైల్వే

 తిరుపతి స్టేషన్.. ఇక వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్..






నమూనాలు విడుదల చేసిన రైల్వే శాఖ..


వెంకటేశ్వర్లపల్లి/ తెలంగాణ:

ఏపీలోని తిరుపతి రైల్వేస్టేషన్‌ కు మహర్దశ పట్టనుంది. పనులన్నీ పూర్తి చేశామని,  త్వరగా పనులు పూర్తి చేస్తామని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ట్వీట్ చేశారు. ఆయన డిజైన్లను కూడా విడుదల చేశారు. దేశంలోనే ప్రపంచస్థాయి రైల్వే స్టేషన్లుగా తొలిదశలో అభివృద్ధి చేస్తున్న రైల్వే స్టేషన్లలో మన తిరుపతి ఒకటి. ఈ  రైల్వే స్టేషన్లను రూ.5 వేల కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. తిరుపతి రైల్వే స్టేషన్ ఇక ప్రపంచస్థాయి రైల్వే స్టేషన్‌గా రూపాంతరం చెందనుంది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం  దేశవ్యాప్తంగా భక్తులు అధికంగా రైల్వేల ద్వారానే వస్తుంటారు. వచ్చి పోయే భక్తులతో తిరుపతి రైల్వే స్టేషన్ నిత్యం రద్దీగా ఉంటుంది. దేశ విదేశాల నుంచి కూడా పెద్దఎత్తున భక్తుల తాకిడి పెరగడంతో తిరుపతి రైల్వే స్టేషన్‌ను ప్రపంచస్థాయి తీర్చిదిద్దేందుకు రైల్వేశాఖ నిర్ణయించింది.

Monday, 30 May 2022

ఢిల్లీ కకావికలం..

 ఢిల్లీ కకావికలం..



  • దేశ రాజధాని లో వర్ష భీభత్సం..
  • వరదల్లోనే రోడ్లు, కూలిన చెట్లు..
  • ఎయిర్ పోర్ట్ లో స్కిడ్ అయిన జెట్ ఎయిర్ వేస్ విమానం..


వెంకటేశ్వర్లపల్లి/ తెలంగాణ:


భయానక ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం దేశరాజధాని ఢిల్లీని చిగురుటాకులా వణికించింది. సోమవారం తెల్లవారుజాము నుంచి ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో అసాధారణ రీతిలో వర్షం కురుస్తున్నది. దీంతో, భారీ వృక్షాలు సైతం నేలమట్టమయ్యాయి. పటిష్టమైన గోడలను సైతం అటు ఇటు ఊపేస్తూ.. భయానక ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం దేశరాజధాని ఢిల్లీని చిగురుటాకులా వణికించింది.

గంటలపాటు కురిసిన వర్షానికి వరద ఉప్పొంగి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. దీంతో, సగానికిపైగా నగరంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ప్రమాదకర వాతావరణంలో ప్రయాణించలేక పలు విమాన సర్వీసులు రద్దు కావడంతో ఎయిర్ పోర్టులో జనం పడిగాపులు కాస్తున్నారు. తుపాను లాంటి వర్షం ఇంకొన్ని గంటలు కొనసాగనుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హెచ్చరించింది.





ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్ పరిసర ప్రాంతాల్లో సోమవారం తెల్లవారుజాము నుంచి ఉరుములు,మెరుపులతో కూడిన గాలివాన కురుస్తోంది. సోమవారం ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిసర ప్రాంతాలలో గంటకు 50 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతోపాటు ఉరుములతో కూడిన తుపాన్ కొనసాగుతున్నది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భారీ వర్షానికితోడు ఈదురుగాలులు బలంగా వీస్తుండటంతో ప్రజలు ఇల్లు వదిలి బయటికి రావొద్దని ఐఎండీ సూచించింది. గాలి బలంగా వీస్తుండటంతో ఇంటి కిటికీలు, తలుపులు మూసివేయాలని, ప్రయాణాలను నివారించాలని కూడా ఐఎండీ కోరింది.

వర్షం పడుతోన్న సమయంలో ప్రజలు చెట్ల కింద తలదాచుకోవద్దని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ఐఎండీ సూచించింది. కాంక్రీట్ అంతస్తులపై పడుకోవద్దని, కాంక్రీట్ గోడలకు ఆనుకొని ఉండవద్దని, ఎలక్ట్రికల్,ఎలక్ట్రానిక్ ఉపకరణాలను అన్‌ప్లగ్ చేయాలని ఐఎండీ తెలిపింది. గాలివాన వల్ల కచ్చాఇళ్లు, గోడలు, గుడిసెలు పడిపోతాయని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. భారీవర్షాల వల్ల ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పలు విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు.

అరటి రైతు కష్టాలు..

 అరటి రైతు కష్టాలు..



అమ్మకాలు లేకపోవడంతో  అన్నదాత అవస్థలు..

నష్టపరిహారం అందించాలని రైతుల వేడుకోలు..


వెంకటేశ్వర్లపల్లి/ తెలంగాణ:


అరటి పంట వేసిన అన్నదాతకు ప్రతి ఏటా లాభాల పంట పండించేది. కానీ, ఈ ఏడాది అరటి రైతులకు చేదు అనుభవాలను మిగులుస్తోంది. ప్రతి ఏడాదిలాగే ఈ సారి లాభాలు వస్తాయని రైతులు ఆశ పడ్డారు. కానీ, తీవ్ర నష్టాలకు గురయ్యారు. అనకాపల్లిలో ఇటీవల ఎడతెరిపిలేని వర్షాలు కురవడంతో పంటకు నష్టాలు తప్పలేదు. ముఖ్యంగా ఈదురు గాలులతో  పంట పూర్తిగా దెబ్బ తింది.  పోనీ, దెబ్బ తిన్న గెలలను పక్కన పెట్టి మిగిలిన గెలలను అమ్ముకునేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఈ ఏడాది అరటి పంట ఆశించినంతగా రైతులకు లాభాలు అందివ్వడం లేదు. నర్సీపట్నం మండలం నుండే అనకాపల్లికి అరటి గెలలు సరఫరా అవుతాయి. ఇక్కడ ఎవరికి ఏ అవసరం వచ్చినా నర్సీపట్నం వెళ్లాల్సిందే. కానీ, ఇటీవల అకాల వర్షాలకు తక్కువ పంట రావడంతో కొనుగోలుదారులకు కావలసినంత సరుకు ఎగుమతి చేయలేకపోతున్నారు. దీంతో, ఈ గ్రామాల్లో పంట లేదనే ప్రచారం మొదలైంది. జిల్లా వ్యాప్తంగా ఈ గ్రామాలకు కొనుగోలుదారులు రావడం తగ్గుముఖం పట్టారు. రూ.450 నుంచి రూ.250 లకు పడిపోయింది ధర. ఒక్కో గెల 10 నుంచి 18 కిలోల వరకు ఉంటుంది. దీని ధర గతంలో రూ.350 నుంచి రూ.500 వరకు పలికేది. ఈ ఏడాది కనిష్ఠంగా  రూ.250 కి  పడిపోయింది. సగానికి తక్కువ ధర పలకడంతో రైతులు లబోదిబోమంటున్నారు. గతంలో ఎక్కువ పంట ఉండటంతో ఇతర ప్రాంతాలకు ఇక్కడి అరటి పంటను తరలించేవారు.

ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఈ పంటకు నష్టం జరిగితే ప్రభుత్వం పరిహారం చెల్లిస్తుంది. ఈ పరిహారం కూడా అంతంతమాత్రమే. 33 శాతం కంటే ఎక్కువ విస్తీర్ణంలో పంట దెబ్బతింటేనే ఈ పరిహారం వర్తిస్తుంది. ఈ ఏడాది కొంత మోతాదులో పంట దెబ్బతిన్నట్లు అధికారులు లెక్కల చెబుతున్నారు. వాస్తవంగా చూస్తే రైతులు చెప్పిన ప్రకారం ఈ నష్టం ఇంకా ఎక్కువ ఉంటుందని తెలుస్తోంది. తమను ప్రభుత్వం ఆదుకోవాలని అరటి రైతులు వేడుకుంటున్నారు.

Sunday, 29 May 2022

రుతురాగాలు..

 రుతురాగాలు..



కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు..

రెండు, మూడు రోజుల్లో కేరళలోని అన్ని ప్రాంతాలకు విస్తరణ..


