Thursday, 30 June 2022

నిలిచిపోయిన ఎస్బిఐ సేవలు..

నిలిచిపోయిన ఎస్బిఐ

సేవలు..



ఎస్బిఐ శాలరీ అకౌంట్ ఉన్న ఉద్యోగుల విమర్శలు..


తెలంగాణ:


దేశంలోనే అతిపెద్ద బ్యాంకు ఎస్‌బీఐ సేవలకు గురువారం అంతరాయం  ఏర్పడింది.  మధ్యాహ్నం నుంచి యోనో యాప్‌, యూపీఐ సేవలు నిలిచిపోయాయి. ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌, ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌ విషయంలోనూ సమస్యలు ఎదుర్కొంటున్నట్లు యూజర్లు సోషల్‌ మీడియాలో ఫిర్యాదు చేస్తున్నారు. ఏటీఎం సెంటర్లో కూడా నగదు ఉపసంహరణ జరగడం లేదని వాపోతున్నారు.

ఎస్‌బీఐ బ్యాంక్‌ సేవలు పనిచేయకపోవడంతో కస్టమర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు సేవలు ఎప్పుడు పునరద్ధరిస్తామనేది కూడా ఎస్‌బీఐ అధికారులు చెప్పలేకపోతున్నారు. అంతేగాక, నెలాఖరు కావడంతో జీతాలు పడే వేళ ఇలా బ్యాంక్‌ సేవలు స్తంభించడంపై ఎస్‌బీఐ శాలరీ అకౌంట్లు ఉన్న ఉద్యోగుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Wednesday, 29 June 2022

రేపే పాలిటెక్నిక్ ఎంట్రెన్స్ ఎగ్జామ్

 రేపే పాలిటెక్నిక్ ఎంట్రెన్స్ ఎగ్జామ్



తెలంగాణ:

రేపు తెలంగాణ వ్యాప్తంగా పాలిటెక్నిక్ ఎంట్రెన్స్ ఎగ్జామ్(పాలీసెట్-2022)ను నిర్వ‌హించ‌నున్నారు. ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సుల‌తో పాటు వ్య‌వ‌సాయ‌, ఉద్యాన‌వ‌న‌, వెట‌ర్న‌రీ డిప్లొమా కోర్సుల‌కు ఈ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ద్వారా ప్రవేశాలు క‌ల్పించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో ఎగ్జామ్ నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి ఏర్పాట్లు పూర్త‌య్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 365 ప‌రీక్షా కేంద్రాల్లో ఉద‌యం 11 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 1:30 గంట‌ల వ‌ర‌కు ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్నారు. అయితే, ప‌రీక్షా కేంద్రాల్లోకి గంట ముందే అభ్య‌ర్థుల‌ను అనుమ‌తిస్తామ‌ని అధికారులు పేర్కొన్నారు. ప‌రీక్ష ప్రారంభ‌మైన త‌ర్వాత ఒక్క నిమిషం ఆల‌స్య‌మైన అనుమ‌తించ‌మ‌ని స్ప‌ష్టం చేశారు. ఈ విష‌యాన్ని అభ్య‌ర్థులు, వారి త‌ల్లిదండ్రులు దృష్టిలో ఉంచుకోవాల‌ని సూచించారు. ప‌రీక్ష రాసే వారు త‌ప్ప‌కుండా 10 గంట‌ల‌కే ఎగ్జామ్ సెంట‌ర్‌కు చేరుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

Tuesday, 28 June 2022

శ్రీవారి సేవలో సినీ నటి

 శ్రీవారి సేవలో సినీ నటి



తెలంగాణ:


తిరుమల శ్రీవారిని సినీ నటి రాశీ ఖన్నా ఈరోజు దర్శించుకున్నారు. వీఐపీ దర్శన సమయంలో స్వామి వారి సేవలో పాల్గొన్నారు. పక్కా కమర్షియల్ చిత్రం విజయవంతం కావాలని శ్రీవారిని ప్రార్థించినట్లు ఆమె మీడియాకు వెల్లడించారు. ఈ ఉదయం తోమాలసేవలో ఆమె.. పక్కా కమర్షియల్ చిత్ర నిర్మాత బన్నీ వాసుతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేసి శ్రీవారి లడ్డూ ప్రసాదాలను అందజేశారు.

అసెంబ్లీ సీట్ల పెంపునకు కేంద్రం కసరత్తు..

 అసెంబ్లీ సీట్ల పెంపునకు కేంద్రం కసరత్తు..



- తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెరుగుదల..

- త్వరలో పార్లమెంటులో బిల్లు పెట్టే ఛాన్స్..

- ఏపిలో 175 నుండి 225కు, తెలంగాణలో 119 నుండి 153 కు పెరిగే అవకాశం..



తెలంగాణ:


ఎమ్మెల్యే ఆశావాహులకు ఇది నిజంగా గుడ్ న్యూసే. గత ఎనిమిదేళ్లుగా ఇటు ఏపీ అటు తెలంగాణ రాష్ట్రాలు ఆశిస్తున్నట్లు అసెంబ్లీ సీట్ల పెంపు అంశంపై కేంద్ర ప్రభుత్వం దృష్టిపెట్టింది. రాష్ట్ర విభజన చట్టంలోని హామీల ప్రకారం ఏపీలో ఉన్న స్థానాలను 175 నుంచి 225కి పెంచే విధంగా.. అలాగే తెలంగాణలో ఉన్న 119 అసెంబ్లీ సీట్లను 153 పెంచే ప్రక్రియకు కేంద్రం శ్రీకారం చుట్టినట్లు సమాచారం. ఈ మేరకు నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణపై పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టేందుకు అనువుగా అడ్మినిస్ట్రేటివ్ రిపోర్ట్ పంపాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను కేంద్ర న్యాయ శాఖ కోరినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వీలైనంత త్వరగా రిపోర్ట్ వెళ్తే.. వర్షాకాల సమావేశాల్లోనే బిల్లు పార్లమెంట్ ముందుకు వచ్చే అవకాశముంది. ఐతే, దీనిపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఇంతవరకు స్పందించలేదు. ఇదే అంశంపై మరోసారి కేంద్రం పూర్తి క్లారిటీ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన 2031 తర్వాతే ఉంటుందని స్పష్టం చేసింది. అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుపై టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి గతేడాది ఆగస్టులో జరిగిన సమావేశాల సందర్భంగా లోక్‌సభలో ప్రశ్నించారు. ఏపీ విభజన చట్టం ప్రకారం తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 119 నియోజకవర్గాలను 153 నియోజకవర్గాలుగా పెంచాల్సిన అవసరం ఉందన్నారు.

Monday, 27 June 2022

సూపర్ లగ్జరీ బస్సులో మంటలు..

 సూపర్ లగ్జరీ బస్సులో మంటలు..



తెలంగాణ:

తెలంగాణ ఆర్టీసీ బస్సు మంటల్లో దగ్ధమైంది. డ్రైవర్‌ అప్రమత్తతో 16 మంది ప్రాణాలను కాపాడాడు. స్థానికుల కథనం మేరకు.. బెంగళూరు - హైదరాబాద్‌ జాతీయ రహదారిపై దగ్ధమైన హైదరాబాద్‌ -1 డిపోకు చెందిన టీఎస్‌ఆర్టీసీ లగ్జరీ బస్సు మంటల్లో కాలిపోయింది. కర్నూలు నుంచి హైదరాబాద్‌ బయలుదేరిన లగ్జరీ బస్సు మహబూబ్‌ నగర్‌ జిల్లా జడ్చర్ల మండలం దివిటిపల్లి వద్దకు రాగానే ఒక్కసారిగా అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ క్రమంలో అప్రమత్తమైన డ్రైవర్‌.. బస్సును నిలిపివేసి ప్రయాణికులను కిందకు దింపాడు. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 16 మంది ప‍్రయాణికులకు ముప్పు తప్పింది. అయితే, షార్ట్‌ సర్య్కూట్‌ కారణంగానే మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది. బస్సు అగ్ని ప‍్రమాదానికి గురైన విషయం తెలుసుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునే లోపే మంటల్లో బస్సు పూర్తిగా కాలిపోయింది.

Sunday, 26 June 2022

ఇంటర్ ఫలితాలపై స్పష్టత..

 ఇంటర్ ఫలితాలపై స్పష్టత..



తెలంగాణ:

తెలంగాణ ఇంటర్‌ ఫలితాలపై ఇంటర్‌ బోర్డ్‌ ఆదివారం (ఈరోజు) స్పష్టతనిచ్చింది. ఎల్లుండి మంగళవారం ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల కానున్నాయి. ఇంటర్ ఫస్టియర్‌, సెకండియర్‌ ఫలితాలు ఒకేసారి విడుదల చేయనున్నట్లు ఇంటర్‌బోర్డు ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. కాగా, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా ఫలితాలను విడుదల చేస్తారని పేర్కొంది.

Saturday, 25 June 2022

ఐటీ జాబ్ వ‌దిలి.. వ్య‌వ‌సాయం చేస్తూ..!

 ఐటీ జాబ్ వ‌దిలి.. వ్య‌వ‌సాయం చేస్తూ..!