వెంకటేశ్వర్లపల్లి/ తెలంగాణ:


ఈసారి నైరుతి రుతుపవనాలు ముందే వచ్చేశాయి. ఆదివారం కేరళను తాకిన రుతుపవనాలు అక్కడే స్థిరంగా ఉన్నాయని వాతావరణ శాఖాధికారులు మీడియాకు వెల్లడించారు. మామూలుగా అయితే ప్రతి ఏటా జూన్ 1వ తేదీన కేరళలో ప్రవేశించే రుతుపవనాలు మూడు రోజులు ముందుగానే వచ్చేశాయి. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుఫాను కారణంగా రుతుపవనాల్లో వేగం పెరిగిన దృష్ట్యా ఈసారి నైరుతి రుతుపవనాలు ముందుగా వచ్చినట్లు అధికారులు తెలిపారు. అంతేకాక, మరో రెండు, మూడు రోజుల్లో కేరళ మొత్తం విస్తరిస్తాయని, అక్కడి నుండి ఈశాన్య ప్రాంతం వైపు నెమ్మదిగా పురోగమించేందుకు అనుకూలంగా ఉన్నట్లు ఐ. ఎం. డీ వెల్లడించింది. వీటి ప్రభావంతో వచ్చే నాలుగైదు రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇదిలావుంటే, పోయినేడాది జూన్ 3న నైరుతి రుతుపవనాలు కేరళ ను తాకాయి.

Saturday, 28 May 2022

ఐడియా అదుర్స్..

 ఐడియా అదుర్స్..



వినూత్నంగా టిఎస్ఆర్టిసి..

రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టేషన్లకు ఉచిత ప్రయాణం..


వెంకటేశ్వర్లపల్లి/ తెలంగాణ:


టీఎస్‌ ఆర్టీసీ కొత్త కొత్త స్కీములతో ప్రయాణికులను తెగ ఆకట్టుకుంటోంది. తాజాగా, తెలంగాణ ఆర్టీసీ వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బస్టాప్‌లకు ప్రయాణికులను ఉచితంగా చేరవేసేందుకు ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. అల్ఫా హోటల్, రేతిఫైల్, బ్లూసీ హోటల్ ఎదురుగా ఉండే ఉప్పల్ బస్టాప్, మెట్టుగూడ, చిలకలగూడ, గాంధీ ఆసుపత్రివైపు వెళ్లేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు ఆర్టీసి అధికారులు. ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన ఈ సమాచారాన్ని రైల్వే స్టేషన్‌లో ఇరువైపులా ఉన్న ప్లాట్‌ఫామ్స్‌పై ఆర్టీసీ ఏర్పాటు చేయనుంది. ప్రయాణికులు రైలు దిగగానే వాటి వద్దకు వెళ్లి ఎక్కడికి వెళ్లాలో చెబితే బ్యాటరీ వాహనాలు రప్పిస్తారు. అక్కడి నుంచి సమీపంలోని బస్టాప్‌లో వదిలిపెడతారు. మెట్రో రైలులో వెళ్లాలనుకునేవారు విషయం చెబితే అక్కడ దింపుతారు. త్వరలోనే ఈ ఉచిత వాహన సేవలు అందుబాటులోకి రానున్నట్టు తెలంగాణ ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.

మురుగు నీటితో బీర్ల తయారీ..

 మురుగు నీటితో బీర్ల తయారీ..



సింగపూర్ తరహాలో కొత్త పోకడలు..


వెంకటేశ్వర్లపల్లి/ తెలంగాణ:


ఓ దేశంలో తయారవుతున్న బీరు ప్రస్తుతం అందరినీ ప్రత్యేకంగా ఆకర్షిస్తోంది. ఇతర బీర్ల మాదిరిగానే కనిపించే ఈ బీరు రుచి, రంగు ప్రత్యేకమైనది కానప్పటికీ, న్యూబ్రు మాత్రం ఒక ప్రత్యేకతను చాటుకంటున్నది. ఎందుకంటే, దాన్ని శుద్ధి చేసిన మురుగు నీరు, మూత్రం తో తయారు చేస్తున్నారట. అంతర్జాతీయ ప్రమాణాలతో దీనిని సిద్ధం చేస్తున్నారు. సింగపూర్ ఇంటర్నేషనల్ వాటర్ వీక్ తో కలిసి నేషనల్ వాటర్ ఏజెన్సీ స్థానిక క్రాఫ్ట్ బీర్ బ్రువరీ సంస్థలు ఈ బ్రాండ్ ను త్వరలోనే మార్కెట్ లోకి విడుదల చేయనున్నారు. ఈ న్యూబ్రూ తయారీలో జర్మన్ బార్లీ మార్ట్, సుగంధ సిట్రాతో పాటు దిగుమతి చేస్తున్న ఇతర  పదార్థాలను వినియోగించనున్నారు.

తీన్మార్ మల్లన్న అరెస్ట్..

 తీన్మార్ మల్లన్న అరెస్ట్..



హనుమకొండ జిల్లా అరెపల్లిలో ఉద్రిక్తత..

భూసేకరణకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా మల్లన్న..

తోపులాటల మధ్యే మల్లన్నను అదుపులోకి తీసుకున్న పోలీసులు..


వెంకటేశ్వర్లపల్లి/ తెలంగాణ:


హనుమకొండ జిల్లా అరెపల్లి గ్రామంలో తీన్మార్ మల్లన్నను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో, ఆరెపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వివరాల్లోకి వెళ్తే.. భూసేకరణ జీవో 80ఏ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అరెపల్లిలో రైతులు ఆందోళన బాట పట్టారు. ఈ నేపథ్యంలో వారికి మద్దతు తెలిపేందుకు తీన్మార్ మల్లన్న అక్కడకు వచ్చారు. దీంతో, ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తోపులాటల మధ్యే మల్లన్నను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శాంతియుతంగా కొనసాగుతున్న నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంత మందిని అరెస్ట్ చేసినా తమ ఆందోళనలు ఆగవని అన్నారు. మల్లన్న అరెస్ట్ తో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అంతకు ముందు తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. బాధిత రైతులకు అండగా ఉంటామని చెప్పారు. 80ఏ జీవోను రద్దు చేసేంత వరకు రైతులంతా ఐకమత్యంతో పోరాడాలన్నారు.

Friday, 27 May 2022

ప్రజా డైరీ సంచిక ప్రధాని మోడీ కి అంకితం..

 ప్రజా డైరీ సంచిక ప్రధాని మోడీ కి అంకితం..



మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారి..


వివిష్ట సేవలు అందించిన వారికి అవార్డుల ప్రదానం...


వెంకటేశ్వర్ల పల్లి/ తెలంగాణ:

సంచికలు సమాచారం సేకరణ లో, విషయ విషదికరణ లో కీలక పాత్ర పోషిస్తాయని మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి అన్నారు. ముంబయ్ రాజ్ భవన్ లో తెలుగు సంచిక ప్రజా డైరీ మాతృ దినోత్సవ సంచిక విడుదల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా భగత్ కోశ్యారి మాట్లాడుతూ సమాచార  సేకరణ,విషయ విశదీకరణ లో సంచికలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. తాను సంచికల్ని చదవ డానికే ఎక్కువ ఆసక్తి చూపుతానని, ఇందులో ఎక్కువ సమాచారం ఉంటుందన్నారు.తెలుగు సంచిక ప్రజా డైరీ తెలుగు పత్రిక రంగం లో దూసుకు పోతుందని కితాబిచ్చారు. మాతృ దినోత్సవం సందర్భంగా విడుదల చెయ్యడం అభినందనీయం అన్నారు.ఈ సంచికను ప్రధాని మోడీ, మోడీ తల్లి హీరాబెన్ కు అంకితం చేశారు.అనంతరం వివిధ రంగాలలో సేవలు అందించిన వారికి అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు.సమాజంలో అవసరం అయిన అన్ని వర్గాల విశిష్ట సేవలు అందించినందుకు గాను  మనం ఫౌండేషన్ ప్రెసిడెంట్ ఆర్ ఎస్ కుమార్ ను సత్కరించారు. ఈ సందర్భంగా మనం ఫౌండేషన్ ప్రెసిడెంట్ ఆర్ ఎస్ కుమార్ మాట్లాడుతూ..

తనకు ఈ గౌరవం లభించడం ఎంతో సంతోషంగా ఉందని, భవిష్యత్తు లో మరింత ఉత్సాహంగా సేవలు అందించడానికి ఇది ఉత్సాహాన్నిస్తుంది అని పేర్కొన్నారు. ఈ సేవా పురస్కారాన్ని "మనం ఫౌండేషన్" కి ఎప్పటికప్పుడు సహాయ సహకారాలు అందిస్తున్న అమెరికా ప్రతినిధులు కాసర్ల శ్రీని, తపస్వి రెడ్డి, తాటిపల్లి ప్రవీణ్, జై, దుబాయ్ సుజాత రాంచందర్ రెడ్డి మరియు ఆత్మీయ శ్రేయోభిలాషులందరికి అంకితం.

ఈ కార్యక్రమంలో పత్రిక ఎడిటర్ ప్రజా డైరీ సురేష్ తిరుమల బ్యాంకు చైర్మన్ ఎం చంద్రశేఖర్, విజయ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, పారిశ్రామికవేత్త ఆనంద్ చోర్డియా, న్యాయవాది మహేష్ బాబు గౌడ్, కళాకారుడు తుపాకుల మహేష్, శ్రీలత కుమార్, పోతు రాజారామ్ తదితరులు పాల్గొన్నారు.

చల్లని కబురు..

 చల్లని కబురు..



రెండ్రోజుల్లో కేరళకు నైరుతి బుతుపవనాలు..


వెంకటేశ్వర్లపల్లి/ తెలంగాణ:


భారత వాతావరణ శాఖ ముందుగా ప్రకటించినట్టుగా ఈరోజు కేరళలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించలేదు. కేరళలో రుతుపవనాలు ఈనెల 27న ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ 12 రోజుల క్రితం ఒకసారి, రెండు రోజుల క్రితం మరోసారి వెల్లడించింది. అయితే ప్రస్తుతం లక్షద్వీప్‌, కేరళ, అరేబియా సముద్రం పరిసరాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నప్పటికీ వాయువ్య దిశగా వీస్తున్న గాలులు పడమర దిశలోకి పూర్తిగా మారలేదు. దీంతో కేరళలో రుతుపవనాల ప్రవేశానికి మరో రెండు, మూడు రోజుల సమయం పడుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. దక్షిణ అరేబియా సముద్రంలో పడమర గాలులు తక్కువ ఎత్తులో విస్తరించాయని, కేరళకు ఆనుకుని అరేబియా సముద్రంలో రుతుపవన మేఘాలు ఆవరించాయని...ఈ నేపథ్యంలో ఈనెల 29 లేదా 30వ తేదీన కేరళను రుతుపవనాలు తాకుతాయని వాతావరణ శాఖాధికారులు తెలిపారు.

Thursday, 26 May 2022

రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి..

 రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి.. 



కల్వర్టును ఢీకొని కింద పడ్డ కారు..

ఏపీ లోని అన్నమయ్య జిల్లాలో ఘటన..


వెంకటేశ్వర్లపల్లి/ తెలంగాణ:

ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లాలో ఈరోజు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 

వివరాల్లోకెళితే.. మదనపల్లి వద్ద కారు బోల్తాపడి నలుగురు మృతి చెందారు. మదనపల్లి మండలంలోని పుంగనూరు వద్ద ఘటన జరిగింది. అతివేగంగా కారణంగా అదుపతప్పి కారు కల్వర్టును ఢీ కొట్టి బోల్తాపడినట్లు తెలుస్తోంది. మృతదేహాలు కారులో ఇరుక్కుపోవడంతో బయటకు తీసేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. మృతులు నిమ్మనపల్లి మండలం రెడ్డిపల్లి వాసులుగా గుర్తించారు. మృతుల్లో భార్యభర్తలు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతులు గంగిరెడ్డి, మాధవీలత, కుషిరెడ్డి, దేవాన్ష్ రెడ్డిగా గుర్తించారు. అతివేగంతో తప్పిన కారు కల్వర్టును ఢీకొట్టి చెరువులో బోల్తాపడింది. మృతులు పెళ్లికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది.

ఇదిలా ఉంటే ఇటీవల ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా చిత్తూరు హైవేవై ఐతేపల్లి వద్ద ఘోర ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో చంద్రగిరి మండలం ఐతేపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హేవేపై వేగంగా వెళ్తున్న కారు వెనుక నుంచి లారీని డీ కొట్టింది. ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. విశాఖ నుంచి తిరుపతి వచ్చిన శ్రీవారి భక్తులు. దర్శనానికి టైమ్ ఉండటంతో మరో గుడిని దర్శించుకునేందుకువెళ్తుండగా ప్రమాదం జరిగింది.

గత ఏడాది ఇదే ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయనగరం జిల్లా నుంచి శ్రీవారి దర్శనానికి వచ్చిన కుటుంబంలోని ఆరుగురు ప్రమాదంలో మృతి చెందారు. కుటుంబంలో చిన్నపాప తప్ప అందరూ మరణించడం ప్రతి ఒక్కరినీ కంటతడిపెట్టింది. ఆ విషాదం మరవక ముందే అదే ప్రాంతంలో మరో కుటుంబం బలవడం ఆందోళన కలిగిస్తుంది.

Wednesday, 25 May 2022

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్..

 శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్..



  • హైదరాబాద్ టూ తిరుపతి యాత్ర..
  • ప్యాకేజీని ప్రకటించిన తెలంగాణ టూరిజం శాఖ..
  • ధర కేవలం రూ.4 వేల కంటే తక్కువే..


వెంకటేశ్వర్లపల్లి/ తెలంగాణ:

మీరు మీ కుటుంబ సభ్యులతో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్దామనుకుంటున్నారా?  అయితే, తెలంగాణ టూరిజం శాఖ యాత్ర ప్యాకేజీని ఈరోజే వెల్లడించింది. ఈ ప్యాకేజీ ధర కేవలం రూ.4వేల లోపే ఉంది.

కరోనా మహమ్మారి ప్రభావం దాదాపుగా తగ్గిపోవడంతో రెండేళ్లుగా టూర్లను వాయిదా వేసుకున్నవారంతా కూడా ఇప్పుడు మళ్లీ బ్యాగులు సిద్ధం చేసుకుంటున్నారు. వేసవి సెలవులు ఉండటంతో టూర్లకు  బయల్దేరుతున్నారు. తిరుమల లాంటి ఆధ్యాత్మిక క్షేత్రాలకు కూడా భక్తుల రద్దీ రోజు రోజుకు పెరుగుతోంది.  పర్యాటకుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని టూరిజం సంస్థలు పలు టూర్ ప్యాకేజీలను అందిస్తున్నాయి. తెలంగాణ టూరిజం శాఖ కూడా తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు టూర్ ప్యాకేజీలను అందిస్తోంది. అందులో భాగంగా తిరుమల తిరుపతి టూర్ ప్యాకేజీని అందిస్తోంది. ఈ టూర్ ప్యాకేజీ వివరాలను తెలంగాణ టూరిజం కు సంబంధించిన వెబ్ సైట్ లో చూడొచ్చు. ఇది రెండు రాత్రులు, ఒక రోజు టూర్ ప్యాకేజీ. మొదటి రోజు టూర్ సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌లో ప్రారంభమై, సాయంత్రం 5 గంటలకు కేపీహెచ్‌బీలో, సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్‌లోని యాత్రీ నివాస్‌లో, సాయంత్రం 6.15 గంటలకు బేగంపేటలోని టూరిజం ప్లాజాలో, సాయంత్రం 7 గంటలకు బషీర్‌బాగ్‌లోని సీఆర్‌ఓ ఆఫీసు దగ్గర ఈ టూరిజం బస్సులో రావచ్చు.

పర్యాటకులు మరుసటి రోజు ఉదయం 7 గంటలకు తిరుపతి చేరుకుంటారు. అక్కడ హోటల్‌లో వసతి సౌకర్యాలు కల్పిస్తుంది. పర్యాటకులు రెడీ అయిన తర్వాత తిరుమలకు బయల్దేరాల్సి ఉంటుంది.. తిరుమలలో సుమారు మధ్యాహ్నం ఒంటి గంటకు దర్శనం ఉంటుంది. దర్శనం పూర్తైన తర్వాత సాయంత్రం 5 గంటలకు తిరుగు ప్రయాణం ఉంటుంది. మరుసటి రోజు ఉదయం తిరుపతికి చేరుకోవడంతో టూర్ పూర్తవుతుంది.





తెలంగాణ టూరిజం అందించే తిరుమల తిరుపతి టూర్ ప్యాకేజీ ధర పెద్ద వారికైతే రూ.3,600, పిల్లలకైతే రూ.2,880. ఒక రోజులో తిరుపతి వెళ్లి తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవాలనుకునేవారికి ఈ టూర్ ప్యాకేజీ.  ఈ ప్యాకేజీలో బస్సులో ప్రయాణం, హోటల్‌లో వసతి, తిరుమలలో దర్శనం మాత్రమే కవర్ అవుతాయి. ఇతర ఆలయాల సందర్శన కవర్ కావు. తెలంగాణ టూరిజం బస్సులోనే ప్రయాణించాల్సి ఉంటుంది. సొంత ప్రయాణ ఏర్పాట్లు చేసుకొని ప్యాకేజీ టికెట్‌తో టీటీడీ దగ్గర రిపోర్ట్ చేయడం కుదరదు. ఇలాంటి పరిస్థితుల్లో డబ్బులు తిరిగి చెల్లించడం కుదరదని టూరిజం శాఖ స్పష్టం చేసింది.