తెలంగాణ:

వ్యవసాయంపై ఉన్న మక్కువతో తనకు వచ్చే ఐదెంకల జీతాన్ని తృణపాయం వదులుకుంది తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సాయి చిన్మయి. నిత్యం ల్యాప్ టాప్ పై నర్తించిన ఆమె చేతి వేళ్ళకు కలుపు మొక్కలను ఏరే పని చెప్పింది. సేద్యానికి ఆధునికతను జోడించి తన వ్యవసాయ క్షేత్రాన్నే ప్రయోగశాలగా మార్చింది సాయి చిన్మయి. వివరాల్లోకి వెళితే.. అదిలాబాద్ జిల్లా ఇచ్చోడకు చెందిన ఏనుగు మోహన్ రెడ్డి, సుజాత దంపతుల కూతురు సాయి చిన్మయి. ఇంజనీరింగ్ చదివిన సాయి చిన్మయికి చిన్నప్పటి నుంచి వ్యవసాయానికి సంబంధించిన విషయాలపై ఆసక్తి ఎక్కువ. అయినా, అందరిలా పట్నంలో ఓ కార్పొరేట్ కంపెనీలో సాఫ్ట్ వేర్ గా పనిచేసేది. నగరంలోని యాంత్రిక జీవితం తనకు నచ్చలేదు. ఎప్పుడు ఊరిపైనే ధ్యాసంత. కరోనా నేపథ్యంలో పని చేస్తున్న సంస్థ వర్క్ ఫ్రం హోం ఇవ్వడంతో ఇంటి బాట పట్టింది. సేద్యం మీద మక్కువతో తమ ఊరి శివారులోని వ్యవసాయ కేత్రంలో సాగు పనులను చూసుకుంటున్న తల్లిదండ్రులకు అండగా ఉండాలని భావించింది. మొదట్లో ఆమె అభిప్రాయాన్ని వ్యతిరేకించిన తల్లిదండ్రులు తనని అర్థం చేసుకుని ప్రోత్సహించారు. వారి సపోర్టుతో వ్యవసాయంలోకి దిగిన చిన్మయి, సేద్యానికి ఆధునికతను జోడించి తమ వ్యవసాయ క్షేత్రాన్నే ప్రయోగశాలగా మార్చింది. చిన్మయి మార్కెట్ ను అధ్యయనం చేసి, అన్ని కాలాల్లో గిరాకీ ఉండే పంటలను పండిస్తోంది. మామిటి తోటలో చెట్ల మధ్యలో ఉండే ఖాళీ స్థలంలో పలు రకాల ఇతర పండ్లు, పూల మొక్కలను సాగు చేస్తోంది. పంటలకు సేంద్రియ ఎరువుగా ఉపయోగిస్తుంది. 



మరొక వైపు కోళ్ళు, కుందేళ్ళు, బాతుల వంటి వాటి పెంపకం కూడా చేపట్టింది. రానున్న రోజుల్లో మరికొన్ని ఇతర పెంపుడు జీవాలను పోషించాలనేది ఆమె ఆకాంక్ష అంటా. వ్యసాయం అంటే చిన్న చూపు చూసి, సాఫ్ట్ వేర్ అంటే గొప్పలాగా భావిస్తున్న యువత ఉన్న ఈ కాలంలో పట్టణం నుంచి పల్లెకు వచ్చి తన వినూ త్న సేద్యంతో అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ యువ మహిళ రైతు.

Friday, 24 June 2022

తిలాపాపం.. తలా పిడికెడు..!

 తిలాపాపం.. తలా పిడికెడు..!



తీర్మానం లేకుండానే నిధుల స్వాహా..

అన్నీ పనుల్లోనూ బోగస్ బిల్లులే..

బలిపశువులవుతున్న పంచాయతీ కార్యదర్శులు..



తెలంగాణ:

తిలాపాపం.. తలా పిడికెడు.. అన్న చందంగా తయారైంది తెలంగాణ గ్రామ పంచాయతీల పరిస్థితి. నూతన పంచాయతీ రాజ్ చట్టం-2018 కి అనుగుణంగా ప్రభుత్వం నెల నెలా జిపిలకు నిధులు మంజూరు చేస్తుంది. కానీ, ఆ నిధుల్లో కొందరు సర్పంచ్ లు చేతివాటం ప్రదర్శిస్తూ, నిధులు స్వాహా చేస్తున్నారు. ఆడిట్​ సమయంలో జీపీల వారీగా రూ.20 వేల నుంచి రూ.లక్ష చొప్పున వసూలు చేస్తున్నారనే దండిగా ఆరోపణలు వస్తున్నాయి. పంచాయతీ పాలకవర్గం అనుమతి, ఆమోదం లేకుండా చిల్లిగవ్వ ఖర్చు పెట్టడానికి వీల్లేకపోవడంతో కొందరు సర్పంచులు తమ దోపిడీకి ప్రధానంగా త్రాగు నీరు, పారిశుధ్యం, వీధి లైట్లు తదితర వాటిని ఆయుధంగా మలుచుకున్నారు. బహిరంగ మార్కెట్లో బ్రాండెడ్ కంపెనీ ఎల్ఈడీ బల్బులు, ప్యానల్ వీధిలైట్లు కొంటే వాటికి ఏడాది కాలం పాటు వారంటీ, గ్యారంటీ ఉంటుంది. ఆ లోగా కాలిపోతే సదరు దుకాణాదారుడే వాటిని మార్చి కొత్తవి ఉచితంగా ఇస్తారు. పంచాయతీ పరిధిలో నైనా విద్యుత్ స్తంభాల సంఖ్య వెయ్యి లోపే ఉంది. అయితే కొందరు సర్పంచ్​లు కరెంటు బల్బుల కొనుగోలు పేరిట బోగస్ బిల్లులను సమర్పించి ప్రతి నెలా రూ.లక్షల్లో నిధులను కాజేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. జీపీ నిధుల ఖర్చులో సుమారు 40 శాతం మేరకు కరెంటు బల్బుల కొనుగోలు బిల్లులే ఉంటున్నాయని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఓ గ్రామ ఉప సర్పంచ్ వాపోయారు. ఇక రూ.5 వేల లోపు కూలీలతో శానిటేషన్, తాగునీటి పైప్ లైన్ లీకేజీల మరమ్మతు పనులు చేయించవచ్చు. అయితే ఓచర్లు, మస్టర్ల ద్వారా కూలీలకు చెల్లింపులు జరిపే ముందు వాటిపై సంబంధిత ఇంజినీర్ల ధ్రువీకరణ అవసరం. అవేవీ లేకుండా సర్పంచ్​లు విచ్ఛలవిడిగా దోపిడీకి పాల్పడుతున్నారనే విమర్శలూ ఉన్నాయి. నిధులు డ్రాచేసే అధికారం సర్పంచ్, ఉప సర్పంచ్‌లకే ఉన్నాయి. పంచాయతీ కార్యదర్శి బాధ్యతలు నామమాత్రమే. చెక్కుల జారీ సమయంలో తమ సెల్ ఫోన్ కు వచ్చే ఓటీపీ చెప్పడమే వారి బాధ్యత అయ్యిందని ఓ గ్రామానికి చెందిన పంచాయతీ కార్యదర్శి వాపోయింది. సర్పంచ్, ఉప సర్పంచ్ ల నిధుల స్వాహాను అరికట్టలేని చోట ఉన్నతాధికా రుల విచారణలో సెక్రటరీలు కూడా బలిపశువులుగా మారుతున్నారు. గల్లీల్లో అభివృద్ధి పనులు చేసుకునే వార్డు సభ్యులను సైతం వదలని సర్పంచ్​లు వారి నుంచి 10 నుండి 20 శాతం వరకు పర్సంటేజీలను ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారు.  పలు జీపీల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్న ఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి.

Thursday, 23 June 2022

బాలుడిని కాటేసి..ఆపై చనిపోయి..

 బాలుడిని కాటేసి..ఆపై చనిపోయి..



సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ న్యూస్..

చిన్న పిల్లాడిని కాటేసిన పాము అక్కడే చనిపోయింది..

బీహార్ లో ఘటన..

షాక్ లో కుటుంబసభ్యులు..


వెంకటేశ్వర్లపల్లి/ తెలంగాణ:


 ఓ బాలుడిని కాటు వేసిన పాము అక్కడికక్కడే చనిపోవడం స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. ఈ షాకింగ్‌ ఘటన మన దగ్గర కాదు. బీహార్‌ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మధోపుర్​ గ్రామానికి చెందిన రోహిత్​ కుశ్వాలాకు అనూజ్​ కుమార్ అనే కొడుకు​ ఉన్నాడు. కాగా, అనూజ్​ తన తల్లితో సహా కుచాయ్​కోట్‌లో ఉన్న అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటున్నారు. రోజులాగే అనూజ్‌ ఇంటి ముందు ఆడుకుంటుడగా.., ఓ పామును బాలుడిని కాటు వేసింది. దీంతో, అనూజ్‌ ఏడ్చుకుంటూ వెళ్లి పాము కాటు వేసిందని తల్లికి చెప్పాడు. దీంతో, కుటుంబ సభ్యులు.. అనూజ్‌ను వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లారు. బాలుడిని పరీక్షించిన వైద్యులు అనూజ్‌ ఆరోగ్యంగానే ఉన్నట్టు నిర్ధారించారు. ఇదిలా ఉండగా, బాలుడిని కాటు వేసిన కొద్దిసేపటికే  పాము చనిపోయింది. దీంతో, కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు షాక్ కు గురయ్యారు. అనంతరం, ఆ పామును ఓ డబ్బాలో వేసి స్థానికులు కొందరు అధికారులకు అందజేశారు. ఇక, పాము కాటు వేసినా బాలుడి బ్రతికే ఉండటంతో అతడిని చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తరలివస్తున్నారు. ఈ విషయం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో భీభత్సంగా తిరుగుతోంది.

Wednesday, 22 June 2022

ఇంటర్ ఫలితాలు విడుదల..