రైతన్నల నిరసన పథం..

 రైతన్నల నిరసన పథం..



  • ల్యాండ్ పూలింగ్ కు వ్యతిరేకంగా కదం తొక్కిన ఓరుగల్లు రైతన్నలు..
  • ప్రభుత్వం జీవో 80ఏ ని రద్దు చేయాల్సిందే..
  • హన్మకొండ - హైదరాబాద్ హైవేపై బైఠాయింపు..
  • మద్దతు తెలిపిన బీజేపీ, కాంగ్రెస్ నేతలు..

వెంకటేశ్వర్లపల్లి/ తెలంగాణ:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణ జీవో 80ఏ తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఓరుగల్లు రైతన్నలు కదంతొక్కారు. హన్మకొండ - హైదరాబాద్ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ల్యాండ్ పూలింగ్ పథకానికి తమ విలువైన భూములను ఇచ్చేదేలేదని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతుల నిరసన కార్యక్రమానికి మద్దతుగా బీజేపీ, కాంగ్రెస్ నాయకులు నిలిచారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు మోహరించారు. రాజ్యాంగ బద్ధంగా నిరసన కార్యక్రమాలు తెలుపుతూ ఉంటే రైతులను అరెస్ట్ చేయడాన్ని పలువురు రాజకీయ నాయకులు ప్రశ్నించారు. కాగా, రైతుల నిరసన కార్యక్రమంతో హన్మకొండ - హైదరాబాద్ జాతీయ రహదారిపై పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.

ఘోర రోడ్డు ప్రమాదం..

 ఘోర రోడ్డు ప్రమాదం..



  • కారు వాగులో పడి ఆరుగురు మృతి..
  • గంగోత్రి జాతీయ రహదారిపై కోటిగడ్డ వద్ద ఘటన..
  • మృతులంతా పశ్చిమ బెంగాల్ వాసులుగా గుర్తింపు..


వెంకటేశ్వర్లపల్లి/ తెలంగాణ:

ఉత్తరాఖండ్ లోని తెహ్రి లో  ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. గంగోత్రి జాతీయ రహదారిపై ఈ సాయంత్రం కోటిగడ్డ సమీపంలో అదుపు తప్పి బొలెరో వాహనం హైవే పక్కనే ఉన్న వాగులో పడిపోయింది. వాహనం కాలువలో పడిన వెంటనే మంటలు చెలరేగాయి. వాహనం కాలువలో పడిపోవడాన్ని గమనించిన స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చెలరేగిన మంటలను నీళ్లు పోసి ఆర్పివేశారు. అయితే అప్పటికే కారులోని ఆరుగురు మృతి చెందారు. ప్రమాదంపై అధికార యంత్రాంగానికి సమాచారం అందించారు స్థానికులు.

ఇట్టి ప్రమాదంపై స్ధానిక తహసీల్దార్ మీడియాతో మాట్లాడుతూ.. వాహనంలో ఆరుగురు ఉన్నారని, వీరిలో ఐదుగురు పురుషులు, ఒక మహిళ ఉన్నట్లు తెలిపారు. మంటల్లో మూడు మృతదేహాలు వాహనం లోపల ఉండగా, మూడు మృతదేహాలు వాహనం బయట పడి ఉన్నాయని చెప్పారు. వాహనంలో ఉన్న వారందరూ పశ్చిమ బెంగాల్‌కు చెందిన వారని చెప్పారు. వీరందరూ ఉత్తరకాశీలోని ఒక కొండపై ట్రెక్కింగ్ కోసం ఉత్తరకాశీ వెళ్తున్నారని, ఈ ఉదయం ఈ యువకులు రెండు వాహనాల్లో రైవాలా నుంచి ఉత్తరకాశీకి బయలుదేరారని చెప్పారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

Tuesday, 24 May 2022

గుడిసెలు వేసుకున్న పేదలకు పట్టాలు ఇవ్వాల్సిందే..

 గుడిసెలు వేసుకున్న పేదలకు పట్టాలు ఇవ్వాల్సిందే...



  • ఊపిరి ఉన్నంతవరకు పేద ప్రజల పక్షాన పోరాడుతాం..
  • అక్రమ అరెస్టులు, తప్పుడు కేసులతో ఉద్యమాన్ని ఆపలేరు..
  • భూములు పంచేవరకు పోరాటాలు ఆపేదేలే: సీపీఐ 

వెంకటేశ్వర్లపల్లి/ తెలంగాణ:   


గుడిసెలు వేసుకున్న ప్రతీ ఒక్క నిరుపేద కుటుంబాల పేద ప్రజలకు ఇళ్ల పట్టాలివ్వాలని, తమ చివరి శ్వాసవరకు పేద ప్రజల కోసం పోరాడుతామని గ్రేటర్ వరంగల్ సిపిఐ నాయకులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రేటర్ పరిధిలోని సర్వే నెంబర్ 126లో నిమ్మల చెరువు వద్దగల ప్రభుత్వ భూమిలో సుమారు 600 మంది నిరుపేదలు గుడిసెలు వేసుకున్నారు. ఈ సందర్భంగా సీపీఐ నాయకులు మాట్లాడుతూ.. నిమ్మల చెరువును క్రమక్రమంగా పూడుస్తూ భూ కబ్జాదారులు చేస్తున్న క్రమంలో తమ పార్టీ ఆధ్వర్యంలో చెరువును సందర్శించి కబ్జా చేస్తుంది వాస్తవమేనని తేలిన క్రమంలో ఇండ్లు లేని పేదలను సమీకరించి, గుడిసెలు వేయించామని అన్నారు.

ఇళ్లు లేని నిరుపేద ప్రజల పోరాటం చేస్తున్న సీపీఐ నాయకులపై అక్రమ కేసులు, నిర్బంధాలు, బెదిరింపులు చేయడం పద్దతి కాదన్నారు. ప్రజా సమస్యల కోసం శాంతియుతంగా కమ్యూనిస్టులు శాంతియుతంగా చేస్తున్న ఉద్యమాలను అణచి వేసేందుకు ప్రయత్నం చేస్తే తిరుగుబాటు చేస్తామని ఈ సందర్భంగా సిపిఎం నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇప్పటికైనా, ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలాలు కేటాయించాలని, లేనియెడల రానున్న రోజుల్లో పేద ప్రజల పక్షాన ఉండి మరిన్ని భూపోరాటాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.



Monday, 23 May 2022

ఉపాధి కూలీగా ఆ గ్రామ సర్పంచ్..

ఉపాధి కూలీగా ఆ గ్రామ సర్పంచ్..




  • చేసిన అభివృద్ధి పనుల బిల్లుల చెల్లింపులో ఆలస్యం..
  • అప్పులకు మిత్తి పెరిగి, ఇల్లు గడవక ఉపాధి పనికి..
  • బిల్లులు ఇప్పించాలని సర్పంచ్ వేడుకోలు..

వెంకటేశ్వర్లపల్లి/ తెలంగాణ:

ఆమె ఆ గ్రామానికి ప్రథమ పౌరురాలు. తనకున్న హోదాను సైతం పక్కన పెట్టీ మరీ ఉపాధి కూలీ పనికి పోతున్నది.
వివరాల్లోకి వెళితే.. హన్మకొండ మండలం భీమదేవరపల్లి మండలం విశ్వనాథ కాలనీ (నూతనంగా ఏర్పడిన గ్రామ పంచాయితీ)కి వల్లెపు అనిత గ్రామ సర్పంచిగా ఎన్నికైనారు. అయితే, గ్రామానికి పల్లె ప్రకృతి వనం, స్మశాన వాటికతో పాటు పలు అభివృద్ధి పనులు లక్షలు వెచ్చించి సకాలంలో పూర్తి చేశారు. ఈ పనులన్నీ పూర్తి చేయడానికి డబ్బులను బయట మిత్తికి తెచ్చి మరీ పనులు చేశారు. అయితే, పనులు పూర్తి చేసినప్పటికీ ప్రభుత్వం సకాలంలో బిల్లులు మాత్రం చెల్లించలేదు. దీంతో, తెచ్చిన అప్పులకు మిత్తికి మిత్తి పెరిగింది. అంతేకాకుండా, ఇంట్లో పూట గడవడమే ఇబ్బందిగా మారింది. దీంతో, చేసేదేం లేక తన సర్పంచి హోదాను పక్కనపెట్టి భర్తతో కలిసి ఉపాధి హామీ(వంద రోజుల) పనికి పోతుంది. అటు ప్రభుత్వం, ఇటు ఉన్నతాధికారులు స్పందించి చేసిన పనుల బిల్లులు వెంటనే చెల్లించాలని సర్పంచ్ అనిత వేడుకుంటుంది.