 ఇంటర్ ఫలితాలు విడుదల..



ఈసారి బాలికలదే పైచేయి..

ఫస్టియర్ లో 54, సెకండియర్ లో 61శాతం ఉత్తీర్ణత నమోదు..


వెంకటేశ్వర్లపల్లి/ తెలంగాణ:


ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇంటర్మీడియట్‌ పరీక్ష -2022 ఫ‌లితాలు ఈరోజు విజ‌య‌వాడ‌లో విద్యాశాఖ మంత్రి బొత్స‌ స‌త్య‌నారాయ‌ణ ఏపీ ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌ ఫలితాలను విడుద‌ల‌ చేశారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు.

ఫస్టియర్‌లో 2,41,591 మంది విద్యార్థులు ఉత్తీర్ణత పొందారు. మొదటి సంవత్సరంలో 54 శాతం ఉత్తీర్ణత నమోదయింది. రెండో సంవత్సరంలో 2,58,449 మంది పాస్ కాగా, 61 ఉత్తీర్ణత శాతం రికార్డు అయ్యింది.  ఇంటర్‌ ఫస్ట్‌, సెకండ్‌ ఇయర్‌ ఫలితాల్లో బాలికలదే పైచేయిగా ఉంది ఈసారి.

ఉత్తీర్ణతలో కృష్ణా జిల్లా టాప్‌గా నిలిచిందని, రీకౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌ కోసం జూన్‌ 25వ తేదీ నుంచి జులై 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.

రికార్డు స్థాయిలో 28 రోజుల్లోనే ఫలితాలు విడుదల చేయడం గమనార్హం. మొత్తం 10.01 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా.., జవాబు పత్రాల మూల్యాంకనాన్ని వేగంగా చేశారు.

Tuesday, 21 June 2022

మళ్లీ పుంజుకుంటున్న కరోనా..!

 మళ్లీ పుంజుకుంటున్న కరోనా..!




భౌతిక దూరం పాటిస్తూ, మాస్క్ ధరించాలంటున్న ప్రభుత్వం..


వెంకటేశ్వర్ల పల్లి/ తెలంగాణ:


తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ కరోనా కోరలు చాస్తుంది. రోజువారీ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. గత కొన్నిరోజులుగా 300 లోపే నమోదవుతున్న కరోనా కేసులు, తాజాగా 400 దాటాయి. గడిచిన 24 గంటల్లో 26,704 కరోనా పరీక్షలు నిర్వహించగా, 403 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఒక్క హైదరాబాదులోనే 240 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 103, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 11 కేసులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 9 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 145 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో మరణాలేవీ సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటివరకు 7,96,704 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 7,90,218 మంది కోలుకున్నారు. ఇంకా 2,375 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా కరోనాతో 4,111 మంది మరణించారు.

Monday, 20 June 2022

కాల్పుల ఘటనపై మావోయిస్టుల లేఖ విడుదల..

 కాల్పుల ఘటనపై మావోయిస్టుల లేఖ విడుదల..




- అగ్ని పద్ ను రద్దు చేయాలని డిమాండ్..

- కాల్పులు జరిపిన పోలీసులపై హత్యానేరం కింద కేసులు చేయాలి..



వెంకటేశ్వర్ల పల్లి/ తెలంగాణ:

కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌కటించిన అగ్నిప‌థ్ ప‌థ‌కాన్ని నిర‌సిస్తూ జ‌రిగిన ఆందోళ‌న‌ల్లో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్‌లో చోటుచేసుకున్న కాల్పుల ఘ‌ట‌న‌పై మావోయిస్టులు స్పందించారు. కాల్పుల ఘ‌ట‌న‌ను ఖండిస్తూ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర క‌మిటీ కార్య‌ద‌ర్శి జ‌గ‌న్ పేరిట మావోయిస్టులు సోమ‌వారం ఓ లేఖ‌ను విడుద‌ల చేశారు. ఈ లేఖ‌లో ప‌లు కీల‌క అంశాల‌ను ప్రస్తావించిన మావోయిస్టులు... ప్ర‌భుత్వ శాఖ‌ల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భ‌ర్తీకి త‌క్ష‌ణ‌మే నోటిఫికేష‌న్ ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు.


అగ్నిప‌థ్ ప‌థ‌కాన్ని త‌క్ష‌ణ‌మే ర‌ద్దు చేయాల‌ని కూడా మావోయిస్టులు ఆ లేఖ‌లో డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ కాల్పుల్లో చ‌నిపోయిన రాకేశ్ కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించాల‌ని, బాధితుడి కుటుంబంలో ఒక‌రికి ప్ర‌భుత్వ ఉద్యోగం ఇవ్వాల‌ని కోరారు. అంతేకాకుండా కాల్పులు జ‌రిపిన పోలీసుల‌పై హ‌త్యా నేరం కింద కేసులు న‌మోదు చేయాల‌ని మావోయిస్టులు డిమాండ్ చేశారు.

Saturday, 18 June 2022

ఆ రాష్ట్రాన్ని వణికిస్తున్న టొమాటో ఫీవర్..!

 ఆ రాష్ట్రాన్ని వణికిస్తున్న టొమాటో ఫీవర్..!



వెంకటేశ్వర్లపల్లి/ తెలంగాణ:

ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో ఉన్న చిన్న పిల్లలను టొమాటో ఫీవర్‌ వణికిస్తోంది. నిజానికి పిల్లలకు ఏదైనా చిన్న సమస్య వస్తేనే తల్లిదండ్రులు తల్లడిల్లిపోతుంటారు. అలాంటిది ఐదేళ్లలోపు చిన్నారులకే ఎక్కువగా వచ్చే ఈ జ్వరంతో మరింతగా ఆందోళన పడుతున్నారు. నాలుగైదు వారాలుగా వ్యాధి విస్తృతంగా ఉన్న కేరళతో పాటు తమిళనాడు, కర్ణాటకలను బెంబేలెత్తిస్తుంది.

కొద్దిగా ఆసక్తికరమైన పేరుతో ఉన్న ఈ జ్వరం డెంగీ లేదా చికెన్‌ గున్యా తరహాకు చెందినదా? లేక ఇతరత్రా మరేదైనా గ్రూపునకు చెందిన వైరస్‌నా అన్న విషయం ఇంకా నిర్ధారణగా తెలియదు. అయితే, ఇది రెస్పిరేటరీ సిన్సీషియల్‌ వైరస్సా లేక అడినో వైరస్సా అనే అంశంపై నిపుణుల్లో ఇంకా చాలా సందేహాలే ఉన్నాయి. ఈ విషయమై వైరాలజీ, వైద్యవర్గాలు ఇంకా పరిశోధనలు కొనసాగిస్తున్నాయి.

Friday, 17 June 2022

డాక్టరేట్ పట్టా అందుకున్న సీఎం మాజీ పిఆర్వో..

డాక్టరేట్ పట్టా అందుకున్న సీఎం మాజీ పిఆర్వో..
     


                                               
వెంకటేశ్వర్లపల్లి/ తెలంగాణ:

తెలంగాణ సీఎం కేసిఆర్ మాజీ పీఆర్వో, జర్నలిస్టు, రచయిత గటిక విజయ్ కుమార్ కు హైదరాబాద్ లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. తెలుగు విశ్వ విద్యాలయం, జానపద గిరిజన విజ్ఞాన పీఠం ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమంలో జానపద కళల వినియోగం – అధ్యయనం అనే అంశంపై విజయ్ కుమార్ పరిశోధన చేసి, సిద్ధాంత గ్రంథాన్ని సమర్పించారు. నిపుణుల కమిటీ ఈ గ్రంథాన్ని పరిశీలించి డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ ని అవార్డుకు సిఫారసు చేసింది. హైదరాబాద్ లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రాంగణంలో శుక్రవారం(ఈరోజు) జరిగిన కార్యక్రమంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ తంగెడ కిషన్ రావు అవార్డుకు సంబంధించిన నోటిఫికేషన్ ను విజయ్ కుమార్ కు అందించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ భట్టు రమేశ్, ఎగ్జామినేషన్ కంట్రోలర్ మురళి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ జిల్లా నెక్కొండ మండలానికి చెందిన విజయ్ కుమార్ ఏడేళ్ల పాటు తెలంగాణ సీఎం దగ్గర పిఆర్వో గా పనిచేశారు. వివిధ దినపత్రికలు, న్యూస్ ఛానళ్లలో దాదాపు 25 ఏళ్లు జర్నలిస్టుగా పనిచేశారు.

Thursday, 16 June 2022

రూ.500 విత్ డ్రా చేస్తే రూ.2,500..!

 రూ.500 విత్ డ్రా చేస్తే రూ.2,500..!




రెండో సారి విత్ డ్రా చేస్తే మళ్లీ రూ.2,500..

విషయం తెలుసుకుని ఆ ఏటీఎమ్ కు జనాలు క్యూ..

పోలీసుల రాకతో ఏటీఎమ్ క్లోజ్..


వెంకటేశ్వర్లపల్లి/ తెలంగాణ:


ఓ వ్య‌క్తి డబ్బులు డ్రా చేసుకునేందుకు దగ్గరలోని ఏటీఎంకు వెళ్లాడు. కానీ, ఆయ‌న కోరుకున్న న‌గ‌దు కంటే ఐదు రెట్లు అధికంగా న‌గ‌దు విత్ డ్రా అయింది. దీంతో, ఆశ్చ‌ర్య‌పోయిన స‌ద‌రు వ్య‌క్తి మ‌ళ్లీ అదే ప్ర‌య‌త్నం చేశాడు. మ‌ళ్లీ ఐదు రెట్లు అధికంగా న‌గ‌దు వ‌చ్చింది. ఈ విష‌యం చుట్టు ప్రక్కల జ‌నాల‌కు దవణంలా విస్తరించడంతో, ఆ ఏటీఎం వ‌ద్ద న‌గ‌దు విత్ డ్రా చేసుకునేందుకు జనాలు పెద్దఎత్తున చేరుకున్నారు.