ముందే ముగిసిన సీఎం ఢిల్లీ టూర్..


ముందే ముగిసిన సీఎం ఢిల్లీ టూర్..



షెడ్యూల్ కన్నా ముందే హైదరాబాద్ కు సీఎం కేసీఆర్..

షెడ్యూల్ ప్రకారం సీఎం ఈ 25వరకు ఢిల్లీలోనే..

హఠాత్తుగా హైదరాబాద్ రాకపై రాజకీయ వర్గాల్లో చర్చలు..


వెంకటేశ్వర్లపల్లి/ తెలంగాణ:


వారం రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీకి వెళ్లిన సీఎం కేసీఆర్ హఠాత్తుగా హైదరాబాద్కు బయలుదేరారు. ఈ నెల 25 వరకు దేశ రాజధాని ఢిల్లీలోనే ఉండాలి. కానీ, అనూహ్యంగా హైదరాబాద్ కు ఈ సాయంత్రం తిరుగు పయనమయ్యారు. బెంగళూరు, రాలేగావ్ సిద్ధి, షిర్డీ పర్యటనకు వెళ్లాల్సి ఉండగా వాటిని రద్దు చేసుకుని షెడ్యూల్‌ కన్నా ముందే సీఎం కేసీఆర్ ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు తిరిగిరావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నెలాఖరులోపు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం అందుతోంది. రాష్ట్రానికి అప్పులు ఇవ్వకుండా కేంద్రం అడ్డుకుంటోందని, ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని ఆయన నిర్ణయించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంపై వివక్ష వీడి కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణాలు కేంద్రం పరిధిలోకి రాకుండా చూడాలని అసెంబ్లీలో తీర్మానం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ హఠాత్తుగా హైదరాబాద్ కు తిరిగి పయనమయ్యారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 25 వరకు కేసీఆర్ ఢిల్లీలో ఉండాల్సింది. పలు జాతీయ పార్టీల నేతలు, జాతీయ మీడియాకు సంబంధించిన వారితో భేటీ అవుతారని సీఎం కార్యాలయం ప్రకటించింది.

బిజీబిజీగా మోదీ జపాన్ టూర్..

 బిజీబిజీగా మోదీ జపాన్ టూర్..



  • ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగం..
  • భారత్, జపాన్ సహజ భాగస్వాములన్న మోదీ..
  • క్వాడ్ సమావేశంలో పాల్గొననున్న పీఎం..


వెంకటేశ్వర్లపల్లి/ తెలంగాణ:


 -జపాన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన కొనసాగుతోంది. రెండు రోజుల పర్యటన నిమిత్తం అక్కడికి చేరుకున్న ఆయన బిజీబిజీగా గడుపుతున్నారు. తొలిరోజు టోక్యోలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. భారత్, జపాన్‌ సహజ భాగస్వాములని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. భారత్ అభివృద్ధిలో జపాన్‌ దేశస్థుల పెట్టుబడులు కీలక పాత్ర ఉందన్నారు. ప్రపంచ దేశాలు బుద్ధుడు చూపిన మార్గాన్ని అనుసరించాలన్నారు. సవాల్‌గా ఉన్నా హింస, అరాచకం, ఉగ్రవాదం, వాతావరణ మార్పుల నుంచి మానవాళిని అదే కాపాడుతుందని తెలిపారు. ఎంత పెద్ద సమస్య వచ్చినా భారత్ ఇట్టే పరిష్కారం చూపుతుందన్నారు. కోవిడ్ సమయంలో ఇదే రుజువయ్యిందని స్పష్టం చేశారు. తాను జపాన్‌కు వచ్చిన ప్రతిసారి మంచి ఆదరణ దక్కుతోందన్నారు ప్రధాని మోదీ. ప్రవాస భారతీయులు తనపై చూపుతున్న ఆదరణ మరవలేనిదన్నారు. జపాన్‌లో స్థిరపడినా, భారతీయ సంస్కృతిని కొనసాగిస్తున్నారని, ఇందుకు అందర్నీ అభినందిస్తున్నానని చెప్పారు.


భారత్‌ మాతాకీ జై అంటూ నినాదాలు మిన్నంటాయి. జపాన్‌ టూర్‌లో క్వాడ్ కూటమి సదస్సులో ఆయన పాల్గొనననున్నారు. ఈ సమావేశంలో భారత్‌, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌ దేశాలు పాల్గొంటాయి. జపాన్‌ ప్రధాని కిషద, ఆస్ట్రేలియా నూతన ప్రధాని ఆంటోని అల్బనీస్‌తో ప్రత్యేకంగా భేటీ అవుతారు. ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు.



పొంచిఉన్న ప్రమాదం..

 పొంచిఉన్న  ప్రమాదం..



  • శిథిలావస్థలో నిజాం కాలం నాటి బ్రిడ్జి..
  • సుల్తాన్ పూర్ - జమ్ షెడ్ బేగ్ పేట గ్రామాల మధ్య వంతెన..
  • బిక్కుబిక్కుమంటూ ప్రయాణీకుల రాకపోకలు..
  • హైలెవల్ వంతెన నిర్మాణం చేపట్టాలని డిమాండ్..


వెంకటేశ్వర్లపల్లి/ తెలంగాణ:


అధికారుల నిర్లక్ష్యం, ప్రజా ప్రతినిధుల అలసత్వం ప్రయాణీకుల పాలిట శాపంగా మారుతోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం సుల్తాన్ పూర్ - జమ్ షెడ్ బేగ్ పేట గ్రామాల మధ్య ఉన్న వాగుపై రాకపోకలకు వీలుగా నిజాం నవాబు కాలంలో బ్రిడ్జి నిర్మాణం చేశారు. అయితే, రెండేళ్ల క్రితం కురిసిన భారీ వర్షాలకు బ్రిడ్జి పిల్లర్ రాళ్ళు కూలిపోయాయి. అప్పుడు బ్రిడ్జిని సంబంధిత అధికారులు పరిశీలించి తాత్కాలిక మరమ్మత్తులు చేశారు. అప్పటి నుండి అదే బ్రిడ్జి గుండా నిత్యం వేలాది వాహనాలు రాకపోకలను సాగిస్తున్నాయి. రేగొండ నుండి జగ్గయ్యపేట, సుల్తాన్ పూర్, కొత్తపల్లిగోరి, కొత్తపల్లి, అబ్బాపూర్, జాకారం, ములుగు తో పాటు చుట్టుపక్కల గ్రామాలైన వెంకటేశ్వర్లపల్లి, కోనరావు పేట, నిజాం పల్లి, కొప్పుల, గంగిరేని గూడెం మరియు మరికొన్ని గ్రామాల ప్రజలు ప్రయాణం చేస్తుంటారు. అయితే, ఈ బ్రిడ్జిపై ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ పనుల నిమిత్తం వెళ్తుంటారు. ఇటీవల ఈ బ్రిడ్జి మీదుగా ప్రయాణీకుల తో వెళ్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పెద్ద ప్రమాదం ఏమీ జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు వెంటనే స్పందించి హైలెవల్ వంతెన నిర్మాణం చేపట్టాలని పరిసర ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు.

Sunday, 22 May 2022

దేశ రాజధానిలో భారీ వర్షం..

 దేశ రాజధానిలో భారీ వర్షం..



  • పలు చోట్ల ఇళ్లు ధ్వంసం..
  • లోతట్టు ప్రాంతాలు జలమయం..
  • నిలిచిపోయిన విమాన రాకపోకలు..


వెంకటేశ్వర్లపల్లి/ తెలంగాణ:


దేశ రాజధాని ఢిల్లీలో ఈ తెల్లవారుజాము నుండి ఓ మోస్తారు వర్షం కురుస్తుంది. గత కొన్ని రోజులుగా ఎండలతో అల్లాడిపోతున్న  ఢిల్లీ వాసులకు ఈ వర్షం కాస్త ఉపశమనం కలిగించింది. గంటకు సుమారు 60 నుండి 90 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీయడంతో భారీ వృక్షాలు నేలకొరిగాయి. దీంతో, పలు మార్గాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చాలా చోట్ల విద్యుత్ సరఫరా నిలిపివేశారు అధికారులు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షానికి పలు ఇళ్లు పూర్తిగా నేలమట్టం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. ఈ వర్షం ఇప్పట్లో తగ్గేలా లేదని, మరికొన్ని గంటల పాటు భారీ వర్షాలు అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కావున, ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఢిల్లీ ప్రభుత్వం సూచించింది. వాతావరణం అనుకూలంగా లేక న్యూఢిల్లీలో ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన రాకపోకలు నిలిపివేసినట్లు ఎయిర్పోర్ట్ ట్విట్టర్ లో వెల్లడించింది.



ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్

 ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్..



వెంకటేశ్వర్లపల్లి/ తెలంగాణ:

ఈ మధ్య ఎస్బిఐ ఖాతాదారులకు మీరు కేవైసీ సబ్మిట్ చేయకపోతే మీ అకౌంట్లను బ్లాక్ చేస్తామని వస్తున్న మెసేజ్ లపై కేంద్రం అలర్ట్ అయింది. ఈజీ మనీ కోసం సైబర్ నేరస్తులు ఎస్బిఐ ఖాతాదారుల్ని టార్గెట్ చేశారు. అటువంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని ఫోన్ కాల్స్, మెసేజ్, ఈ మెయిల్స్ కు రిప్లై ఇవ్వద్దని కేంద్రం సూచించింది. ఎస్బిఐ ఖాతాదారులు ఇలాంటి మెసేజ్ ల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఇటువంటి మెసేజ్ లపై ఎటువంటి అనుమానం వచ్చినా బ్యాంకు అధికారులు సంప్రదించాలని ట్విట్టర్లో వెల్లడించింది.



ప్రపంచాన్ని వెంటాడుతున్న వైరస్ ల భయం

 ప్రపంచాన్ని వెంటాడుతున్న వైరస్ ల భయం



  • ఐరోపా దేశాల్లో వేగంగా విస్తరిస్తున్న మంకీపాక్స్..
  • అప్రమత్తమైన డబ్ల్యూహెచ్ఓ..


వెంకటేశ్వర్లపల్లి/ తెలంగాణ:

కరోనా నుండి ప్రపంచం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో మళ్లీ ఓ పిడుగులాంటి వార్త ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. తాజాగా ప్రస్తుతం మంకీపాక్స్ వైరస్ ప్రపంచ దేశాలను హడలెత్తిస్తోంది. మంకీపాక్స్ వైరస్ పై అమెరికా అధ్యక్షుడు బైడెన్ స్పందించారు. ఈ వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మంకీపాక్స్ తక్కువ సమయంలోనే 15 దేశాలకు దావణంలా విస్తరించి ఉందన్నారు. ఈ వైరస్ ను  అరికట్టేందుకు ఎలాంటి ఔషధాలు, టీకా లను వాడాలో అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 96 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయని మీడియాకు వెల్లడించారు. 


ఇదిలావుండగా, ప్రపంచంలో మంకీపాక్స్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. వేగంగా పెరుగుతున్న మంకీపాక్స్ కేసులపై చర్చించడం కోసం నిపుణులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయనుంది. మే నెల ప్రారంభం నుంచి ఈ కేసులు ఆస్ట్రేలియా, కెనడా, జపాన్, ఇటలీ తదితర దేశాల్లో ఎక్కువగా వెలుగు చూశాయి. మే 7వ తేదీన ఇంగ్లాండ్ లో మంకీపాక్స్ కేసు నిర్ధారణ కాగా, అతడు అంతకు ముందే నైజీరియా వెళ్లివచ్చాడని యుకే హెల్త్  సెక్యూరిటీ ఏజెన్సీ నిర్ధారించింది. 


మంకీపాక్స్ ఓ అరుదైన ఇన్ఫెక్షన్, కానీ ఈ తరహా వ్యాధి వైరల్ వ్యాధి విషమమైంది. ముందుగా జ్వరం, శోషరస గ్రంథుల వాపు లాంటి లక్షణాలతో ఈ ఇన్ఫెక్షన్ బయటపడుతుంది. మనుషుల్లో ఒకరి నుంచి మరొకరికి ఈ వైరస్ త్వరగా వ్యాప్తి చెందదు. కానీ, శరీర స్రావాలు, మంకీపాక్స్ పుండ్లు, స్రవాలతో కలుషితమైన దుస్తులు, బెడ్, శ్వాస తుంపర్ల ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ వైరస్ బారిన పడ్డాక,  ముందుగా ప్లూ లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆ తరువాత శరీరంలో ఒక చోట పుండులా ఏర్పడి క్రమంగా శరీరంలోని ఇతర భాగాలకు పుండ్లు విస్తరిస్తాయి. లైంగికంగా సక్రమించే సిఫిలిస్ లేదా హెర్ప్స్ లేదా వెర్సిల్లా జోస్టర్ వైరస్‌ను ఇది పోలి ఉంటుంది.

బోల్తా పడ్డ ఆయిల్ ట్యాంకర్

 బోల్తా పడ్డ ఆయిల్ ట్యాంకర్..



  • డబ్బాలు, క్యాన్లు పట్టుకొని పరుగెత్తిన జనం..
  • భారీగా ట్రాఫిక్ జామ్..
  • అహ్మదాబాద్ - ముంబై జాతీయ రహదారిపై ఘటన..


వెంకటేశ్వర్లపల్లి/ తెలంగాణ:

అహ్మదాబాద్ - ముంబై జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ఆయిల్ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటన మహారాష్ట్ర లోని పాల్గార్  జిల్లాలోని తవా గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న స్థానికులు, చుట్టుపక్కల గ్రామాల నుండి  పెద్ద సంఖ్యలో ప్రజలు లీకైన వంట నూనె కోసం ఎగబడ్డారు. డబ్బాలు, క్యాన్లు, బిందెలతో అక్కడికి చేరుకుని వంట నూనె కోసం పోటీ పడ్డారు. క్రమంలోనే అహ్మదాబాద్ - ముంబై జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇట్టి విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రజలను నిలువరించే ప్రయత్నం చేశారు. కాగా, ఈ ప్రమాదంలో డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి. బోల్తా పడ్డ ట్యాంకర్ లో 12 వేల లీటర్ల వంటనూనె ఉందని, దాన్ని సూరత్ నుండి ముంబైకి తరలిస్తున్నట్లు పోలీసులు మీడియాకు తెలిపారు.

Saturday, 21 May 2022

పది పరీక్షలు రేపటి నుంచే

 పది పరీక్షలు రేపటి నుంచే..



  • పకడ్బంది ఏర్పాట్లు చేసిన విద్యాశాఖ..
  • 5 నిమిషాలు ఆలస్యమయితే నో ఎంట్రీ..


వెంకటేశ్వర్లపల్లి/ తెలంగాణ:

రేపటి నుండి ప్రారంభమయ్యే పదో తరగతి వార్షిక పరీక్షలకు తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 9:30 గంటలనుండి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2,861 కేంద్రాల్లో 5,09,280 మంది విద్యార్ధులు పరీక్షలు రాయనున్నారు. ఇందుకోసం పరీక్షల విభాగం నుండి నాలుగు ప్రత్యేక ఫ్లయింగ్ స్క్వాడ్ లు, రాష్ట్ర వ్యాప్తంగా మరో 144 స్క్వాడ్ లను  ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. అన్ని పరీక్ష కేంద్రాల మధ్య 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, పరీక్షలు పూర్తయ్యేవరకూ దగ్గరలోని జిరాక్స్ కేంద్రాలన్నీ మూసివేసి ఉంచాలని విద్యాశాఖ వెల్లడించింది.


కాగా, విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. విద్యార్థులు ఆందోళనకు గురవకుండా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాయాలన్నారు. పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా అన్ని విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మంత్రి వెల్లడించారు. విద్యార్థుల కోసం ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడుపుతున్నామని, విద్యుత్ సమస్యలు లేకుండా చూస్తామని తెలిపారు. పరీక్షల నిర్వహణలో సమస్యలు తలెత్తితే వాటి పరిష్కారం కొరకు సంచాలకుల కార్యాలయంలో స్పెషల్ కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశామన్నారు.

26న కేడీసీలో పూర్వ విద్యార్థుల సమావేశం..

 26న కేడీసీలో పూర్వ విద్యార్థుల సమావేశం..



వెంకటేశ్వర్లపల్లి/ తెలంగాణ:

హనుమకొండ కొత్త బస్టాండ్ రోడ్డులోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 26(గురువారం)న పూర్వ విద్యార్థుల సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాజారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కళాశాలలో విద్యనభ్యసించి ఎంతో మంది వివిధ రంగాల్లో రాణిస్తున్నారని, దేశవిదేశాల్లో స్థిరపడ్డట్లు వెల్లడించారు. అటువంటి వారందరినీ ఒక వేదికపై తీసుకొచ్చేందుకే ఒక ప్రయత్నం చేస్తున్నట్లు పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం డాక్టర్ వినోద్ రావు 99663 43468, మొగిలి 98497 30523 నెంబర్లకు ఫోన్ చేసి సంప్రదించాలని ప్రిన్సిపాల్ డాక్టర్ రాజారెడ్డి కోరారు.