మ‌హారాష్ట్ర లోని  నాగ్‌పూర్ జిల్లాలోని ఖ‌ప‌ర్‌ఖేడా ప‌ట్ట‌ణంలోని ఓ ఏటీఎం వ‌ద్ద‌కు న‌గ‌దు విత్ డ్రా చేసుకునేందుకు ఓ వ్య‌క్తి వెళ్లాడు. అత‌నికి రూ. 500 అవ‌స‌రం ఉండ‌టంతో.. అంతే న‌గ‌దు తీసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. కానీ రూ. 500ల‌కు బ‌దులుగా రూ. 2,500 వ‌చ్చాయి. మ‌ళ్లీ రూ. 500 విత్ డ్రా చేశాడు. మ‌ళ్లీ రూ.2,500 వ‌చ్చాయి. ఈ విష‌యాన్ని ఆ వ్య‌క్తి అక్క‌డున్న వారికి చెప్ప‌డంతో క్ష‌ణాల్లోనే వంద‌ల మంది ఏటీఎం వ‌ద్ద గుమిగూడారు. న‌గ‌దు విత్ డ్రా చేసుకునేందుకు బారులు తీరారు. విష‌యం పోలీసుల‌కు చేర‌డంతో హుటాహుటిన ఆ ఏటీఎం వ‌ద్ద‌కు చేరుకున్నారు. ఏటీఎంను మూసివేయించారు. బ్యాంకు అధికారుల‌కు స‌మాచారం అందించారు పోలీసులు. సాంకేతిక స‌మ‌స్య‌ల కార‌ణంగానే విత్ డ్రా చేసిన న‌గ‌దు కంటే ఎక్కువ‌గా వ‌స్తుంద‌ని బ్యాంకు అధికారులు వెల్ల‌డించారు.

ఖాళీ సీసాల ఆదాయమెంత..?

 ఖాళీ సీసాల ఆదాయమెంత..?




గ్రామాల వారీగా ఎన్ని ఖాళీ బీరు సీసాలు సేకరించారు?

తద్వారా గ్రామ పంచాయతీకి ఎంతొచ్చింది..

ఆ డబ్బు ఎక్కడ ఖర్చు చేశారు..

ఆర్టీఐ ద్వారా వివరాలు కోరిన ఓ యువకుడు..


వెంకటేశ్వర్ల పల్లి/ తెలంగాణ:


 మీరు వినడానికి కాస్త విచిత్రంగా అనిపించినా, ఇది నిజమే. ఖాళీ బీరు సీసాలను సేకరించి, అట్టి బీరు సీసాలను అమ్మకం చేస్తే గ్రామ పంచాయతీకి ఎంత ఆదాయం సమకూరిందని ఓ యువకుడు సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు అడిగాడు.


ఇక వివరాల్లోకెళితే.. హన్మకొండ జిల్లా శాయం పేట మండలానికి చెందిన ఓ ఆర్టీఐ కార్యకర్త మండలం లోని అన్ని గ్రామాల్లో ఖాళీ బీరు సీసాల అమ్మకం ద్వారా గ్రామ పంచాయతీకి 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఎంత ఆదాయం సమకూరిందని అట్టి వివ‌రాలు తెలుపాలని ఎంపీడీవో కార్యాల‌య అధికారికి దరఖాస్తు పెట్టుకున్నాడు. మ‌ద్యం అమ్మకాల్లో తెలంగాణ టాప్‌లో ఉన్నట్లుగా ఇప్పటికే అబ్కారీ లెక్కలు తెలియ‌జేస్తున్నాయి. శ్రేయ‌స్కర‌మైన మ‌ద్యాన్ని అందించ‌డ‌మే ల‌క్ష్యంగా అబ్కారీ చ‌ర్యలున్నట్లుగా ప్రభుత్వం కూడా స‌మ‌ర్థించుకుంటున్న విష‌యం తెలిసిందే. ఈ విష‌యం అలా ఉంచితే.. బ‌హిరంగ ప్రదేశాల్లో, ఇంటింటి నుంచి మ‌ద్యం సీసాల‌ను సేక‌రించ త‌ల‌పెట్టిన కార్యక్రమం పై విమ‌ర్శలు, గొప్ప కార్యక్రమం అన్న భిన్న చ‌ర్చ జ‌రుగుతుండ‌గా తాజాగా ఆర్టీఐ ద‌ర‌ఖాస్తుపై నెట్టింట్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది. 2021-22 సంవ‌త్సరంలో శాయంపేట మండ‌లంలోని అన్ని గ్రామ పంచాయ‌తీల ప‌రిధిలో ఏఏ గ్రామంలో ఎన్ని సీసాల‌ను సేక‌రించారు? సీసాల‌ను ఎంత ధ‌ర‌కు అమ్మారు? అమ్మిన సీసాల ద్వారా ఎంత డ‌బ్బు పంచాయ‌తీలకు స‌మ‌కూరింది? ఏ పంచాయ‌తీకి ఎంత వ‌చ్చింది? సీసాల సేక‌ర‌ణ‌కు ఏ స్థాయి అధికార‌, సిబ్బందిని వినియోగించారో తెలపాలన్నాడు.

Wednesday, 15 June 2022

విస్తరిస్తున్న బుతుపవనాలు..

 విస్తరిస్తున్న బుతుపవనాలు..




క్రమంగా తగ్గుతున్న టెంపరేచర్..

భారీ వర్షాలు కురిసే ఛాన్స్..

అప్రమత్తంగా ఉండాలని సూచన..


వెంకటేశ్వర్లపల్లి/ తెలంగాణ:


తెలంగాణ రాష్ట్రంలోకి రెండ్రోజుల క్రితమే ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు ఈరోజు, రేపు మరిన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయి. ఇందుకు అనుకూలమైన వాతావరణం  ఏర్పడిందని సంబంధిత అధికారులు తెలిపారు. రుతుపవనాలు మరింతగా విస్తరించనున్న క్రమంలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అనేక ప్రాంతాల్లో మోస్తరునుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. మేడ్చల్ జిల్లా కీసర మండలం దమ్మాయిగూడలో అత్యధికంగా 9.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, అత్యల్పంగా సింగపూర్ టౌన్‌షిప్ వద్ద 5.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మరోవైపు, వర్షాలు లేని ప్రాంతాల్లో మాత్రం ఎండ, ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

జులై మూడో వారం నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు..

 జులై మూడో వారం నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు..




వెంకటేశ్వర్లపల్లి/ తెలంగాణ:


పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. అధికారికంగా ప్రకటించకపోయినా జులై మూడో వారం నుంచి సభ కొలువు దీరనున్నట్లు సమాచారం. జులై మూడోవారం నుంచి  ఆగస్టు రెండో వారం వరకు ఉభయసభలను సమావేశపర్చనున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాష్ట్రపతి ఎన్నిక జరగనున్న జులై 18న వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 12 వరకు సభ కొనసాగించాలని పార్లమెంటరీ అఫైర్స్ కేబినెట్ కమిటీ నిర్ణయించినట్లు సమాచారం. సభ నిర్వాహణకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.  మాన్ సూన్ సెషన్ లో ఉభయ సభలు 17 రోజుల పాటు కొనసాగనున్నట్లు తెలుస్తోంది. బడ్జెట్ సెషన్ లో పార్లమెంటరీ కమిటీ స్క్రూటినీకి పంపిన నాలుగు బిల్లులతో పాటు పలు బిల్లులు ఈసారి సభ ముందుకు రానున్నాయి.

Monday, 13 June 2022

ఇష్టారాజ్యంగా పీ హెచ్ డీ అడ్మిషన్లు..

 ఇష్టారాజ్యంగా పీ హెచ్ డీ అడ్మిషన్లు..




నిబందనలకు విరుద్దంగా పీ హెచ్ డీ సీట్ల కేటాయింపులు..

తమకు అనుకూల అభ్యర్థులకు అనుగుణంగా నియమాలు మార్పు..

పాలకమండలి ఆమోదం లేకుండా పీ ఎచ్ డీ నియమాలు మార్చిన కేయూ వైస్ చాన్స్ లర్..

 

వెంకటేశ్వర్లపల్లి/ తెలంగాణ:


వరంగల్ లోని కాకతీయ విశ్వవిద్యాలయంలో మొదటి కేటగిరికి చెందిన పీ హెచ్ డీ అడ్మిషన్లు నిబంధనలకు విరుద్దంగా జరుగుతున్నాయని విద్యార్ధి సంఘాలు ఆరోపణలు చేస్తున్నా, అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత డిసెంబర్ 20న మొదటి కేటగిరీ లో పీ ఎచ్ డీ అడ్మిషన్లకు కాకతీయ విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ ను జారీచేసింది. పరిశోదనా ఫెల్లోషిప్ లు కలిగిన వారు మరియు ఎం ఫిల్ రెగ్యులర్ విధానంలో పూర్తిచేసిన వారు ఈ నోటిఫికేషన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. యూజీసి రెగ్యులేషన్స్-2016 ప్రకారం ఈ పీ ఎచ్ డీ మొదటి కేటగిరీ నియమ నిబందనలు అమలు అవుతాయని కూడా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఆ తర్వాత నిబందనలను సవరిస్తూ మళ్ళీ గత యేడాది డిసెంబర్ 28 న మరొక నోటిఫికేషన్ ను కాకతీయ యూనివర్సిటీ సైన్స్ డీన్ విడుదల చేశారు.