బిగ్ బాస్ నాన్ స్టాప్ ఫైనల్ విన్నర్

 బిగ్ బాస్ నాన్ స్టాప్ ఫైనల్ విన్నర్ బిందు మాధవి



వెంకటేశ్వర్లపల్లి/ తెలంగాణ:

బిగ్ బాస్ నాన్ స్టాప్ లో మొదటి నుండి దూకుడుగా వ్యవహరించిన నటీ బిందు మాధవి విజేతగా నిలిచింది.   బిగ్ బాస్ తెలుగు సీజన్ ఇప్పటివరకు కంటెస్ట్ చేసిన మహిళల్లో ఒక్కరు కూడా విజయం సాధించలేకపోయారు. కానీ, బిందు మాధవి ఆ రికార్డును బద్దలు కొట్టి విజయం సాధించింది. చివరి వరకు అఖిల్ సార్ధక్ తీవ్రమైన పోటీని ఇచ్చినప్పటికీ, బిందుమాధవి నినే విజయం వరించింది. దీంతో ట్రోఫీ తో పాటు రూ.40లక్షల ప్రైజ్ మనీ సొంతం చేసుకుంది. 

చివరి వారం బిందుమాధవి,  అఖిల్ ల మధ్య పోటీ నువ్వా, నేనా అన్న రేంజ్ లో ఓట్లు పోలయ్యాయి. తెలుగు తో పాటు తమిళ్ లో ఎక్కువ మంది బిందు మాధవి కి గుర్తింపు ఉండటంతో ఆ ప్రాంతం ఓట్లు విజయానికి దారితీశాయని చెప్పొచ్చు. 

అలా ఈ సీజన్ విజేతగా బిందు మాధవి నిలిచింది. 


ఈ ట్రోఫీ అందుతున్న అనంతరం బిందు మాధవి మాట్లాడుతూ.. లేట్ బ్లూమర్స్ కు ఈ ట్రోఫీని అంకితం ఇస్తున్నట్లు ప్రకటించింది. ఎందుకంటే, నేను కూడా ఇదే కోవకు చెందినదాన్నే అని, అందుకే నా లైఫ్ లో అన్నీ ఆలస్యంగా దక్కేవని తెలిపింది.   ఆలస్యం అయినా, ఈ ట్రోఫీ ని అందుకోవడం చాలా సంతోషంగా ఉందని, తనకు ఓట్లేసిన ప్రేక్షకులందరికీ థాంక్స్ చెబుతూ ఒకింత భావోద్వేగానికి లోనయింది.

పెట్రోల్, డీజిల్ రేట్ల తగ్గింపు..

 వాహనదారులకు ఊరటనిచ్చిన కేంద్రం..

పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం.



వెంకటేశ్వర్లపల్లి/ తెలంగాణ:


దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో అల్లాడిపోతున్న వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఒక లీటర్ డీజిల్ పై రూ.6, పెట్రోల్ పై రూ.8 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ ప్రకటన విడుదల చేసింది. ద్రవ్యోల్బణం అమాంతం పెరుగుతూ పోతుండటం, అంతర్జాతీయ మార్కెట్లో ఒడిదుడుకులతో మనదేశంలో లో ఇంధన ధరలు అమాంతం పెరుగుతూ వస్తున్నాయి. ఇదిలావుండగా,  గతంలో ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ అన్ని రాష్ట్రాల్లోనూ వ్యాట్ ధరలను తగ్గించాలని ప్రధాని మోదీ సూచించిన  విషయం మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం దేశ ప్రజలపై విపరీతమైన భారం పడుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం హర్షించదగినది. కాగా, ఈ తాజా నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వానికి ఏడాదికి సుమారు రూ. లక్ష కోట్లకు పైచిలుకు రాబడి తగ్గే అవకాశం ఉంది. 

కాగా, దేశ ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని, దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు నిర్ణయం  వివిధ రంగాలపై సానుకూల ప్రభావం చూపుతుందని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుతో ప్రజలకు ఊరట ఇవ్వడంతో పాటు, వారి జీవితాన్ని సులభతరం చేస్తుందని ట్విట్టర్లో పేర్కొన్నారు.



Friday, 20 May 2022

ఢిల్లీలో ఉన్న హైదరాబాద్ హౌజ్..

 ఢిల్లీలో ఉన్న హైదరాబాద్ హౌస్ విశేషాలు..

వెంకటేశ్వర్లపల్లి/ తెలంగాణ:


భారతదేశ రాజధాని ఢిల్లీ నగర నడిబొడ్డున, ఇండియా గేట్ ను ఆనుకొని 'హైదరాబాద్ హౌస్' ఉన్నది. ఇది సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమై ఉంది. ఐతే, గత మార్చి, ఏప్రిల్ నెలలో నేను ఢిల్లీ పర్యటనలో ఉన్నప్పుడు మిత్రులతో కలిసి ఓరోజు రాత్రి హైదరాబాద్ హౌస్ ను సందర్శించాను. అక్కడ నేను హైదరాబాద్ హౌస్ గురించి తెలుసుకున్న కొన్ని విషయాలను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను.


దేశ రాజధాని ఢిల్లీలో ఏడో నిజాం రాజు ఢిల్లీ వెళ్లినప్పుడు తమ విడిది కోసం ఓ భవనం ఉండాలని భావించారు. అనుకున్నదే తడవు ఈ (హైదరాబాద్ హౌస్) భారీ కట్టడానికి శ్రీకారం చుట్టారు. అందుకోసం విదేశీ వాస్తుశిల్పి అయిన లుటియిన్స్ కు పనులను అప్పగించారు. మొగలుల శైలిని కలగలుపుతూ దీనిని నిర్మించారు. హైదరాబాద్ హౌస్ కు వెళ్లినప్పుడు ఎత్తైన గుమ్మటం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. దీని నిర్మాణానికి బర్మా నుంచి ప్రత్యేకంగా తెప్పించిన ఎంతో విలువైన టేకు కలపను ఇందులో ఉపయోగించారు. 


ఇకపోతే,  హైదరాబాద్ హౌస్ అంటేనే విలేకరుల సమావేశాలు, విదేశీ ప్రముఖులతో చాయి పే చర్చా తో పాటు ముఖ్యమైన కార్యక్రమాలు ఏమైనా అన్నింటికీ వేదిక హైదరాబాద్ హౌస్ ఒకటే. ఏ దేశ అధ్యక్షుడైనా ఢిల్లీ పర్యటనకు వచ్చినప్పుడు హైదరాబాద్ హౌస్ గడప తొక్కి తీరాల్సిందే. ఈ నిజాం రాజు ప్రభువుల కలల సౌధంగా రూపుదిద్దుకున్న హైదరాబాద్ హౌస్ మన హైదరాబాద్ కు ప్రతిబింబంగా నిలుస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 

ఢిల్లీలో నిర్మించిన హైదరాబాద్ హౌస్ ఇస్లాం సాంప్రదాయ పద్ధతికి కాస్త భిన్నంగా, అత్యాధునిక యూరోపియన్ శైలిలో నిర్మించడంతో ఇందులో నివాసం ఉండేందుకు నిజాం కుమారులు ఇష్టపడలేదని సమాచారం. ఇదిలావుండగా, దేశ, విదేశీ ముఖ్యులు ఢిల్లీ పర్యటనకు వచ్చినప్పుడు హైదరాబాద్ హౌస్ ను చూసి ఎంతో మంత్రముగ్ధులు అయ్యేవారు. ఐతే, అంతటి గొప్ప గుర్తింపు ఉన్న ఈ ప్యాలెస్ ను నిర్మించిన నిజాం రాజు కేవలం మూడు, నాలుగు సార్లు మాత్రమే సందర్శించారని అక్కడున్న వారు తెలిపారు


.

శ్రీలంక సంక్షోభం..

 తీవ్ర సంక్షోభంతో అల్లాడిపోతున్న లంకేయులు

పాఠశాలలు, కార్యాలయాలు బంద్..
పెట్రోలు డబ్బాలతో బంకుల వద్ద పడిగాపులు..