యూ జీ సి నిబందనల ప్రకారం మొదటి కేటగిరీ పీ ఎచ్ డీ అడ్మిషన్లకు కేవలం ఫుల్ టైం రిసెర్చి స్కాలర్స్ మాత్రమె అర్హులు. పార్ట్-టైం రిసెర్చి స్కాలర్స్ మొదటి కేటగిరీ పీ ఎచ్ డీ అడ్మిషన్ పొందేందుకు అర్హులు కారు అని స్పష్టంగా పేర్కొన్నారు. యూ జీ సి నియమ నిబంధనలను అనుసరించాలంటే ఆ యా విశ్వవిద్యాలయాలు వర్సిటీ పాలక మండలి మరియు అకాడమిక్ సెనేట్ యొక్క స్టాండింగ్ కమిటీ ఆమోదం పొందవలసి వుంటుంది. కాని ఆమోదం పొందినటువంటి నియమ నిబందనలను కాకతీయ వర్సిటీలో అధికారులు పక్కన పెట్టి తమకు అనుకూల అభ్యర్థులకు పీ ఎచ్ డీ అడ్మిషన్లు ఇచ్చేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. ఇందుకు గాను అకాడెమిక్ సెనేట్ యొక్క స్టాండింగ్ కమిటీ ఆమోదం పొందిన పీ ఎచ్ డీ అడ్మిషన్ నిబందనలను సవరిస్తూ మే నెల 28 న డీన్స్ కమిటీ తో సిఫారసు చేయించి అదే రోజు కె యూ రిజిస్ట్రార్ ఉత్తర్వులు (No.699/B3/KU/2022, 28-05-2022) జారీ చేశారు.  25 శాతం సీట్లను ప్రభుత్వ డిగ్రీ, పీ.జీ కళాశాలల్లో పనిచేసే వారు నో ఆబ్జేక్షన్ సర్టిఫికేట్ ద్వారా పార్ట్-టైం పీ ఎచ్ డీ కింద మొదటి కేటగిరీ పీ ఎచ్ డీ లో అడ్మిషన్ పొందవచ్చని సవరించిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వర్సిటీ పాలకమండలి మరియు అకాడెమిక్ సెనేట్ యొక్క స్టాండింగ్ కమిటీ ఆమోదం లేకుండా ఇష్టారాజ్యంగా నిబందనలు మారుస్తూ మొదటి కేటగిరీ పీ ఎచ్ డీ అడ్మిషన్లు చేస్తున్నారని విద్యార్ధి సంఘాలు విమర్శిస్తున్నాయి. రెండవ కేటగిరీ పీ ఎచ్ డీ అడ్మిషన్ నోటిఫికేషన్ లో పార్ట్-టైం అడ్మిషన్ పొందే అవకాశం ఉన్నప్పటికీ, కేవలం రిసెర్చ్ ఫేల్లోషిప్ పొందిన వారికి ఇచ్చే మొదటి కేటగిరీ పీ ఎచ్ డీ అడ్మిషన్లలో పార్ట్ టైం అడ్మిషన్లు ఇవ్వడంతో పూర్తీ స్తాయి పీ ఎచ్ డీ చేయాలనుకునే వారికి నష్టం కలుగుతుందని విద్యార్థులు వాపోతున్నారు.

ఇప్పటికే దాదాపు అన్ని విభాగాల్లో ఇంటర్వ్యూలు నిర్వహించారు. పార్ట్-టైం వారికి కూడా అడ్మిషన్లు ఇచ్చారని ఫిర్యాదులు రావడంతో వెంటనే వారికి అనుకూలంగా నిబందనలను సవరిస్తూ పాలక మండలి, అకేడిమిక్ సెనేట్ ఆమోదం లేకుండానే గతంలో ఆమోదం పొందిన నిబందనలను మారుస్తూ ఉత్తర్వులు తీయడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.

ఆయన ఎవరి పేరు చెపితే వారికే టిక్కెట్టంట..!?

 ఆయన ఎవరి పేరు చెపితే వారికే టిక్కెట్టంట..!?




గెలుపు గుర్రాలకే ఈసారి అవకాశం..

పికె టీమ్ సర్వే రిపోర్టే కీలకం..

వెంకటేశ్వర్లపల్లి/ తెలంగాణ:

ప్రశాంత్ కిశోర్ @పీకే.. మన దేశంలో ఎంతో పేరుమోసిన ఎన్నికల వ్యూహకర్త ఈయన. ఏదైనా పార్టీ కోసం పనిచేశాడంటే. ఆ పార్టీ ఎన్నికల్లో విజయం సాధించాల్సిందే. గతంలో జరిగిన పలు ఎన్నికలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. ఐతే, ప్రస్తుతం పీకే టీమ్ తెలంగాణలో టీఆర్ఎస్‌తో జత కట్టిన విషయం తెలిసిందే. వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే వ్యూహాలను రూపొందిస్తున్నారు ప్రశాంత్ కిశోర్. అసలు టికెట్లు ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఇవ్వొదన్నది కూడా ప్రశాంత్ కిశోరే డిసైడ్ చేయనున్నారు. ఆయన ఇచ్చే నివేదిక ఆధారంగానే టికెట్ల పంపిణీ ఉంటుందనేది పబ్లిక్ టాక్.

Sunday, 12 June 2022

మధ్యాహ్నం కల్లా నైరుతి..

 మధ్యాహ్నం కల్లా నైరుతి..



వెంకటేశ్వర్లపల్లి/ తెలంగాణ: 


నైరుతి రుతుపవనాలు ఈరోజు మధ్యాహ్నం కల్లా రాష్ట్రాన్ని తాకనున్నాయి. ప్రస్తుతం రాష్ట్రానికి పశ్చిమ దిశ నుంచి వీస్తున్న గాలులు, ఇతర వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో నైరుతి రుతుపవనాలు చురుకుగా వ్యాప్తి చెందే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే రానున్న మూడు, నాలుగు రోజుల్లో రుతుపవనాలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించనున్నాయి. నైరుతి రుతుపవనాలు ఉత్తర అరేబియా సము ద్రంలోని కొన్ని ప్రాంతాలు, కొంకణ్‌లోని మిగి లిన భాగాలు, గుజరాత్‌ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలు, మధ్య మహారాష్ట్రలోని చాలా ప్రాంతాలు, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ ఆంధ్ర పశ్చిమ, మధ్య, వాయవ్య బంగాళా ఖాతం ప్రాంతాల్లో ముందుకు సాగనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Saturday, 11 June 2022

సెలవులు పొడిగిస్తారా! లేదా?

 సెలవులు పొడిగిస్తారా! లేదా?


వెంకటేశ్వర్లపల్లి/ తెలంగాణ:

తెలంగాణ కరోనా పాజిటివ్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. వైద‍్య ఆరోగ్యశాఖ అధికారిక లెక్కల ప్రకారం ఈ ఒక్కరోజే 160 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తోంది. 

నేపథ్యంలో తెలంగాణలో విద్యా సంస్థలు తెరుచుకోవడంతో ప్రభుత్వం తర్జన భర్జనలు పడుతోంది. పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యా సంస్థలు తెరుచుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం నుంచి విద్యాసంస్థలు ఓపెన్‌ కానుండటంతో పాఠశాలలకు సెలవులు పొడిగింపు ఉంటుందా..? అనే చర్చ నడుస్తోంది.

Friday, 10 June 2022

జూ లో వింత జీవి సంచారం..

 జూ లో వింత జీవి సంచారం..



అర్ధరాత్రి రెండు కాళ్ళతో జూ లో నడక..

టెక్సాస్ లోని అమారి జూ లో ఘటన..


వెంకటేశ్వర్లపల్లి/ తెలంగాణ:

మన కంటికి కనిపించని ఎన్నో వింతలు, విశేషాలు దాగి ఉన్నాయి ఈ భూమ్మీద. కొన్ని సందర్భాల్లో భూమి మీద చోటుచేసుకునే వింతలను చూసి నిజమేనా? అని షాక్‌ అవుతుంటాము. తాజాగా, అలాంటి ఘటనే ఒకటి అమెరికాలో వెలుగు చూసింది. టెక్సాస్‌లోని అమారి పట్టణంలో ఓ వింత జీవి ఫొటో అక్కడున్న వారిని కలవారపాటుకు గురిచేస్తోంది. టెక్సాస్‌లోని ఒక జూ రెండుకాళ్లపై ఓ జీవి నిలబడి ఉంది. ఈ క‍్రమంలో జూలో ఉన్న సెక్యూరిటీ కెమెరాలో ఇది రికార్డు అయ్యింది. అయితే, ఆ జీవి జూ అవతల ఫెన్సింగ్‌ దగ్గర ఉన్నట్టు సిబ్బంది గుర్తించారు. ఆ తర్వాత ఈ ఫొటోను సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. దీంతో పరిసర ప్రాంతాల ప్రజలకు భయాందోళనకు 

ఈ ఫొటో సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో నిలవడంతో ఫొటోపై నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. అది నిజంగా వింత జీవేనా? లేక ఎవరైనా మనుషులే అలాంటి గెటప్‌లో వచ్చారా? అని కామెంట్స్‌ చేస్తున్నారు. కానీ, దీన్ని సీరియస్‌గా తీసుకున్నట్టు జూ అధికారులు తెలిపారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్టు వివరణ ఇచ్చారు.

Thursday, 9 June 2022

మందు బాబులకు గుడ్ న్యూస్..

 మందు బాబులకు గుడ్ న్యూస్..



వెంకటేశ్వర్లపల్లి/ తెలంగాణ:


పంజాబ్ ప్రభుత్వం మందు బాబులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. పంజాబ్‌లోని ఆమ్ఆద్మీ  సర్కార్‌ సరికొత్త ఎక్సైజ్ పాలసీని విడుదల చేసింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను పంజాబ్ క్యాబినెట్  ఆమోదించింది. ఇది గత ఆర్థిక సంవత్సరం కంటే 40 శాతం అధికంగా ఆమోదించింది. 

వచ్చే నెల 1వ తేదీ నుంచి ఈ సరికొత్త మద్యం పాలసీ అమల్లోకి రానుంది.  ముఖ్యంగా 35 నుంచి 60 శాతం వరకు ధరలను తగ్గించేలా సరికొత్త మద్యం పాలసీని ప్రకటించింది.

పంజాబ్‌లో ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సారథ్యంలోని ఆప్‌ సర్కార్‌ మద్యం పాలసీని తీసుకురావడమే కాదు, కొన్ని నిర్మాణాత్మక చర్యలను ప్రతిపాదించింది. లాట్ల ద్వారా మద్యం విక్రయాలను కేటాయించే బదులు, టెండర్లను ఆహ్వానించడం ద్వారా వేలం వేయనుంది. అలాగే డిస్టిల్లర్లు, మద్యం పంపిణీదారులు, మద్యం రిటైలర్లు డీలింక్ చేయనుంది.

అంతే కాదు రాష్ట్రంలో కొత్త డిస్టిలరీల ప్రారంభంపై నిషేధాన్ని కూడా ప్రభుత్వం ఎత్తివేసింది. పంజాబ్ మీడియం లిక్కర్ మినహా అన్ని రకాల మద్యంపై ఒక శాతం ఎక్సైజ్ సుంకం వసూలు చేయనుంది. హర్యానా నుంచి రాష్ట్రంలోకి అక్రమంగా రవాణా అవుతున్న మద్యాన్ని అరికట్టడమే దీని లక్ష్యమని పంజాబ్ ప్రభుత్వం చెబుతోంది. కొన్ని బ్రాండ్‌ల ధరలు పొరుగు రాష్ట్రాలతో సమానంగా ఉంటాయి. తాజాగా ప్రకటించిన మద్యం పాలసీ ప్రకారం పంజాబ్‌లో ఐఎంఎఫ్ఎల్ ధర 400 రూపాయలకు తగ్గనున్నది.

Wednesday, 8 June 2022

పల్లె ప్రకృతి వనాలను పట్టించుకోరా!?

 పల్లె ప్రకృతి వనాలను పట్టించుకోరా!?




టార్గెట్ పూర్తయ్యిందని పిపివి కూలీల తొలగింపు..

నీళ్లు లేక ఎండిపోతున్న మొక్కలు..

లక్షలు వెచ్చించి ప్రకృతి వనాల నిర్మాణం..

మొక్కల కొనుగోలు సందర్భంలో అధికారుల చేతివాటం..


వెంకటేశ్వర్లపల్లి/ తెలంగాణ:

ఈజీఎస్ నిధుల నుండి లక్షలు వెచ్చించి ఒక్కో గ్రామంలో ఒక్కో పల్లె ప్రకృతి వనం లను అధికారులు నిర్మించారు. అయితే మొన్నటి వరకు మొక్కల సంరక్షణ బాధ్యతలు గ్రామ పంచాయతీ నిర్వహించింది. ఇప్పుడు టార్గెట్ పూర్తి అయిందన్న సాకుతో వాటి సంరక్షణ బాధ్యతలు గాలికొదిలేశారు. ప్రస్తుతం నీళ్లు పట్టడం లేదు ఆ మొక్కలకు. వెరసి, ఆ మొక్కలు ఎండిపోతున్నాయి. 

కొన్ని గ్రామాల్లో అయితే ఊరికి దూరంగా అటవీ ప్రాంతంలో పల్లె ప్రకృతి వనం లను ఏర్పాటు చేశారని,  మేము ఒక్కసారి కూడా ఆ పార్కుకు వెళ్లలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కుమ్మకై పార్కుల పేరిట ప్రభుత్వ సొమ్మును లక్షలాది రూపాయలను కాజేశారనే విమర్శలూ గ్రామాల్లో వినిపిస్తున్నాయి. ఏదో, తూతూ మంత్రంగా మమా అనిపించేశారు. పల్లె ప్రకృతి వనాల్లో నాటిన మొక్కలను పక్క రాష్ట్రం అయిన ఆంధ్రప్రదేశ్ నుండి కొనుగోలు చేసి తీసుకువచ్చారు. అయితే, అట్టి మొక్కలకు బిల్లులు కూడా సరిగా లేకపోవడం, ఒకవేళ కొన్ని బిల్లులు ఉన్నప్పటికీ, మొక్కల కొనుగోలు ధరల కంటే రెండు మూడింతలు ఎక్కువ ధరలను బిల్లులో చూపించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా, పల్లె ప్రకృతి వనాలకు గ్రామపంచాయతీ నిధుల నుండి 10శాతం నిధులు ఖర్చు చేసుకునే వెసులుబాటు ఉంది. అయితే, ఇదే అదనుగా భావించిన కొన్ని గ్రామాల సర్పంచ్ లు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు కుమ్మక్కై పల్లె ప్రకృతి వనాలను ఖర్చు చేయకుండానే ఖర్చు చేసినట్లు బిల్లుల్లో చూపించి, వారి జేబులు నింపుకున్నట్లు ఇటీవల సమాచార హక్కు చట్టం ద్వారా వెలుగులోకి వచ్చాయి.

ఆయనే న్యూ వ్యూహకర్త..

 ఆయనే న్యూ వ్యూహకర్త..




వైసిపికి పికే ప్లేస్ లో రిషీ..


వెంకటేశ్వర్లపల్లి/ తెలంగాణ:

ఏపీలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఘనవిజయం సాధించింది. ఈ విజయానికి జగన్ పాదయాత్ర ముఖ్యకారణమైతే,  మరోకారణం ప్రశాంత్ కిశోర్ వ్యూహాలు.

ఆంధ్రప్రదేశ్ లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఘనవిజయం సాధించింది. ఈ విజయానికి జగన్ పాదయాత్ర ముఖ్యకారణమైతే, మరోకారణం ప్రశాంత్ కిశోర్  వ్యూహాలు. ఐతే, ఇప్పటికే ప్రశాంత్ కిశోర్ తో తమకు ఎలాంటి లావాదేవీలు లేవని వైసీపీ పెద్దలు స్పష్టం చేసిన నేపథ్యంలో కొత్త వ్యూహకర్త ఎవరనేదానిపై చర్చ జరుగుతోంది. ప్రశాంత్ కిశోర్ స్థాపించిన ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్)ని వరుసగా రెండోసారి కూడా వైసీపీ నియమించుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఐతే ఇక్కడ వ్యూహకర్త మాత్రం మారనున్నారు. ఐప్యాక్ లో పనిచేస్తున్న రిషితో వైసీపీ చేతులు కలపనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఐప్యాక్ వ్యవస్థాపకుడు అయిన ప్రశాంత్ కిషోర్ కు సహోద్యోగి ఐ-ప్యాక్ టీమ్ లీడర్ రిషి రాజ్ సింగ్ పార్టీ నేతలకు జగన్ పరిచయం చేస్తారని సింగ్ సూచించిన వ్యూహాల ప్రకారం ఎలా పని చేయాలో వారికి దిశానిర్దేశం చేస్తారని సమాచారం. వచ్చే ఎన్నికల్లో వరుసగా పార్టీ విజయం కోసం కృషి చేసేందుకు వైఎస్సార్సీపీతో ఐ-పీఏసీ ఇప్పటికే ఒప్పందం చేసుకుంది. మే రెండో వారం నుంచి పార్టీ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే.

ఐప్యాక్ సభ్యుల బృందం తదుపరి ఎన్నికలలో పార్టీ అవకాశాలు పార్టీ అభ్యర్థుల సానుకూల ప్రతికూల అంశాలపై అట్టడుగు స్థాయి నుండి ఇన్పుట్లను సేకరించే పనిని కూడా ప్రారంభించింది. సంక్షేమ పథకాల అమలుపై ప్రజల నుంచి అభిప్రాయాన్ని సేకరించేందుకు బృంద సభ్యులు కార్యాచరణలోకి దిగారు. ఆటుపోట్లను పూర్తిగా వైసీపీకి అనుకూలంగా మార్చడానికి ఖచ్చితంగా ఏమి చేయవచ్చు అనే విషయాలపై ఐప్యాక్ సభ్యులు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు.

ఐప్యాక్ టీమ్ సభ్యుల మరో బృందం కూడా మీడియా నిర్వహణ సమస్యలపై పని చేస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వ మీడియా విభాగాలు సక్రమంగా ప్రసారం చేయగలుగుతున్నాయా అనే అంశంతో పాటు పార్టీకి మీడియాకు మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఏమైనా ఉందా అనే దానిపై ఆరాతీస్తున్నాయి. ప్రస్తుతం ఈ టీమ్ న్యూట్రల్ గా ఉండే మీడియా సంస్థలపై దృష్టిపెట్టింది. అలాగే టీడీపీ అనుకూల మీడియా సంస్థల్లో పనిచేస్తున్న వ్యక్తులను కూడా తమవైపు తిప్పుకునేందుకు ఐ-ప్యాక్ వ్యూహాలు రచిస్తున్నట్లు టాక్.