వెంకటేశ్వర్లపల్లి/ తెలంగాణ:
శ్రీలంకలో రోజు రోజుకు పరిస్థితులు మరీ దారుణంగా తయారవుతున్నాయి. తాజాగా అక్కడి పాఠశాలన్నింటినీ మూసి వేస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా కార్యాలయాలకు రావద్దని సూచించారు. ప్రస్తుతం శ్రీలంకలో తీవ్రమైన ఇంధన కొరత కొనసాగుతోంది. పెట్రోలు డబ్బాలతో బంకుల వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, పెట్రోల్ తో పాటు ఇతర ఇంధనాల కొరత లంక ప్రజలను వేధిస్తోంది. రోజుల తరబడి పెట్రోల్ బంకుల వద్ద పడిగాపులు కాస్తున్న సందర్భంలో పలుచోట్ల ఘర్షణలు జరుగుతున్నాయి. ఇంధన దిగుమతికి డాలర్లు లేకపోవడంతో అంతర్జాతీయ సంస్థలు విదేశాల సహాయం కోసం ఎదురుచూస్తోంది.
ఇదిలావుండగా,  సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న లంక లో నూతనంగా 9 మంది మంత్రులను నియమించారు. లంకలో పూర్తి స్థాయి మంత్రివర్గం ఏర్పాటు జరిగే వరకు వివిధ కార్యకలాపాలు నిర్వహిస్తారు. ఏప్రిల్ 9వ తేదీ నుండి కొలంబో లోని గాలే ఫేస్ గ్రీన్ లో గొటబాయకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్న సంగతి విదితమే. ఈ నిరసనల్లో ఇప్పటికే 12 మంది ప్రాణాలు కోల్పోగా,  మరో 250 మందికి పైగా గాయల పాలయ్యారు.

కాగా, శ్రీలంక 70ఏళ్ల  చరిత్రలో మొట్టమొదటి సారిగా రుణాలను ఎగవేసింది. తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్న శ్రీలంక దేశం చెల్లించాల్సిన 78 మిలియన్ డాలర్ల రుణానికి సంబంధించి గ్రేస్ పీరియడ్ కూడా గడువు తీరడంతో ఎగవేసినట్లు తేలిపోయింది. ఇట్టి విషయాన్ని క్రెడిట్ ఏజెన్సీలు అధికారికంగా ధ్రువీకరించాయి. ఇప్పటికే కొవిడ్ కారణంగా లంక ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతిన్నది. దీనికి తోడు విదేశీ మారక ద్రవ్యం కొరత ద్రవ్యోల్బణం లో పెరుగుదల కారణంగా ఔషధాలతో పాటు తీవ్ర ఇంధన కొరత కూడా ఏర్పడింది.


Thursday, 19 May 2022

రేగొండ బస్ షెల్టర్..

 రేగొండలో నిలువ నీడ కరువు..!?

ఎండలోనే బస్సుల కోసం గంటలకొద్ది పడిగాపులు..


మరుగుదొడ్లు లేక మహిళా ప్రయాణికుల బాధలు వర్ణనాతీతం..

పట్టించుకోని పాలకులు, ఆర్టీసీ అధికారులు..




వెంకటేశ్వర్లపల్లి/తెలంగాణ:
ఓవైపు మండే ఎండ.. మరోవైపు సమయానికి రాని ఆర్టీసీ బస్సులు.. వీటికి తోడు బస్ షెల్టర్ కరువు.. వెరసి, అటు పాలకులు, ఇటు ఆర్టీసీ అధికారుల అలసత్వంతో రేగొండ మండల కేంద్రంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వివరాల్లోకి వెళితే..
జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోనే అతిపెద్ద మండల కేంద్రమైన రేగొండలో బస్ షెల్టర్ లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
రేగొండ మండల కేంద్రంలో ప్రయాణికులకు బస్టాండ్ లేకపోవడంతో ఎండకు, వానకు రక్షణ లేకుండా ప్రయాణికులకు బస్సుల కోసం గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది. ప్రధానంగా టాయిలెట్ల సౌకర్యం లేకపోవడంతో మహిళ ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు విద్యార్థులు ఎండలోనే నిరీక్షించాల్సి వస్తోంది. బస్ షెల్టర్లు లేకపోవడంతో ఇక్కడున్న షాపులు, కిరాణా షాపుల ముందు నిల్చొని ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.  నిత్యం వేలాది మంది ప్రయాణికులతో వివిధ పనుల నిమిత్తం ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే వారితో రేగొండ మండల కేంద్రం కిటకిటలాడుతూ ఉంటుంది. 

 *నాలుగు రూట్లకు మెయిన్ సెంటర్ రేగొండ...* 


రేగొండ మండల కేంద్రం నుండి నాలుగువైపులా ప్రధాన రహదారులు ఉన్నాయి. ఈ రహదారులన్నీ ప్రధానమైన పట్టణాలను కలుపుతాయి.  అందులో ఒకవైపు పరకాల, హన్మకొండ, హైదరాబాద్, అలాగే మరోవైపు గణపురం భూపాలపల్లి, కాళేశ్వరం, సిరోంచ, గడ్చిరోలి..
మరోవైపు జగ్గయ్యపేట, సుల్తాన్ పూర్, గోరికొత్తపల్లి, జాకారం, ములుగు, ఏటూరునాగారం, మల్లంపల్లి నర్సంపేట..
అదేవిధంగా మరోవైపు కోటంచ, చిట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి, ఒడేడ్ తదితర ప్రధాన గ్రామాలు, పట్టణాలను కలుపతుంది రేగొండ మండల కేంద్రం. అంతటి ప్రాముఖ్యత కలిగినటువంటి మండల కేంద్రంలో నేటికీ బస్ షెల్టర్ లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. 
ఆర్టీసీ బస్సులో సురక్షితంగా ప్రయాణించండి.. క్షేమంగా గమ్యస్థానం చేరుకోండి.. అని ప్రచారం చేస్తున్న ఆర్టీసీ అధికారులు బస్సు షెల్టర్లపై మాత్రం దృష్టి పెట్టడం లేదని పలువురు ప్రయాణీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 అధికారులు నిర్లక్ష్యం సరికాదు.


రేగొండలో బస్ షెల్టర్ నిర్మాణంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. బస్సుల కోసం ఎండకు ఎండి, వర్షానికి తడిసి గంటల తరబడి రోడ్డుపైనే వేచి చూడాల్సి వస్తుంది. బస్ షెల్టర్ నిర్మాణం కోసం పలుమార్లు పాలకులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకున్న పాపాన పోలేదు. అధికారులు అలసత్వం వీడి వెంటనే బస్ షెల్టర్ నిర్మించాలి.

పాండవుల గుట్టలు..

 అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా పాండవుల గుట్టలు..




వెంకటేశ్వర్లపల్లి/తెలంగాణ: జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని తిరుమలగిరి శివార్లలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన పాండవుల గుట్టలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోంది. దీంతో, చుట్టు పక్కల గ్రామాల ప్రజలు, పర్యావణవేత్తలు, ప్రకృతి ప్రేమికులు, మేధావులు, రచయితలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రాచీన కాలంలో ఇక్కడ బౌద్ధం పరిఢవిల్లిందని, బౌద్ధుల ధ్యాన కేంద్రంగా పాండవుల గుట్టలకు ఒక ప్రత్యేకత ఉందని చరిత్రకారులు చెపుతున్నారు.

అంతేగాక, పాండవుల గుట్టలని రాతి చిత్రాల విశ్వవిద్యాలయంగా చెప్పుకుంటారు. ఇటీవలే పాండవుల గుట్టలను కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి సందర్శించారు. పాండవుల గుట్టలను పర్యాటక ప్రదేశంగా మరింత అభివృద్ది చేసేలా కృషి చేస్తామని చెప్పారు. అంతేకాకుండా, పాండవుల గుట్టలను యునెస్కో కు ప్రతిపాదించి, వారసత్వ హోదా దక్కేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఇంతటి ప్రాధాన్యత పొందిన పాండవుల గుట్టల్లో ఈమధ్యకాలంలో కొంతమంది వారి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చుకుని రెచ్చిపోతున్నారు. ప్రతి ఆదివారం సెలవు దినం కావడంతో ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున పర్యాటకులు తరలివస్తారు. పెద్ద ఎత్తున పాండవుల గుట్టల్లో పేకాట ఆడుతుండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి నిందితులపై కేసులు నమోదు చేశారు. దీంతో, జిల్లాల్లో చర్చానియంశంగా మారింది. పాండవుల గుట్ట ప్రతిష్ఠతకు భంగం వాటిల్లుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటివి తిరిగి పునరావృతం కాకుండా చూడాలని పరిసర ప్రాంతవాసులు కోరుకుంటున్నారు.

ఆ గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, పంచాయతీ సెక్రటరీ సస్పెన్షన్

  ఆ గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, పంచాయితీ కార్యదర్శి సస్పెన్షన్ తెలంగాణ: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గాజులగట్టు గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, ...