Tuesday, 7 June 2022

జూబ్లీహిల్స్ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్..

జూబ్లీహిల్స్ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్..

తెలంగాణ పోలీసు శాఖకు నోటీసులు..

 వెంకటేశ్వర్లపల్లి/ తెలంగాణ:

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ ఘటనపై విచారణకు సంబంధించి జాతీయ మహిళా కమిషన్ తెలంగాణ పోలీసు శాఖకు నోటీసులు జారీచేసింది. నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని కోరింది. ఈ విషయంలో తక్షణ చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ తెలంగాణ డీజీపీకి లేఖ రాశారు. మరోవైపు జాతీయ బాలల హక్కు పరిరక్షణ కమిషన్ నుంచి పోలీసు శాఖకు నోటీసులు అందాయి. ఇప్పటికే ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌లకు వివరణాత్మక నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఈ ఘటనపై పోలీసులు తీర్పుపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది. ఈ ఘటననపై జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేయాలని బీజేపీ నిర్ణయించింది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతో పాటు కొంతమంది పోలీసు ఉన్నతాధికారుల వైఖరిని కూడా మహిళా కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తుంది.

అవినీతి పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలి..

 అవినీతి పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలి..





ఒక్కో కల్యాణలక్ష్మీ దరఖాస్తుకు సెక్రటరీ రూ.10వేలు వసూలు చేస్తుంది..

తనను సస్పెండ్ చేయాలని గోరికొత్తపల్లి గ్రామస్తుల డిమాండ్..


వెంకటేశ్వర్లపల్లి/ తెలంగాణ:

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని గోరికొత్తపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి పైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, యువకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పలువురు జానుశ్రీ టైమ్స్ తో మంగళవారం(ఈరోజు) చరవాణిలో మాట్లాడారు. ఈ సందర్భంగా గోరికొత్తపల్లి పంచాయతీ కార్యదర్శి అవినీతికి అడ్డూ అదుపూ లేకుండా పోతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కో కల్యాణ లక్ష్మీ లబ్దిదారుని నుండి రూ.5 - 10వేలు వసూలు చేస్తుందని వాపోయారు. అంతేకాకుండా, గ్రామపంచాయతీ సెక్రటరీ గ్రామానికి సంబంధించిన మరుగుదొడ్ల బిల్లులు సైతం ఫోర్జరీ సంతకాలతో డబ్బులు డ్రా చేసుకుని తన వ్యక్తిగత అవసరాలకు వాడుకుందని పలువురు యువకులు తెలిపారు. అవినీతి అధికారిని సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Monday, 6 June 2022

కట్టుకున్న భార్యను డంబెల్స్ తో కొట్టి చంపిన భర్త..

 కట్టుకున్న భార్యను డంబెల్స్ తో కొట్టి చంపిన భర్త..


హైదరాబాద్ లో దారుణం..


వెంకటేశ్వర్లపల్లి/ తెలంగాణ:

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌ లో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను చంపేశాడు ఓ వ్యక్తి. అంతేకాదు, భార్యను రెండు ముక్కలుగా చేసి వాటర్‌ డ్రమ్ములో దాచిపెట్టి పరారయ్యాడు. అనిల్‌, సరోజలు ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే ఆ తర్వాత ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ తరుణంలో పెద్దలు ఇద్దరి మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు. అయినా కూడా పరిస్థితి మారలేదు.ఈ తరుణంలో సరోజా కొన్ని రోజులు నుండి ఫోన్‌ లిఫ్ట్‌ చేయడం లేదు. మరోవైపు అనిల్‌ కూడా ఫోన్‌ లిఫ్ట్‌ చేయకపోవడంతో సరోజ తండ్రికి అనుమానం వచ్చింది.

రెహమత్‌నగర్‌ సుభాష్‌ నగర్‌లో ఈ జంట ఉంటున్న ఇంటికి వచ్చాడు ఆయన. బయట తాళం వేసి ఉండడంతో మరోసారి అనిల్‌కు కాల్‌ చేశాడు. ఈసారి ఫోన్‌ లిఫ్ట్‌ చేసిన అనిల్‌ పొంతన లేని సమాధానాలు ఇచ్చాడు. అనుమానంతో తాళం పగలగొట్టిన సరోజ తండ్రి లోపల దృశ్యాలు చూసి గుండె పగిలేలా రోదించాడు. చిన్న వాటర్‌ డ్రమ్‌లో సరోజ మృతదేహాం రెండు ముక్కలై పడి ఉంది. డంబెల్‌తో కొట్టి చంపి, ఆపై రెండు ముక్కలుగా చీల్చేసి వాటర్‌ డ్రమ్‌లో కుక్కేశాడు అనిల్‌. సరోజ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అనిల్‌ జాడ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Sunday, 5 June 2022

పది ఫలితాలు రేపే..

 పది ఫలితాలు రేపే..




వెంకటేశ్వర్లపల్లి/ తెలంగాణ:

ఏపీలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలను రేపే విడుద‌ల చేయ‌నున్నారు. ఫ‌లితాల‌ను మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌నున్నారు. విద్యాశాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ఈ ఫలితాల‌ను విడుద‌ల చేయ‌నున్నారు. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ ఒక ప్రకటన విడుదల చేశారు. టెన్త్‌ ఫలితాలు జూన్ 4వ తేదీన ఉదయం 11 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌ విడుదల చేయాల్సి ఉంది. అయితే, కొన్ని అనివార్య కారణాలతో ఈ ఫలితాలను విడుదల చేయలేకపోయినట్లు డైరెక్టర్‌ పేర్కొన్నారు. ఈ సారి మార్కుల రూపంలో ఫలితాలను ప్రకటించ‌నున్నారు. రికార్డు స్థాయిలో త‌క్కువ‌ రోజుల్లోనే విద్యాశాఖ ఈ ఫ‌లితాల‌ను విడుద‌ల చేయ‌నున్నారు. ఏప్రిల్‌ 27న ప్రారంభమైన టెన్త్‌ పరీక్షలు మే 9న పూర్తయ్యాయి. ఈసారి 6,22,537 మంది పదో తరగతి పరీక్షలు రాశారు. ప‌దో త‌ర‌గ‌తి పరీక్ష పత్రాలను సకాలంలో మూల్యాంకనం చేయ‌డం కోసం.. 20 వేల మంది ఉపాధ్యాయులకు విధులను కేటాయించారు. నిబంధనలు ఉల్లంఘించి ప్రకటనలు చేస్తే ఆయా సంస్థల యాజమాన్యాలు, ఇతరులకు మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్షతోపాటు రూ.లక్ష వరకు జరిమానా విధిస్తారని స్పష్టం చేసింది.

Friday, 3 June 2022

మాస్క్ ధరించని వారిపై చర్యలు..

 మాస్క్ ధరించని వారిపై చర్యలు..




వెంకటేశ్వర్లపల్లి/ తెలంగాణ:


కోవిడ్-19 మహమ్మారి తీవ్రత తగ్గలేదని, దీని పట్ల అప్రమత్తత తప్పనిసరి అని ఢిల్లీ హైకోర్టు తెలిపింది. విమానాశ్రయాలు, విమానాల్లో మాస్క్ ధారణ, చేతుల పరిశుభ్రతలకు సంబంధించిన నిబంధనలను కట్టుదిట్టంగా పాటించనివారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. ఈ నిబంధనలను ఉల్లంఘించినవారికి జరిమానాలు విధించాలని, వారిని నో-ఫ్లై లిస్ట్‌లో పెట్టాలని తెలిపింది. కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి నిరోధానికి జారీ చేసిన మార్గదర్శకాలు, నిబంధనలను ఉల్లంఘించేవారిపై కఠినంగా వ్యవహరించాలని చెప్పింది. ఉల్లంఘనదారులకు జరిమానా విధించి, వసూలు చేయాలని, వారు విమానాల్లో ప్రయాణించకుండా చర్యలు తీసుకోవాలని తెలిపింది. ఈ నిబంధనలను ఎంత శ్రద్ధగా రూపొందించారో, అంత శ్రద్ధగా అమలు చేయడం లేదని గుర్తించినట్లు తెలిపింది. తరచూ ఈ నిబంధనల ఉల్లంఘన జరుగుతోందని పేర్కొంది. వీటిని సమగ్రంగా అమలు చేయవలసిన అవసరం తప్పకుండా ఉందని, ఈ బాధ్యత డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) సహా అధికారులందరికీ ఉందని పేర్కొంది. 

ఈ నిబంధనలను అమలు చేసే అధికారాన్ని విమానాశ్రయాలు, విమానాల్లో పని చేసే సిబ్బంది, అధికారులకు కల్పించాలని అన్ని ఎయిర్‌లై్న్స్‌కు డీజీసీఏ ఆదేశాలు ఇవ్వాలని తెలిపింది. మాస్క్ ధారణ, చేతుల పరిశుభ్రత నిబంధనలను ఉల్లంఘించే ప్రయాణికులపై చర్యలు తీసుకునేందుకు  ఎయిర్ హోస్టెస్‌లు, కెప్టెన్లు, పైలట్లు సహా  ఇతర అధికారులకు అధికారాన్ని కల్పించాలని తెలిపింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విపిన్ సంఘీ, జస్టిస్ సచిన్ దత్తా ధర్మాసనం ఈ ఆదేశాలు ఇచ్చింది. 

డీజీసీఏ తరపున న్యాయవాది అంజన గోసాయిన్ వాదనలు వినిపిస్తూ, కోవిడ్-19 ప్రోటోకాల్‌ను కచ్చితంగా అమలు చేయాలని మే 10న పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆదేశాలు ఇచ్చిందన్నారు. మాస్క్ ధారణకు సంబంధించిన అన్ని నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తున్నారని తెలిపారు. 

దీనిపై ధర్మాసనం స్పందిస్తూ, డీజీసీఏ ఈ ఆదేశాలను ఇవ్వడం సరైన చర్యేనని తెలిపింది. ఈ మహమ్మారి తీవ్రత ఇంకా తగ్గలేదని, తన వికృత రూపాన్ని ఇంకా ప్రదర్శిస్తూనే ఉందని పేర్కొంది. నిబంధనలు, మార్గదర్శకాలు ఉంటున్నాయని, కానీ వాటి అమలు వరకు వచ్చేసరికి మనం తడబడుతున్నామని పేర్కొంది. వీటిని సక్రమంగా అమలు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని, చేపట్టిన చర్యలకు సంబంధించిన నివేదికను సమర్పించాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణ జూలై 18న జరుగుతుందని తెలిపింది.

Wednesday, 1 June 2022

అమెరికాలో కాల్పుల కలకలం..

 అమెరికాలో కాల్పుల కలకలం..




రోజురోజుకు పెరుగుతున్న గన్ కల్చర్..

కాల్పుల్లో నలుగురు పౌరులు మృతి..


వెంకటేశ్వర్లపల్లి/ తెలంగాణ:


అమెరికాలో గన్ కల్చర్ రోజురోజుకూ పెరిగిపోతోంది. చిన్నచిన్న కారణాలకే సహనం కోల్పోయి దాడులకు తెగబడుతున్నారు. ఒక్లహామ్ కాల్పుల ఘటనను మరవకముందే మరో ఘటనలు ఏకకాలంలో జరగడం సంచలనంగా మారింది. ఒక్లహామాలోని తుల్సా హాస్పిటల్ కు వచ్చిన దుండగుడు.. ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఫిలిప్ కోసం వచ్చాడు. ఆయన కనిపించకపోయేసరికి తీవ్ర ఆగ్రహంతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. అనంతరం దుండగుడు తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదే సమయంలో పెన్సిల్వేనియాలో పిట్స్‌టన్ వాల్‌మార్ట్ లో, కాలిఫోర్నియా రాష్ట్రం లాస్ ఏంజెల్స్ లో హైస్కూల్ లో కాల్పులు జరగడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కాల్పులు జరిపిన వారి కోసం పోలీసులు గాలింపు చేపడుతున్నారు. అమెరికాలో తుపాకీ సంస్కృతికి రూపుమాపేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నప్పటికీ నిందితుల్లో మార్పు రావకపోవడం ఆందోళన కలిగిస్తోంది. గతంలో జరిగిన ఘటనలో అమెరికాలోని ఓక్లహోమాలో ఆదివారం తెల్లవారు జామున కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఓల్డ్ సిటీ స్కేర్ లో మెమోరియల్ డే ఫెస్టివల్ లో ఈ దారుణం జరిగింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం... తుల్సాకు ఆగ్నేయంగా ఉన్న టాఫ్ట్ సమీపంలో జరిగిన మెమోరియల్ డే భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. సుమారు 1500 మంది ఈ ఫెస్టివల్ లో పాల్గొన్నారు. ఈ ఫెస్టివల్ లో ఘర్షణ చోటు చేసుకుంది. విచక్షణ కోల్పోయిన 26 ఏళ్ల స్కైలర్ బక్నర్ అనే యువకుడు ఒక్క సారిగా కాల్పులు జరిపాడు.

కాల్పుల్లో ఓ మహిళ అక్కడిక్కడే మృతి చెందింది. మరో ఏడుగురు గాయపడ్డారని అధికారులు తెలిపారు. గాయపడిన వారిలో ఒక చిన్నారి ఉన్నారని పోలీసులు చెప్పారు. ఒక్కసారిగా కాల్పులు మోత విన్న వెంటనే ప్రజలు భయాందోళనతో ప్రాణాలు దక్కించుకోవడానికి పరుగులు తీశారు.

టెట్ పరీక్షను వాయిదా వేయాలి..

 టెట్ పరీక్షను వాయిదా వేయాలి..




కేయూ క్యాంపస్ లో నిరసన..


వెంకటేశ్వర్లపల్లి/ తెలంగాణ:


తెలంగాణలో ఈ నెల 12న జరగబోయే టెట్ ఎగ్జామ్ ను వాయిదా వేయాలని బహుజన విద్యార్థి సంఘం(బి.యస్.ఫ్),టి.యస్ .డియస్ఏ, పిడియస్ యూ ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీ లైబ్రరీ ముందు ఈరోజు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బహుజన విద్యార్థి సంఘం కె.యూ ఇంచార్జి, హన్మకొండ జిల్లా అధ్యక్షులు బొట్ల మనోహర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 12న నిర్వహించబోయే టెట్ పరీక్ష ను వాయిదా వేయాలని, ఎందుకంటే అదే రోజు కేంద్రం నిర్వహించే రైల్వే ఆర్ ఆర్ బి పరీక్ష ఉన్నందున, దాని ద్వారా విద్యార్థులు, నిరుద్యోగులు నష్టపోతారని అన్నారు. అలాగే దానికి తోడు తెలుగు అకాడమీ బుక్స్ కూడా అందుబాటులో లేవని, తెలుగు మీడియం అభ్యర్థులకు తెలుగు మాధ్యమ పుస్తకాలు కూడా అందుబాటులో లేవన్నారు  యస్ సి మరియు బి సి స్టడీ సర్కిల్ లో ఇప్పటికి సిలబస్ కూడా పూర్తి కాలేదని బయోలాజికల్ సైన్స్ అభ్యర్థులు నాన్ మ్యాథ్స్ గ్రూప్ కి చెందటం వల్ల టెట్ రెండవ పేపర్  మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ పూర్తి స్థాయిలో ప్రిపేర్ అవడానికి సమయము సరిపోవట్లేదని, టెట్ లో 20 మార్కులు వెయిటేజ్ ఉన్నందున ఆఫ్ మార్క్ తో కూడా జాబ్ కోల్పోయే ప్రమాదం ఉన్నందున టెట్ పూర్తి స్థాయిలో ప్రిపేర్ అవడానికి సమయం ఇవ్వాలి. కావున, టెట్ పరీక్ష ను వాయిదా వేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టి యస్ డి ఎస్ ఏ రాష్ట్ర కన్వీనర్ క్రాంతి కిరణ్, పి డి యస్ యూ కె యూ కార్యదర్శి కొటేశ్వర్ గౌడ్, నాయకులు శంకర్, అశోక్, అరవింద్, రాజు కుమార్, శ్రీకాంత్, శివ, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

ఉస్మానియా ఆస్పత్రిలో దారుణం..

 ఉస్మానియా ఆస్పత్రిలో దారుణం..



పైసలిస్తేనే డెడ్ బాడీ ఫ్రీజర్ లోకి..


వెంకటేశ్వర్లపల్లి, తెలంగాణ:


హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో ఈరోజు దారుణ ఘటన చోటుచేసుకుంది. రూ.1000 ఇస్తేనే మృతదేహాన్ని ఫ్రీజర్‌ బాక్సులో భద్ర పరుస్తామని మార్చురీ సిబ్బంది మృతుడి బంధువులను డిమాండ్‌ చేశారు. బాధితులు ఈ విషయాన్ని తమ సెల్‌ఫోన్‌లో వీడియో చిత్రీకరించడంతో వైరల్‌గా మారింది.  మలక్‌పేటకు చెందిన మహ్మద్‌ ముజీబ్‌ అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న చాదర్‌ఘాట్‌ పోలీసులు కుటుంబీకులతో కలిసి మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు.

అయితే, అక్కడ మార్చురీ వద్ద మద్యం మత్తులో విధుల్లో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగి రాజు మృతదేహాన్ని భద్ర పరచాలంటే రూ.1000 ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశాడు. మీకు డబ్బులు ఎందుకు ఇవ్వాలని కుటుంబ సభ్యులు ఎదురు తిరగడంతో ఇరువురి మద్య వాగ్వాదం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఉన్న రాజు పోలీసులను సైతం తోసివేస్తూ మార్చురీ గదిని మూసివేస్తూ అసభ్య పదజాలంతో దూషించాడు. మృతుడి కుటుంబీకులు అతడిపై ఆసుపత్రి అధికారులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన సూపరింటెండెంట్‌ కాంట్రాక్ట్‌ ఉద్యోగిపై ప్రాథమిక విచారణ చేపట్టిన అనంతరం అతడిని విధుల్లోంచి తొలగించారు.

ఈ సందర్భంగా డాక్టర్‌ బి.నాగేందర్‌ మాట్లాడుతూ.. ఆసుపత్రిలోని ఆపరేషన్‌ థియేటర్లు, వార్డులు సెక్యూరిటీ సిబ్బంది, శానిటరీ సిబ్బంది, మార్చురీ, రోగ నిర్ధారణ కేంద్రాల్లోని సిబ్బంది డబ్బులు డిమాండ్‌ చేస్తే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఉస్మానియా ఆసుపత్రి ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేదేలేదన్నారు.

ఆ గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, పంచాయతీ సెక్రటరీ సస్పెన్షన్

  ఆ గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, పంచాయితీ కార్యదర్శి సస్పెన్షన్ తెలంగాణ: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గాజులగట్టు గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, ...